ఎవరి విమర్శలు ఎలా ఉన్నా.. ప్రస్తుతం ఏపీలో వైసీపీ అత్యంత బలమైన రాజకీయశక్తిగా కొనసాగుతోంది. ప్రతి ఎన్నికల్లోనూ తిరుగులేని విజయాలు సాధిస్తూ.. ప్రత్యర్థులకు సరికొత్త సవాల్ విసురుతోంది. ప్రత్యర్థులు ఎన్ని విమర్శలు చేసినా.. ఎన్నికల్లో మాత్రం వైసీపీని ఎదుర్కోవడంలో టీడీపీ, జనసేన కొంచెం కూడా సక్సెస్ కావడం లేదన్నది వస్తున్న ఫలితాలను బట్టి అర్థమవుతోంది. అయితే అధికారంలో ఉన్న పార్టీ.. ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడం కొత్త విశేషమేమీ కాకపోయినా.. వైసీపీ సాధిస్తున్న విజయాలు మాత్రం అందుకు భిన్నంగానే ఉంటున్నాయనేది రాజకీయవర్గాల్లో వినిపిస్తున్న మాట. ప్రత్యర్థుల నుంచి వైసీపీకి పెద్దగా పోటీ ఎదురుకావడం లేదని.. అసలు ప్రత్యర్థులకు వైసీపీ పెద్దగా అవకాశం కూడా ఇవ్వడం లేదన్నది మరో వాదన.
ఏపీలో జరిగిన తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక, బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నిక, తాజాగా చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీలోనూ వైసీపీ ఘన విజయాలను నమోదు చేసింది. తిరుపతి, బద్వేల్ వంటి చోట సీఎం జగన్ ప్రచారం కూడా చేయలేదు. అయితే ఈ మూడు విజయాల్లో వైసీపీ తరపున అత్యంత కీలకంగా వ్యవహరించిన ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. వైసీపీకి నయా ట్రబుల్ షూటర్‌గా మారారనే చర్చ జరుగుతోంది. చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు.
చిత్తూరు జిల్లాలో ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న పుంగనూరు సహా పలు నియోజకవర్గాలపై పెద్దిరెడ్డి ప్రభావం ఉంటుందని వైసీపీ వర్గాలు చెబుతుంటాయి. అయితే కేవలం చిత్తూరు జిల్లాలో మాత్రమే కాకుండా.. కడప జిల్లా బద్వేలులోనూ వైసీపీ ఘన విజయం సాధించడంలో పెద్దిరెడ్డి పాత్ర ఉందనే టాక్ ఉంది. ఇక తాజాగా కుప్పం మున్సిపాలిటీలోనూ వైసీపీ ఘన విజయం సాధించేలా చేసి చంద్రబాబు కంచుకోటపై వైసీపీ జెండాను ఎగరేసేలా చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. వచ్చే ఎన్నికల్లో ఆయన కుప్పం వదిలి మరో నియోజకవర్గం చూసుకోవాల్సిందే అని సవాల్ విసిరారు.
Revanth Reddy: హైకమాండ్ ముఖ్యనేత ప్రశ్న.. రేవంత్ రెడ్డి నిర్ణయాలు మారనున్నాయా ?
K Chandrashekar Rao: వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి.. కేసీఆర్ లెక్కేంటి ?
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీకి సాధించిపెడుతున్న విజయాలు చూస్తున్న చాలామంది.. వైసీపీకి ఆయన ట్రబుల్ షూటర్‌గా మారిపోయారని చర్చించుకుంటున్నారు. వైసీపీకి విజయం అందించే విషయంలో జగన్ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పని చేస్తున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భవిష్యత్తులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సేవలను కేవలం చిత్తూరు జిల్లాకు మాత్రమే కాకుండా రాయలసీమతో పాటు ఇతర జిల్లాల్లోనూ జగన్ వినియోగించుకునే అవకాశం ఉందని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Peddireddy Ramachandra Reddy