ఎన్నికల సందర్భంగా ఏపీకి తరలిస్తున్న డమ్మీ ఈవీఎంలను ఎన్నికల అధికారులు గుర్తించారు. తమ గుర్తుపై ఏ విధంగా ఓటు వేయాలో ప్రచారం చేసుకోవడానికి రూపొందించిన డమ్మీ ఈవీఎంలను భారీ సంఖ్యలో పశ్చిమగోదావరి జిల్లాకు తరలిస్తుండగా .. కొయ్యలగూడెం వద్ద నరసన్నపాలెం చెక్‌పోస్టు వద్ద ఎన్నికల నిఘా విభాగం అధికారులు గుర్తించారు. 2200 డమ్మీ ఈవీఎంలతో వెళ్తున్న టీఎస్ 08 యుడి 4408 నంబర్ గల మినీ వ్యాన్‌ను అధికారులు నిలిపివేశారు. ధర్మకోల్ షీట్లలో తయారు చేసిన ఈవీఎంలలో బ్యాటరీ వేసి ఒక గుర్తుపై బటన్ నొక్కితే కుయ్‌మని శబ్దం కూడా వస్తోంది. దీంతో అనుమానం వచ్చిన అధికారులు వాహనాన్ని నిలిపి చెక్‌పోస్ట్ స్క్వాడ్ ఇన్‌చార్జ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమాచారం అందించారు. వాహనంలో ఉన్నవారి వద్ద బిల్లులు పరిశీలిస్తుండగా... వాహనం హైదరాబాద్ నుంచి విశాఖకు వెళ్తున్నట్లుగా గుర్తించారు. ఈ ఈవీఎంలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవిగా భావిస్తున్నారు.
పోలవరం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి తెల్లం బలరాజుకు 30 డమ్మీ ఈవీఎంలు ఇచ్చినట్టు మధ్యలో కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని దించి వెళ్తున్నట్లు గుర్తించారు. జంగారెడ్డిగూడెంకు చెందిన జె. సుధాకర్ రెడ్డి పేరుతో కొన్ని డమ్మీ ఈవీఎంల ఇన్వాయిస్ ఉందని చెక్‌పోస్టు ఇన్‌ఛార్జి తెలిపారు. ఈ డమ్మీ ఈవీఎంలను హైదరాబాద్‌లోని యూమార్క్ ఎప్రాల్స్ సంస్థ తయారు చేసిందని తెలిపారు.
స్వాధీనం చేసుకున్న డమ్మీ ఈవీఎంలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఒక్కో ఈవీఎం రూ.16కు కొనుగోలు చేసినట్లు నిందితులు బిల్లులు చూపించారు. అయితే.. ఒక ఈవీఎం ఖరీదు సుమారు రూ.100 మాత్రమే ఉంటుందని అధికారులు గుర్తించారు. 2,400 ఈవీఎంలకు రూ.2.40 లక్షలు ఖర్చును భీమవరం టీడీపీ అభ్యర్థి పి రామాంజనేయులు ఖర్చులో జమచేసి ఎన్నికల కమిషన్‌కు నివేదిక పంపించారు.
విశాఖపట్నంలోని పవన్ డిజైనర్స్ పేరుతో వెళ్తున్నాయన్నారు ఎన్నికల అధికారులు. వీటిపై విచారణ చేస్తున్నామని తెలిపారు అధికారులు. డమ్మీ ఈవీఎంల రికార్డులు పరిశీలించి... విచారణ చేస్తున్నామని, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. అప్పటివరకు వాహనాన్ని అదుపులోనే ఉంచుతామన్నారు పోలవరం ఎన్నికల రిటర్నింగ్ అధికారులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Evm tampering