కోల్‌కతా వేదికగా జరిగిన విపక్షాల ఐక్యతా ర్యాలీ నుంచి.. ప్రధాని నరేంద్ర మోదీని బీజేపీయేతర పక్షాలు విమర్శల బాణాలతో టార్గెట్ చేశాయి . మమతా బెనర్జీ ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభలో సుమారు 20 పార్టీల నేతలు హాజరై ప్రసంగించారు. బీజేపీపైనా, ప్రధాని నరేంద్రమోదీపై విమర్శల వర్షం కురిపించారు. ఈ సభకు హాజరైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు.. మోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మోదీ కారణంగా దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని చెప్పారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
దేశంలో ప్రస్తుతం పాలన సాగిస్తున్న నరేంద్ర మోదీ.. పబ్లిసిటీ ప్రైమ్ మినిస్టరనీ.. పర్ఫార్మింగ్ ప్రైమ్ మినిస్టర్ కాదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. దేశానికి కావాల్సింది ఇలాంటి పీఎం కాదని.. పనిచేసే ప్రధాని కావాలని చెప్పారు. పేదలకు, రైతులకు మేలు చేసే ప్రధాని కావాలన్నారు. 2014 ఎన్నికలకు ముందు డిజిటల్ ఇండియా,స్వచ్ఛ్ భారత్, అవినీతి రహిత భారత్, జన్ ధన్ యోజన, అవినీతి రహిత భారత్, అచ్చే దిన్, సబ్ కా సాత్ సబ్ కాత వికాస్ అంటూ.. అనేక నినాదాలు ఇచ్చిన మోదీ.. అధికారంలోకి వచ్చాక అన్నీ మర్చిపోయారని చంద్రబాబు విమర్శించారు. 2019లో కచ్చితంగా దేశానికి కొత్త ప్రధాని రాబోతున్నారని స్పష్టం చేశారు. కోల్‌కతా నుంచే మార్పు మొదలు కాబోతోందన్నారు. మోదీకి వ్యతిరేకంగా దేశంలోని 20 పార్టీలు ఒక్కతాటిపైకి వచ్చాయని.. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు ఇలాగే ముందుకు సాగుతామని చంద్రబాబు స్పష్టం చేశారు.
దేశంలోని అత్యున్నత సంస్థలైన సీబీఐ, ఈడీ, ఆర్బీఐలను మోదీ దుర్వినియోగం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. తనను ప్రశ్నించిన వారిని కేసుల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలోనూ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కర్నాటక రాజకీయాల్లో జోక్యం చేసుకుని, డబ్బులిచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కర్నాటక రాజకీయాల్లో వేలుపెడితే మోదీ ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకుంటుందని చంద్రబాబు హెచ్చరించారు. ఈ మహాకూటమి తర్వాతి సభను అమరావతి నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని చంద్రబాబు చెప్పారు. భారీ ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేసిన మమతా బెనర్జీని అభినందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Chandrababu Naidu, Lok Sabha Election 2019, Mahakutami, Mamata Banerjee, Pm modi, West Bengal