గడిచిన ఐదేళ్లలో చంద్రబాబు ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో చిత్తశుద్ధిగా పని చేసి ఉంటే రాయలసీమకు ఈ దుస్థితి ఉండేది కాదని ఏపీ సీఎం జగన్ అన్నారు. అసెంబ్లీలో రాయలసీమ ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా సీఎం జగన్ టీడీపీ, చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇన్ని వర్షాలు పడినా రాయలసీమ ప్రాజెక్టులు నింపులేకపోతున్నామని తాను చాలా సందర్భాల్లో ప్రశ్నించానని జగన్ గుర్తు చేశారు. కెనాల్ క్యారీయింగ్ కెపాసిటీ పెంచి.. డ్యామ్‌లకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు ఇచ్చి ఉంటే ప్రాజెక్టులు నీటితో కళకళలాడేవని ఆయన అన్నారు.
కానీ చంద్రబాబు అలా చేయకుండా ఎన్నికలకు ముందు హడావుడిగా పనులు మొదలుపెట్టి చేతులు దులిపేసుకున్నారని సీఎం జగన్ ఆరోపించారు. గతంలో తొమ్మిదేళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు... రాయలసీమ ప్రాజెక్టులను పట్టించుకున్న పాపనపోలేదని సీఎం జగన్ మండిపడ్డారు. 2004-14 మధ్య గండికోటకు 5036 కోట్లు, హంద్రీనీవాకు 6593 కోట్లు కేటాయిస్తే... చంద్రబాబు మాత్రం కనీసం రెండొందల కోట్లు కూడా కేటాయించలేదని వ్యాఖ్యానించారు.
కెనాల్ క్యారీయింగ్ కెపాసిటీ పెంచకపోవడంతో ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యం భారీగా పడిపోయిందని జగన్ అన్నారు. ఎప్పటికప్పుడు ప్రాజెక్టుల స్థితిగతులను పట్టించుకుంటే ఈ దుస్థితి ఉండేది కాదని స్పష్టం చేశారు. కనీసం 50 రోజులు వర్షాలు కురిసినా ప్రాజెక్టులు నింపాలని ఇంజినీర్ల ఆధ్వర్యంలో వ్యూహ రచన చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. తాము అధికారం చేపట్టి కేవలం ఆరు నెలలే అయ్యిందని... రాబోయే జూన్ నాటికి ప్రతి ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm ys jagan mohan reddy, Chandrababu Naidu, Rayalaseema, TDP, Ysrcp