హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Bihar Elections: బీహార్‌లో 2005లో జరిగింది... ఇప్పుడు ఎల్జేపీ రివర్స్ చేస్తుందా?

Bihar Elections: బీహార్‌లో 2005లో జరిగింది... ఇప్పుడు ఎల్జేపీ రివర్స్ చేస్తుందా?

చిరాగ్ పాశ్వాన్ (Image; ANI)

చిరాగ్ పాశ్వాన్ (Image; ANI)

243 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న బీహార్‌లో ఎల్జేపీ 137 సీట్లలో పోటీ చేసింది. ఆ పార్టీ తరఫున పోటీ చేసిన వారిలో 90 శాతానికి పైగా బీజేపీ, జేడీయూ రెబల్ క్యాండెట్లు.

  బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఈనెల 10న ఎన్నికల ఫలితాలు రానున్నాయి. అన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు మహాకూటమి గెలుస్తుందని అంచనా వేస్తున్నాయి. లోక్‌జనశక్తి పార్టీకి 3 నుంచి 6 సీట్లు రావొచ్చని చెబుతున్నాయి. ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే 2005లో ఏం జరిగిందో, దానికి ప్రస్తుతం రివర్స్ జరుగుతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 2005లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఎల్జేపీ ఓడిపోయింది. తాము ఓడిపోవడంతో పాటు అప్పటి సీఎం లాలూ ప్రసాద్ ప్రభుత్వం పడిపోవడంలో కూడా కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు మళ్లీ అదే జరగొచ్చని, అయితే, ఈసారి నితీష్ కుమార్ సర్కారు కూలిపోవడం ఖాయమని నిపుణులు భావిస్తున్నారు.

  2005లో రామ్ విలాస్ పాశవాన్ నేతృత్వంలో ఎల్జేపీ పోటీ చేసింది. 243 నియోజకవర్గాలకు గాను 204 సీట్లలో పోటీ చేసింది. కానీ, 10 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అదే సమయంలో ఆర్జేడీని భారీ దెబ్బ కొట్టింది. ‘మేం ఓడిపోయి ఉండొచ్చు. కానీ లాలూ రాజ్‌ను అంతం చేయగలిగాం. మా మిషన్ పూర్తయింది.’ అని అప్పట్లో రామ్ విలాస్ పాశవాన్ వ్యాఖ్యానించారు. ఆర్జేడీ ప్రభుత్వాన్ని దించడంతో పాటు ఎన్డీయే సర్కారు ఏర్పాటు కావడంలో అప్పుడు ఎల్జేపీ క్రియాశీలక పాత్ర పోషించింది.

  2005 ఎన్నికల్లో ఎల్జేపీ 10 సీట్లు గెలుచుకుంది. 12 సీట్లలో రెండో స్థానంలో నిలిచింది. దాదాపు 84 చోట్ల మూడో స్థానం దక్కించుకుంది. ఓట్ల శాతానికి వస్తే 85 సీట్లలో (గెలిచిన సీట్లలో కాకుండా) ఎల్జేపీ అభ్యర్థులు 10 శాతం కంటే ఎక్కువ ఓట్లు పొందారు. 33 సీట్లలో 20 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. వీటిలో చాలా చోట్ల ఎల్జేపీ రెండో స్థానంలో నిలిచింది. అక్కడ ఆర్జేడీ లేదా కాంగ్రెస్ అభ్యర్థులను మూడో స్థానానికి నెట్టేసింది. ఎల్జేపీకి 10 శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చిన నియోజకవర్గాల్లో కూడా ఎన్డీయే అభ్యర్థులు కేవలం 1000 నుంచి 2000 ఓట్ల తేడాతో గెలిచిన సీట్లు ఉన్నాయి. 2005లో ఆర్జేడీ అప్పటికి తమ చేతిలో ఉన్న సీట్లలో 57 సీట్లను కోల్పోయింది. కాంగ్రెస్ 13, ఎన్సీపీ 2 సీట్లు కోల్పోయాయి. ఈసారి అదే ఫార్ములా వర్కవుట్ అయితే, ఎన్డీయేకు, నితీష్ కుమార్‌కు షాక్ తగలడం ఖాయం.

  ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్జేపీ ఒంటరిగా పోటీ చేసింది. ఆ పార్టీ నేత చిరాగ్ పాశవాన్ సీఎం నితీష్ కుమార్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నితీష్ మళ్లీ సీఎం కాలేరని శపథం చేశారు. 243 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న బీహార్‌లో ఎల్జేపీ 137 సీట్లలో పోటీ చేసింది. ఆ పార్టీ తరఫున పోటీ చేసిన వారిలో 90 శాతానికి పైగా బీజేపీ, జేడీయూ రెబల్ క్యాండెట్లు. బీజేపీ, జేడీయూల్లో టికెట్లు దొరకని నేతలు అందరూ ఎల్జేపీలో చేరి టికెట్లు దక్కించుకుని పోటీ చేశారు. ఎన్డీయేకు పడాల్సిన ఓట్లను ఎల్జేపీలో చేరిన నేతలు చీలిస్తే అప్పుడు నితీష్ సర్కారుకు కష్టాలు తప్పవు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Bihar Assembly Elections 2020, Bjp, JDU, Nitish Kumar

  ఉత్తమ కథలు