ఏపీలోని పరిశ్రమల్లో 75 శాతం స్ధానిక కోటాను వర్తింపజేయాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఏపీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాబోయే రోజుల్లో తమ రాష్ట్రాల్లోనూ ఇవే తరహా డిమాండ్లు ఉత్పన్నమవుతాయని పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా... తాజాగా ఇదే అంశంపై నీతి ఆయోగ్ సీఈవో చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. ఫైనాన్షియల్ టైమ్స్ పత్రికలో వచ్చిన ఓ కథనాన్ని ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై ఏపీ సీఎంవో ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీలోని పరిశ్రమల్లో 75 శాతం స్ధానిక కోటా కల్పించాలన్న జగన్ సర్కారు నిర్ణయంపై సర్వత్రా చర్చ సాగుతోంది. ఈ చర్చలో నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ కూడా చేరారు. స్ధానిక కోటా నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా వివిధ రాష్టాల నుంచి ఏపీకి వచ్చే వారికి ఉద్యోగాలు తగ్గిపోతాయన్న ఆందోళన ఓవైపు వ్యక్తమవుతుండగా.. దీనివల్ల సమాఖ్య విధానంపైనా ప్రభావం పడుతుందని జాతీయ పత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం క్లిప్లింగ్ ను నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దేశ రాజ్యాంగం పౌరులందరికీ దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా నివసించేందుకు, పని చేసుకునేందుకు వీలు కల్పించిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం వల్ల పెట్టుబడులు, ఉత్పత్తిపై పెను ప్రభావం పడుతుందని, కార్మిక మార్కెట్లపైనా దీని ప్రభావం తప్పదని ఈ కథనం పేర్కొంది. దీన్ని యథాతథంగా అమితాబ్ కాంత్ పోస్ట్ చేశారు.
Andhra Pradesh's quota for locals hurts federal spirit. “Constitution of India allows every citizen to work, live & move freely in the country. State barriers will impact investment, productive efficiency& uniform labour markets.”- The Financial Express https://t.co/LTLcChvPsv
— Amitabh Kant (@amitabhk87) July 28, 2019
అమితాబ్ కాంత్ ట్వీట్ పై స్పందించిన ఏపీ సీఎంవో ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ తన స్పందనను రీట్వీట్ చేశారు. మీ కామెంట్లు, ఈ కథనం పూర్తిగా అసమగ్ర సమాచారంతో కూడినవని పీవీ రమేష్ తన ట్వీట్ లో అభ్యంతరం వ్యక్తం చేశారు. స్ధానికేతరులకు అవకాశాలు తగ్గించడం ద్వారా ఏపీలో స్ధానికులకు తగినన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు. ఇందులో సమాఖ్య విధానాన్ని దెబ్బతీసే ఉద్దేశమేదీ లేదనేది పీవీ రమేష్ ట్వీట్ సారాంశం.
With highest regards 2 u, ur comments & FE report r based on incomplete info. There is nothing in the Act that could hurt ‘federal spirit’. While promoting interests of those ‘domiciled’ in AP, there are enough opportunities 4 those who are not. Read the Act & Rules being framed
— PV Ramesh (@RameshPV2010) July 28, 2019
అయితే జగన్ ప్రభుత్వం తీసుకున్న స్ధానిక కోటా నిర్ణయంపై ఇప్పటివరకూ అధికారికంగా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. అదే సమయంలో నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ దీనిపై ట్విట్టర్ లో స్పందించడం దానికి ఏపీ సీఎంవోలో కీలక అధికారి స్పందన ఇప్పుడు ఇరు ప్రభుత్వాల్లోనూ కలకలం రేపుతోంది. అధికారికంగా మాట్లాడుకునే అవకాశం ఉన్నప్పటికీ ఇరువురు బ్యూరోక్రాట్లు ట్విట్టర్ లో ఇలా పోస్టులు పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది.
(సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్18)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Niti Aayog