తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్ షాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను ఆయన ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన డీఎస్.. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లేదన్న కారణంగా టీఆర్ఎస్‌కు దూరంగా ఉంటున్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన కుమారుడు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ నుంచి విజయం సాధించారు. కేసీఆర్ కుమార్తె కవిత మీద అరవింద్ 70,875 ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. దీంతోపాటు తెలంగాణలో బీజేపీ నాలుగు ఎంపీ సీట్లు కైవసం చేసుకుంది. తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేయాలని ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన అమిత్ షా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్ అమిత్ షాను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టీఆర్ఎస్ పార్టీకి రాజ్యసభలో ఆరుగురు సభ్యులు ఉన్నారు.డీఎస్‌తోపాటు కె.కేశవరావు, జోగినిపల్లి సంతోష్ కుమార్, వి.లక్ష్మీకాంతరావు, బండ ప్రకాష్, లింగయ్య యాదవ్ ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.