ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయాలతో దూకుడు పెంచుతున్నారు. ఇప్పటి వరకు ఉన్న సంప్రదాయాలకు తెరదించుతూ పాలనలో సౌలభ్యం కోసం సరికొత్త నిర్ణయాలకు శ్రీకారం చుడుతున్నారు. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుంటుకుంటున్నారు. ఏపీ వ్యాప్తంగా ఇకపై కార్పొరేషన్లకు ఇద్దరు డిప్యూటీ మేయర్లు.. మున్సిపాలిటీలకు ఇద్దరు వైస్ చైర్ పర్సన్లు ఉండాలని భావిస్తున్నారు..
దీనికి సంబంధించి ఆర్డినెన్స్ రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఆర్డినెన్స్ ను రూపొందించిన తరువాత రాష్ట్ర గవర్నర్ ఆమోదానికి పంపించనున్నారు. గవర్నర్ ఆమోదం పొందిన వెంటనే నిర్ణయాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ నెల 18ర మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగనుంది. ఆ ఎన్నిక సమయానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా.. ఒక మేయర్, ఒక డిప్యూటీ మేయర్ తో ప్రమాణ స్వీకారాన్ని పూర్తి చేస్తారు. అయితే ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలిపిన తరువాత ఇద్దరు డిప్యూటీ మేయర్లు, ఇద్దరు వైస్ చైర్ పర్సన్లను ఎంపిక చేస్తారు.
దీనికి ఎలాంటి ఇబ్బందులు లేకుండానే ఆర్డినెన్స్ రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో పాలనా సౌలభ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి. ముఖ్యంగా పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీ తనం ఉండాలనే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు పెద్దిరెడ్డి.
అయితే ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్ లోనూ ఇదే ఫార్ములా కొనసాగుతుంది. ఇప్పటికే సామాజిక సమీకరణాలతో ఐదుగురు డిప్యూటీ సీఎంలకు అవకాశం కల్పించారు సీఎం జగన్. ఇప్పుడు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనూ అదే ఫార్ములాను అమలు చేసేందుకు ఆయన శ్రీకారం చుట్టారు. ఎందుకంటే ఏపీ వ్యాప్తంగా అన్ని కార్పొరేషన్లను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మున్సిపాలిటీల విషయాలకు వస్తే.. ప్రతిపక్షం కేవలం రెండు చోట్ల గెలుపొందింది. మిగిలినవన్నీ వైసీపీ ఖాతాలోనే చేరాయి. మైదుకూరు, తాడిపత్రిల్లో మాత్రం ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఖాతాలో చేరాయి. అయితే ఆ రెండు చోట్ల కూడా ఎక్స్ అఫిషియో సభ్యుల బలంతో చైర్మన్ గిరిని సొంతం చేసుకుంటామని వైసీపీ ధీమాగా ఉంది. దీంతో ఆ రెండు చోట్ల క్యాంపు కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.
వైసీపీ గెలిచిన అన్ని చోట్లా బారీ మెజార్టీనే సాధించింది. ఎక్కడా ప్రతిపక్షాలు పోటీ కూడా ఇవ్వలేదు. దీంతో అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ల పదవికి విపరీతమైన పోటీ ఉంది. దీంతో కొంతమంది అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. వీటన్నంటినీ బేరీజు వేసుకునే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇద్దరు డిప్యూటీ మేయర్ల ఎంపికతో సమాజిక వర్గాల లెక్కన అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉంటుందని.. అలాగే అందరికీ సమ న్యాయం చేసే పరిస్థితి ఉంటుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఈ ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలిపుతారో లేదో చూడాలి. సాధరణంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తాయి. కానీ మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఎక్కడా ప్రభావం చూపలేకపోయాయి. దీంతో ఎవరూ విమర్శించే ప్రయత్నం కూడా చేయడం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ap local body elections, AP News, Municipal Elections, Peddireddy Ramachandra Reddy, Ys jagan, Ys jagan mohan reddy