హోమ్ /వార్తలు /national /

Vizag Steel Plant: ఒక మంత్రి ఎస్ అంటే? మరో మంత్రి నో అంటున్నారు? రాజీనామాల విషయంలో అధిష్టానం మాటేంటి?

Vizag Steel Plant: ఒక మంత్రి ఎస్ అంటే? మరో మంత్రి నో అంటున్నారు? రాజీనామాల విషయంలో అధిష్టానం మాటేంటి?

ఒకరు ఎస్ అంటే మరొకరు నో అంటున్నారు

ఒకరు ఎస్ అంటే మరొకరు నో అంటున్నారు

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. అయితే టీడీపీ నేతలు మాత్రం వైసీపీ ఎంపీలు, మంత్రులు రాజీనామా చేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుంది అని వారిపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.. కానీ ఒక మంత్రి రాజీనామాలు ఎందుకు వేస్ట్ అంటే.. మరో మంత్రి మేం రాజీనామాలకు సిద్ధం అంటున్నారు.

ఇంకా చదవండి ...

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఎగసిపడుతోంది. సోమవారం నుంచి విరామం లేకుండా కార్మిక సంఘాలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమంలో భాగమవుతున్నాయి. అయితే మొన్నటి వరకు రాష్ట్రంలో అధికార వైసీపీ ఏం చెప్పినా కార్మిక సంఘాలు నమ్మాయి కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర ఆందోళనల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే అంతా జరుగుతోందని.. కార్మిక సంఘాలు, విపక్షాలు విమర్శిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో వైసీపీపై ఒత్తిడి పెరుగుతోంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సైతం వైసీపీ, బీజేపీలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీలు, మంత్రులు అంతా రాజీనామా చేస్తే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందని.. అప్పుడు కేంద్రం దిగి వస్తుందని గంటా శ్రీనివాసరావు కోరారు. అలాగే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సైతం టీడీపీ ఎమ్మెల్యేలు అంతా రాజీనామాకు సిద్ధంగా ఉన్నాం.. వైసీపీ నేతలు రెడీనా అంటూ సవాల్ విసిరారు. ఇలా అన్ని వైపుల నుంచి తమపై ఒత్తిడి వస్తుండడంతో వైసీపీ నేతలు దీనిపై స్పందించారు. అయితే ఒక్కో మంత్రి ఒక్కోలా స్టేట్ మెంట్ ఇచ్చారు.

ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేస్తే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగుతుందా? రాజీనామాలు చేయడం వల్ల ఉపయోగాలు ఏమైనా ఉందా? అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఐదారుగురు రాజీనామా చేస్తే వైసీపీకి చెందిన 151 మంది రాజీనామాలు చేయాలని అచ్చెన్నాయుడు అనడం అర్థరహితంగా ఉందన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రంపై ఉమ్మడిగా పోరాడి సాధించాలన్నారు పెద్దిరెడ్డి. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి రుచి చూసిన చంద్రబాబు ఉక్రోషంతో మాట్లాడుతున్నారని ఆరోపించారు. టీడీపీ సహా అన్ని రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లను ఢిల్లీ తీసుకెళ్తామని సీఎం జగన్ చెప్పారని.. టీడీపీ హయాంలో ఏ సమస్యపైన అయినా అఖిలపక్షం పెట్టారా? అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. సజ్జల కూడా ఇదే మాట అన్నారు. తామెందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు.

తమ రాజీనామాతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందంటే మేం సిద్ధమంటున్నారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్జి. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలంతా రాజీనామాలు చేయడానికి వెనుకాడరని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపడమే ప్రభుత్వం ముఖ్య లక్ష్యమని.. అందుకోసం అధిష్టానం ఏం నిర్ణయం తీసుకున్నా తామంతా కట్టుబడి ఉంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున బిడ్డింగులో పాల్గొనడం వంటివి ప్రభుత్వం ముందున్న ప్రత్యామ్నాయాలని... బిడ్డింగులో పాల్గొనే అంశంపై ఇప్పుడే ఆలోచన చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రధాని అపాయింట్ మెంట్‌ నా ఇస్తే.. విశాఖ ఉక్కు కర్మాగారానికున్న సెంటిమెంటును అర్ధమయ్యేలా వివరిస్తామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని ఆర్దిక వనరుగా కాకుండా ఆంధ్రుల సెంటిమెంటుగా భావించాలని ఆయన కోరారు.

First published:

Tags: Andhra Pradesh, Mekapati Goutam Reddy, Peddireddy Ramachandra Reddy, Visakha, Visakhapatnam, Vizag, Vizag Steel Plant

ఉత్తమ కథలు