హోమ్ /వార్తలు /national /

Bhuma Akhila Priya: జైలులో అఖిలప్రియకు ప్రాణహాని..! భూమా మౌనిక సంచలన ఆరోపణలు

Bhuma Akhila Priya: జైలులో అఖిలప్రియకు ప్రాణహాని..! భూమా మౌనిక సంచలన ఆరోపణలు

భూమా అఖిల ప్రియ (ఫైల్)

భూమా అఖిల ప్రియ (ఫైల్)

హైదరాబాద్ (Hyderabad) బోయిన్ పల్లిలో చోటు చేసుకున్న కిడ్నాప్ వ్యవహారం సంచలనం రేపుతోంది. కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ (Bhuma Akhila Priya) అరెస్ట్ పై ఆమె సోదరి మౌనికా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్ బోయిన్ పల్లిలో చోటు చేసుకున్న కిడ్నాప్ వ్యవహారం సంచలనం రేపుతోంది. భూ వివాదంలో బోయిన్ పల్లికి చెందిన సీఎం కేసీఆర్ బంధువులైన ప్రవీణ్‌రావు, సునీల్‌రావు, నవీన్‌రావు కిడ్నాప్ చేసిన కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె చంచల్ గూడ జైలులో ఉన్నారు. బెయిల్ కోసం వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఆమె మరికొన్నాళ్లు జైలు గోడలకు పరిమితం కాక తప్పేలాలేదు. మరోవైపు ఈ వ్యవహారంపై అఖిల ప్రియ చెల్లెలు భూమా మౌనికా రెడ్డి స్పందించారు. కిడ్నాప్ కేసులో తన అక్కను అనవసరంగా ఇరికించారని ఆరోపించారు. అఖిలప్రియే డైరెక్ట్ గా వెళ్లి కిడ్నాప్ చేసినట్లు సృష్టిస్తున్నారన్నారు.

అఖిలకు ప్రాణహాని

జైలులో తన అక్కను టెర్రరిస్టుకంటే ఘోరంగా చూస్తున్నారని మౌనికా రెడ్డి ఆరోపించారు. గర్భవతి అయిన ఆమెకు కనీసం వైద్య సహాయం కూడా అందించడంలేదన్నారు. అంతేకాదు అఖిలకు జైలుల్లో ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అటు ఆంధ్రప్రదేశ్ లో తమపై కేసులు పెట్టీ.. హైదరాబాద్ లోనూ కేసులు పెట్టి వేధిస్తుంటే ఎక్కడి వెళ్లాలని ప్రశ్నించారు. అంతేకాదు ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆదేశాలు వస్తున్నాయేమోనన్న అనుమానం ఉందన్నారు. జైలులో అఖిలప్రియ పరిస్థితి బాగోలేదని.., ఆమె ముక్కు, చెవుల నుంచి రక్తం కారుతున్నా పట్టించుకోవడం లేదని మౌనిక అన్నారు. ఫిట్స్ వచ్చి పడిపోతేగానీ మెడికల్ రిపోర్ట్స్ కోసం ఫోన్ చేయలేదన్నారు. తల్లిదండ్రులు లేని తమను దారుణంగా వేధిస్తున్నాని.. కోర్టులో కూడా న్యాయం జరగడం లేదని మౌనికా రెడ్డి వాపోయారు. తన తండ్రి భూమా నాగిరెడ్డి బ్రతికున్నప్పటి నుంచీ హఫీజ్ పేట్ స్థలంపై వివాదం ఉందన్నారు. భూమా ఫ్యామిలీని ఆర్ధికంగా, రాజకీయంగా దెబ్బకొట్టాలని చూస్తున్నారన్నారు. ఈ విషయంలో తమకు తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, కవిత స్పందించి తమకు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

మరోవైపు భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్ పై సికింద్రాబాద్ కోర్టులో విచారణ జరిగింది. భూమా అఖిల ప్రియకు బెయిల్ మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. అఖిలప్రియ పలుకుబడి కలిగిన వ్యక్తి కావడంతో సాక్ష్యాధారాలను ప్రభావితం చేసే అవకాశముందని పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే ఆమెపై తప్పుడు కేసులు పెట్టాల్సిన అవసరం తమకు లేదన్న పోలీసులు.. ఈ కేసులో మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించాల్సి ఉందన్నారు. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు కూడా నమోదు చేయాల్సి ఉందని.., అఖిలప్రియ బెయిల్‌పై విడుదలైతే కేసు దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేయడమే కాకుండా మరిన్ని నేరాలు చేస్తారని ఆరోపించారు. అంతేకాకుండా విచారణ నుంచి తప్పించుకునే అవకాశముందని వివరించారు.  ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు అఖిలప్రియ హెల్త్ బులిటెన్ ను సమర్పించాలంటూ జైలు అధికారులను కోర్టు ఆదేశించింది.

First published:

Tags: Andhra Pradesh, AP Politics, Bhuma Akhilapriya, Hyderabad, Telangana Police

ఉత్తమ కథలు