ఆంధ్రప్రదేశ్ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వివాదంపై కాంగ్రెస్ పార్టీ కూడా రంగంలోకి దిగింది. రమేష్ కుమార్ తొలగింపు, కనగరాజ్ నియామకం చెల్లదంటూ ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను కూడా హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఏపీలో రమేష్ కుమార్ తొలగింపు వివాదం రాజకీయంగా పెనుదుమారాన్ని సృష్టించింది. ఆయన తొలగింపుతో పాటు వెనువెంటనే మద్రాస్ హైకోర్టు మాజీ జడ్జి కనగరాజ్‌ను నియమించారు. ఆయన పదవీబాధ్యతలు కూడా తీసుకున్నారు. దీనిపై గతంలో విచారణ జరిపిన హైకోర్టు వాయిదా వేసింది.
ఓ వైపు హైకోర్టులో వివాదం కొనసాగుతుండగానే, మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలతో రమేష్ కుమార్ కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ మీద విచారణ జరపాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ డీజీపీకి లేఖ రాశారు. రమేష్ కుమార్ సంతకాన్ని టీడీపీ నేతలు కనకమేడల రవీంద్ర కుమార్, టీడీజనార్దన్, వర్ల రామయ్య ఫోర్జరీ చేశారంటూ ఆరోపణలు గుప్పించారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరపాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. అయితే, ఆ లేఖ తానే రాశానని, ఇందులో థర్డ్ పార్టీ వ్యక్తులు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ రమేష్ కుమార్ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Congress, AP High Court, Ap local body elections, Nimmagadda Ramesh Kumar