సాధారణంగా ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలు అసెంబ్లీలో, ఎంపీలు పార్లమెంట్‌లో, కార్పొరేటర్లు కార్పొరేషన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తారు. కానీ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొత్త సంప్రదాయానికి తెరలేపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ కార్పొరేటర్లతో కలిసి చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారికి ఆలయాన్ని ఆయన సందర్శించారు. గుడిలో పూజల అనంతరం అక్కడే కొత్త కార్పొరేటర్లతో ప్రమాణం చేయించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, వార్డు సమస్యలను పరిష్కరిస్తామని, జాతీయవాదానికి, బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటామని.. వారితో ప్రమాణ పత్రాన్ని చదివించారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా ఎక్కువ సీట్లు సాధించినందున భాగ్యలక్ష్మీ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు బండి సంజయ్. ఆయన వెంట గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉన్నారు.
''ప్రజల ఆశీస్సులు, భాగ్యలక్ష్మీ అమ్మవారి కృప వల్లే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచాం. అమ్మవారి శక్తిని దేశవ్యాప్తంగా చాటేందుకే ఇక్కడకు వచ్చాం. మజ్లిస్ విముక్త హైదరాబాదే మా లక్ష్యం. కానీ టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి కుట్రలు చేస్తున్నారు. ఓల్డ్ సిటీకి మెట్రో ఎందుకు వద్దంటున్నారు. కంపెనీలు ఎందుకు రావడం లేదు. సంఘ విద్రోహ శక్తులకు ఎందుకు అడ్డాగా మారింది. మేం ఏ మతానికి వ్యతిరేకం కాదు. కానీ హిందూ సమాజానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే మాత్రం ఊరుకునేది లేదు. పాతబస్తీకి మళ్లీ మళ్లీ వస్తాం. ఈ పేద ప్రజల ప్రాంతం. మా అడ్డా. కేసీఆర్ ఎన్నికలను ఎందుకు ఆగమాగం నిర్వహించారు. మేయర్ ఎన్నికను ఎందుకు ఆలస్యం చేస్తున్నారో టీఆర్ఎస్ నేతలు చెప్పాలి'' అని బండి సంజయ్ పేర్కొన్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో బీజేపీ రాజకీయాలు భాగ్యలక్ష్మీ ఆలయం చుట్టే తిరిగాయి. వరద సాయం నిలిపివేతకు బీజేపీయే కారణమని టీఆర్ఎస్ ఆరోపించడంతో.. బండి సంజయ్ భాగ్యలక్ష్మీ ఆలయానికి వెళ్లారు. ఎన్నికల సంఘానికి తాను ఎలాంటి లేఖ రాయలేదని.. అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్పారు. ఆ తర్వాత హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన అమిత్ షా.. మొదట భాగ్యలక్ష్మీ అమ్మవారికి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటిన విషయం తెలిసిందే. మొత్తం 150 సీట్లకు గాను టీఆర్ఎస్ 56 సీట్లు, బీజేపీ 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ 2 సీట్లు సాధించింది. గత ఎన్నికల్లో 99 సీట్లు సాధించిన టీఆర్ఎస్.. ఈసారి 56కే పరిమితమయింది. ఇక గతంలో 4 సీట్లే గెలిచిన కాషాయ దళం.. ఈ ఎన్నికల్లో ఏకంగా 48 స్థానాలకు ఎగబాకింది. ఎంఐఎం 44 సీట్లతో పాతబస్తీలో తన పట్టును నిలుపుకుంది. ఎవరికీ మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. ఐతే మేయర్ పీఠం ఎవరిని వరిస్తుందన్న అందరిలోనూ దానిపై ఆసక్తి నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, Bjp, Hyderabad - GHMC Elections 2020, Telangana