ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ‘ మనం దాదాపుగా అక్కడకు చేరుకున్నామన్నారు జగన్.చివరి నిమిషంలో చిన్న వెనుకడుగే.. మన విజయానికి తొలిమెట్టు అవుతుందన్నారు. భారత జాతి మొత్తం ఇస్రో టీం వెంటే ఉందన్నారు.ఈ ప్రయోగం కోసం ఎంతగానో శ్రమించిన వారందరికీ అభినందనలు తెలిపారు ముఖ్యమంత్రి. ఈ మేరకు ఆయన తన ట్వీట్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతకు ముందు ప్రధాని మోదీ ఇస్రో శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. వారిలో దైర్యం నింపే ప్రయత్నం చేశారు.
చంద్రయాన్ 2లో చివరి నిమిషంలో ఏం జరిగింది?:
విక్రమ్ ల్యాండింగ్‌లో ఆఖరి 15 నిమిషాలు కీలకమైనవి..అత్యంత క్లిష్టమైనవి..! ఇస్రో ముందు నుంచీ చెప్పిన మాట ఇది..! అందుకు తగ్గట్లే చివరి క్షణాల్లో విక్రమ్‌కు అవాంతరయాలు ఎదరయ్యాయి. ఆ 15 నిమిషాల్లో 14 నిమిషాల పాటు సజావుగా సాగిన విక్రమ్ ప్రయాణం.. చివరి నిమిషంలో తడబడింది. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్లు ఎత్తులో విక్రమ్ ఉన్న ఊహించని సమస్య ఎదురైంది. చంద్రుడిపై కాలు మోపడమే తరువాయి అనుకునేలోపే.. విక్రమ్ నుంచి కమాండ్ కంట్రలో రూమ్‌కి సంకేతాలు నిలిచిపోయాయి. మరి విక్రమ్ క్రాష్ అయిందా? లేదంటే ల్యాండ్ అయ్యి కేవలం సిగ్నల్స్ మాత్రమే అందడం లేదా? అని అందరిలోనూ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
చంద్రుడి ఉపరితలం వైపు గంటకు 6వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన విక్రమ్‌ను అదుపు చేయడం ఇస్రోకు కష్టంగా మారినట్లు తెలుస్తోంది. విక్రమ్ వేగానికి కళ్లెం వేసేందుకు సైంటిస్టులు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ల్యాండర్ నాలుగు మూలలతో పాటు మధ్య భాగంలో థ్రస్టర్స్ ఏర్పాటు చేశారు. మొత్తం ఐదు థ్రస్టర్స్‌ని వ్యతిరేక దిశలో ప్రయోగించి దాని వేగాన్ని తగ్గించారు. మొదట రఫ్ బ్రేకింగ్ అంచెను విజయవంతంగా పూర్తిచేశాక.. ఫైన్ బ్రేకింగ్ ప్రారంభమైంది. అప్పుడు ప్రణాళిక ప్రకారమే వ్యోమనౌక వేగం తగ్గుతూ వచ్చింది. కానీ ఆఖరి క్షణాల్లో అనూహ్యంగా విక్రమ్ నుంచి సిగ్నల్స్ ఆగిపోయాయి. మరో నిమిషంలో చంద్రుడిపై దిగాల్సిన సమయంలో ఈ అవరోధం ఏర్పడింది.
చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధారణ విషయం కాదు. ఇప్పటి వరకు ఎన్నో దేశాలు మృదువుగా చంద్రుడిపై దిగేందుకు ప్రయత్నించి విఫలమయ్యాయి. అమెరికా, రష్యా, చైనా మాత్రమే విజయవంతమయ్యాయి. సాఫ్ట్ ల్యాండింగ్ సక్సెస్ రేట్ 37శాతమే అని తెలిసినప్పటికీ.. దీన్ని ఛాలెంజింగ్‌గా తీసుకొని చంద్రయాన్-2 ప్రయోగం చేసింది ఇస్రో. అనుకున్నట్లుగానే చందమామ దిశగా 48 రోజులు సజావుగా ప్రయాణించి...గమ్యానికి చేరువలో గతి తప్పింది. ఐతే స్పీడ్ కంట్రోల్ కాక విక్రమ్ ల్యాండర్ క్రాష్ అయిందా? లేదంటే సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యాక సిగ్నల్స్ నిలిచిపోయాయా? అన్నది తెలియాల్సి ఉంది. దీనిపై ఇస్రో శాస్త్రవేత్తలు డేటా విశ్లేషణ చేస్తున్నారు. ల్యాండర్ పరిస్థితిపై రెండ్రోజుల్లో ప్రకటన చేసే అవకాశముంది.
We were almost there! India is proud of our scientists. A minor setback in the last stanza is a stepping stone for success. The nation stands with ISRO team at this hour and appreciates the exemplary efforts. 👏
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 7, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap cm ys jagan mohan reddy, Chandrayaan-2, ISRO