హోమ్ /వార్తలు /national /

AP Telangana Water Dispute: ఆగస్టు 25న కేసీఆర్, జగన్ భేటీ

AP Telangana Water Dispute: ఆగస్టు 25న కేసీఆర్, జగన్ భేటీ

కేసీఆర్, వైఎస్ జగన్

కేసీఆర్, వైఎస్ జగన్

Apex Council meeting | కృష్ణా, గోదావరి జల వివాదాలను పరిష్కరించేందుకు కేసీఆర్, జగన్‌తో కేంద్రం ఈ సమావేశం ఏర్పాటు చేస్తోంది.

  KCR, YS Jaganmohan Reddy meeting | ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలవివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర జలసంఘం ఈనెల 25న అపెక్స్ కౌన్సిల్ సమావేశం కానుంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ భేటీకి హాజరుకానున్నారు. గతంలో ఆగస్టు 5న అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కేంద్ర జలవనరుల శాఖ నిర్ణయించింది. అయితే, అదే రోజు తమకు అత్యంత ముఖ్యమైన సమావేశం, కేబినెట్ భేటీ ఉన్నందున ఆ రోజు కుదరదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలో మరోసారి రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలను పరిష్కరించేందుకు కేంద్రం మరో తేదీని ఫిక్స్ చేసింది. ఈసారి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశానికి హాజరుతారని తెలుస్తోంది. అలాగే, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకానున్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించి రెండు రాష్ట్రాలు పరస్పరం ఆయా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డులకు ఫిర్యాదు చేశాయి. ఈ క్రమంలో కేంద్రం జోక్యం చేసుకుని ఇద్దరు ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తోంది.

  కృష్ణా నదిపై శ్రీశైలం ఎగువన పోతిరెడ్డిపాడు వద్ద నీటిని తీసుకుని రాయలసీమకు అందివ్వాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. ఈ అంశం రెండు రాష్ట్రాల మధ్య వివాదాన్ని రేపింది. తెలంగాణకు దక్కాల్సిన నీటిని ఏపీ తీసుకెళ్తుందని కేసీఆర్ ప్రభుత్వం వాదించింది. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు అనుమతి లేకుండా కృష్ణా నదిపై కొత్త ప్రాజెక్టు కడుతోందని ఆరోపించింది. అయితే, తెలంగాణ ప్రభుత్వం గోదావరిపై కొత్త ప్రాజెక్టులు కడుతోందంటూ ఏపీ సర్కారు వాదించింది. దీంతో ఓ వైపు తెలంగాణ, మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు తమ ప్రాజెక్టులు కరెక్టేనని పట్టుబట్టాయి. ఈ క్రమంలో రివర్ మేనేజ్‌మెంట్ బోర్డులు జోక్యం చేసుకున్నా.. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఇద్దరు ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి చర్చించి సమస్యను పరిష్కరించాలని భావించింది. దీనికి ఆగస్టు 5న ముహూర్తం ఫిక్స్ చేసినా ఆ తేదీన కుదరదని, ఆగస్టు 20 తర్వాత భేటీ ఏర్పాటు చేయాలంటూ కేంద్రానికి తెలంగాణ లేఖ రాసింది. దీంతో ఆగస్టు 25న అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు.

  ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ భేటీలో పాల్గొంటారు. అలాగే కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా వీసీ ద్వారా హాజరవుతారు. రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులు కూడా ఈ భేటీలో పాల్గొని తమ తమ ముఖ్యమంత్రులకు సంబంధిత అంశాలపై ఎప్పటికప్పుడు సూచనలు అందించనున్నారు. అయితే, తమ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తగ్గేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. ఈ క్రమంలో కేంద్రం ఎలాంటి సయోధ్య కుదుర్చుతుందా అని ఆసక్తి నెలకొంది. ఇటీవల తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఏపీతో స్నేహం కొనసాగుతుందని, తెలంగాణకు నీటి వాటాల విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. దేనిదారి దానిదేనని తేల్చి చెప్పారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, CM KCR, Godavari river, Krishna River Management Board, Telangana

  ఉత్తమ కథలు