పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్ పారదర్శకంగా నిర్వహిస్తున్నామని సాగునీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. మాజీ సీఎం చంద్రబాబు ప్రాజెక్టు పనులను మ్యాక్స్ ఇన్ఫ్రా కపెంనీకి 4.77శాతం ఎక్కువకు టెండరింగ్ ఇస్తే.. అదే కంపెనీకి వైసీపీ 15శాతం తక్కువకు టెండరింగ్ ఇచ్చిందన్నారు. నవంబర్ నుంచి రివర్స్ టెండరింగ్ ద్వారా పనులు మొదలుపెడుతామని చెప్పారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయమే తప్ప నష్టం లేదని స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో జరిగిన పోలవరం పనుల్లో ప్రతీది ఖర్చు పెంచేశారని ఆరోపించారు. రూ.36వేల కోట్ల పనులు ఇంకా పెండింగ్లో ఉండగానే.. ప్రాజెక్టును పూర్తి చేశానని చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నారని విమర్శించారు. తమవాళ్లకే టెండరింగ్స్ కట్టబెడుతున్నారని వైసీపీని చంద్రబాబు విమర్శించడం సరికాదన్నారు. నవయుగ లేదా చంద్రబాబుకు సంబంధించిన కంపెనీలు కూడా రివర్స్ టెండరింగ్లో పాల్గొనవచ్చునని.. తామేమీ అడ్డుపడట్లేదని చెప్పారు.
పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం మొత్తం రూ.55వేల కోట్లు అయితే.. ఇంకా రూ.32వేల కోట్లు పని మిగిలే ఉందని..జరిగిన పనిలోనూ ఎక్కువ శాతం వైఎస్ హయాంలోనే జరిగిందన్నారు. అలాంటప్పుడు ప్రాజెక్టును పూర్తి చేశానని చంద్రబాబు ఎలా చెబుతారని ప్రశ్నించారు.చంద్రబాబు నాయుడు జగన్ను చూసి ఉలికిపడుతున్నారని విమర్శించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.