హోమ్ /వార్తలు /national /

సీఎం జగన్‌కు బీహార్ సీఎం నితీష్ కుమార్ ఫోన్.. ఎందుకంటే..

సీఎం జగన్‌కు బీహార్ సీఎం నితీష్ కుమార్ ఫోన్.. ఎందుకంటే..

వైఎస్ జగన్, నితీష్ కుమార్

వైఎస్ జగన్, నితీష్ కుమార్

సెప్టెంబర్‌ 14 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. సమావేశాల్లో తొలిరోజు డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక జరగుతుంది.

  బీహార్ సీఎం నితీష్ కుమార్ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. గురువారం రాత్రి ఫోన్ చేసిన ఆయన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికపై మాట్లాడారు. డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో జేడీయూ నేత హరివంశ్ నారాయణ్ సింగ్ మరోసారి పోటీ చేస్తున్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యులు ఆయన మద్దతు పలకాల్సిందిగా వైఎస్ జగన్‌ను కోరారు నితీష్ కుమార్. రాజ్యసభలో వైసీపీకి ఆరుగురు సభ్యుల బలం ఉంది. వైసీపీ తరపున విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, పరిమళ్ నత్వాని రాజ్యసభకు ప్రాతినిధ్య వహిస్తున్నారు. వీరు ఓటేస్తే తమ అభ్యర్థి విజయం సునాయాసం అవుతుందని ఈ సందర్భంగా తెలిపారు.

  సెప్టెంబర్‌ 14 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. సమావేశాల్లో తొలిరోజు డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక జరగుతుంది. 2018లో కాంగ్రెస్‌కు చెందిన బీకే హరిప్రసాద్‌ను ఓడించి ఎన్డీయే అభ్యర్థి హరివంశ్‌ డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ ఏడాదితో ఆయన పదవికాలం ముగియనుండడంతో మరోసారి పోటీలో నిలిచారు హరివంశ్ నారాయణ్.

  పార్లమెంట్ సమావేశాలు సెప్టెంబర్‌ 14 నుంచి అక్టోబర్‌ 1 వరకు జరుగుతాయి. సమావేశాలు తొలిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు లోక్‌సభ జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 వరకు రాజ్యసభ జరుగుతుంది. మిగతా రోజుల్లో ఉదయం వేళ రాజ్యసభ, మధ్యాహ్నం వేళ లోక్‌సభ సమావేశాలను నిర్వహిస్తారు. ఉభయ సభల్లోనూ ప్రశ్నోత్తరాలను చైర్మన్‌, స్పీకర్‌ రద్దు చేశారు. కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో సభ్యులు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. ఎంపీలందరికీ పరీక్షలు చేసి కోవిడ్ నెగెటివ్ ఉన్న వారిని, కరోనా లక్షణాలు లేని సభ్యులను మాత్రమే లోపలికి అనుమతిస్తారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, Nitish Kumar

  ఉత్తమ కథలు