ఏపీలో తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతోంది. ఇప్పటికే నామినేషన్ల పక్రియ ఆదివారంతో ముగిసింది. కొన్ని చోట్ల మినహా చాలా చోట్ల ప్రశాంత వాతావరణంలోనే నామినేషన్ల ప్రక్రియ జరిగింది. ఇక మిగిలిన నామినేషన్ల ఉపసంహరణ, ప్రచారం పర్వం, పోలింగ్ ప్రక్రియ విషయంలో అధికారులు అన్ని ఏర్పాట్లను చకచకా పూర్తిచేస్తున్నారు. ఓ వైపు అధికారులు ఎన్నికల ప్రక్రియ విషయంలో హైరానా పడుతోంటే, మరోవైపు రాజకీయ పార్టీలు కూడా గుట్టుగా డబ్బుల పందేరానికి తెరలేపారు. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు అత్యంత కీలకంగా భావించే డబ్బు పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ముందస్తుగానే డబ్బులను సమకూర్చుకుంటున్నాయి. అయితే రాష్ట్ర పోలీసు యంత్రాంగం కొన్ని చోట్ల డబ్బు పంపిణీకి చెక్ పెడుతున్నాయి. తాజాగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో కోటి రూపాయలు పట్టుబడటం తీవ్ర కలకలం రేపుతోంది.
ఏపీ, తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో గరికపాడు చెక్ పోస్ట్ వద్ద ప్రతినిత్యం తనిఖీలు జరుగుతుంటాయన్న సంగతి తెలిసిందే. ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ తనిఖీలను పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు. ఆదివారం కూడా పెద్ద సంఖ్యలో పోలీసులు తనిఖీల ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ఓ కారును నడుపుతున్న వ్యక్తి వైఖరిపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో అతడిని కిందకు దింపి కారును ఆసాంతం తనిఖీ చేశారు. ఈ క్రమంలో కారు డిక్కీలోని ఓ బ్యాగులో కోటి రూపాయల నగదు లభ్యమయింది. వాటికి సంబంధించిన పత్రాలను ఆ కారులో ఉన్న వ్యక్తి చూపించకపోవడంతో ఆ డబ్బును పోలీసులు సీజ్ చేశారు.
హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఆ కారులో లభ్యమైన కోటి రూపాయల నగదును పంచాయతీ ఎన్నికల్లో పంచడానికే తీసుకెళ్తున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ఎన్నికల డబ్బా, లేక హవాలా డబ్బా..? అనేది ఆరా తీస్తున్నామని, త్వరలోనే ఈ డబ్బునకు సంబంధించిన అసలు యజమానులెవరో తెలుస్తామని చెబుతున్నారు. కాగా, ఎన్నికల సమయంలో హైదరాబాద్ నుంచి ఏపీకి డబ్బు సరఫరా జరుగుతుందని పోలీసులకు ముందే సమచారం అందింది. అందుకే ఈ సారి విస్తృతంగా తనిఖీలను చేపట్టారు. మున్ముందు కూడా మరింత అప్రమత్తంగా ఉంటామనీ, నగదు రవాణాను అరికడతామని పోలీసులు వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm jagan, Ap local body elections, Bjp, Chandrababu Naidu, Crime news, Janasena, Nimmagadda Ramesh Kumar