ఏపీలో జరగనున్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికపై బీజేపీ సీరియస్గా దృష్టి పెట్టింది. తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతుండటంతో.. ఏపీలోనూ అలాంటి ఫలితాలు సాధించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. తెలంగాణలో బీజేపీ సాధిస్తున్న ఫలితాలు.. ఏపీలో తమకు కలిసొస్తాయనే భఆవనలో ఉన్న బీజేపీ నాయకత్వం.. తిరుపతి ఉప ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తే.. రాష్ట్రంలో తమ పరిస్థితి మారుతుందని ఆశిస్తోంది. అందుకే ఏపీలోని అధికార వైసీపీ, విపక్ష టీడీపీని టార్గెట్ చేస్తూ దూకుడుగా ముందుకు సాగాలని నిర్ణయించింది. ఆ దిశగా ఇప్పటికే బీజేపీ నేతల విమర్శలు సాగుతున్నాయి.
అయితే తిరుపతి ఉప ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలన్న బీజేపీ దూకుడును వైసీపీ అంత సీరియస్గా తీసుకోకపోయినప్పటికీ.. విపక్ష టీడీపీ మాత్రం బీజేపీ దూకుడు కారణంగా వైసీపీ కంటే ఎక్కువగా తమకే నష్టం జరిగే అవకాశం ఉందని టెన్షన్ పెడుతున్నట్టు తెలుస్తోంది. ఏపీలో ఇప్పటికప్పుడు అధికార వైసీపీని దెబ్బకొట్టే స్థాయిలో బీజేపీ లేదు. అయితే ప్రతిపక్షంగా ఉన్న టీడీపీని బలహీనపరిచి.. ఆ పార్టీ ఓటు బ్యాంకును, స్థానాన్ని తాము సొంతం చేసుకోగలిగితే.. భవిష్యత్తుల్లో తమకు మంచి ఫలితాలు వస్తాయని బీజేపీ యోచిస్తోంది. ఇదే టీడీపీకి ఆందోళన కలిగించే విషయమని పలువురు అభిప్రాయడుతున్నారు.
తెలంగాణలో బీజేపీ బలపడటం ద్వారా అధికార టీఆర్ఎస్కు జరిగిన నష్టం కంటే విపక్ష కాంగ్రెస్కు జరిగిన నష్టం ఎంతో ఎక్కువ అని పలువురు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ ఏపీలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లోనూ బీజేపీ బలపడితే.. దాని ప్రభావం వైసీపీ కంటే ఎక్కువగా టీడీపీపై పడే అవకాశం ఉందనే ప్రచారం కూడా సాగుతోంది. తిరుపతిలో తమ పార్టీకి మంచి ఫలితాలు వస్తే.. ఆ తరువాత కూడా బీజేపీ ఏపీ రాజకీయాల్లో ఇదే రకమైన దూకుడును కొనసాగిస్తుందని.. ఆ ప్రభావం టీడీపీపై ఎక్కువగా ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Bjp, Chandrababu naidu, Tirupati Loksabha by-poll