Home /News /national /

POLITICS ANDHRA PRADESH TO INAUGURATE 5 SKILL COLLEGES IN OCTOBER BA

నిరుద్యోగుల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త ఆలోచన.. అక్టోబర్‌లో..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గాంధీ జయంతి రోజు 4 స్కిల్‌ కాలేజీల ప్రారంభానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

    ఈ ఏడాది అక్టోబర్‌లో లాంఛనంగా 5 స్కిల్ కాలేజీలను ప్రారంభించనున్నట్లు ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మం‍త్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అక్టోబర్‌లో 5 నైపుణ్య కళాశాలను లాంఛనంగా ప్రారంభించడమే లక్ష్యమని తెలిపారు. చదువు విలువను ప్రపంచానికి చాటిన గాంధీ జయంతి రోజు 4 స్కిల్‌ కాలేజీల ప్రారంభానికి శ్రీకారం చుట్టామన్నారు. కడప, ఏలూరు, ఒంగోలు, అనంతపురం, నెల్లూరు జిల్లాలలో స్కిల్‌ కాలేజీల ప్రారంభోత్సం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా జరగనుందని వెల్లడించారు.

    వచ్చే ఏడాది జనవరిలో కొత్తగా మరో 25 స్కిల్‌ కాలేజీల ప్రారంభానికి సన్నద్దం కావాలని ఆయన అధికారులకు సూచించారు. అనుకున్న సమయానికి అనుకున్నవి పూర్తి చేసేలా కార్యాచరణ పూర్తి చేయాలని ఆదేశించారు. అదే విధంగా 30 కాలేజీల పర్యవేక్షణకు 'ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్'ను ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. ఇక అక్టోబర్‌లో ప్రారంభించే 5 కాలేజీలు పూర్తయ్యాయని ప్రస్తుతం కాలేజీల డిజైన్లు, లేఔట్లకు తుది మెరుగులు దిద్దుతున్నట్లు చెప్పారు. గతేడాది చివరన నైపుణ్యాశాఖ బృందం భువనేశ్వర్‌లోని సెంచూరియన్ స్కిల్ యూనివర్సిటీలో పర్యటించి ప్రస్తావించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో రానున్న స్కిల్ కాలేజీలలో సైతం 'సెంచూరియన్' స్థాయి ప్రమాణాలుండాలని దిశానిర్దేశం చేసినట్లు చెప్పారు. స్కిల్ కాలేజీ ఆకృతులు, సైట్లకు సంబంధించిన వ్యవహారాలను పరిశీలించేందుకు ప్రత్యేక ఆర్కిటెక్‌ బృందం కూడా పర్యటించనుందని వెల్లడించారు.

    ఆర్థికపరమైన ఇబ్బందులు రాకుండా సీఎస్ఆర్ నిధుల సమీకరణపై మరింత దృష్టి సారించాలన్నారు. ఇందుకోసం త్వరలో స్కిల్‌కు సంబంధించిన కోర్సులు, కరికులమ్‌లపై హై నెట్ వర్క్ ఇండస్ట్రీస్ వర్చువల్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు కూడా చెప్పారు. కొత్త కోర్సులు, ప్రాధాన్యత రంగాలపై టాప్ కంపెనీల నిపుణులు, విద్యావేత్తలతో చర్చించిన తర్వాత అమోదించనున్నామన్నారు. ఇప్పటికే కీలక రంగాలలో యువతకు భవిష్యత్‌లో ఉద్యోగ అవకాశాలుండే 20 కోర్సులపై అధ్యయనం చేశామని, ప్రపంచ స్థాయి నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, ఉపాధి హై లెవల్ కమిటీ, ఐఎస్‌బీ ఆధ్వర్యంలో శిక్షణ క్లాసులు నిర్వహించనున్నట్లను పేర్కొన్నారు. పరిశ్రమలకు అవసరమైన కోర్సులు, మానవవనరుల వివరాలపై సర్వేకు కూడా నైపుణ్యశాఖ సిద్ధంగా ఉందని చెప్పారు. త్వరలోనే యాప్ ద్వారా సర్వే ప్రారంభించే అవకాశం ఉందని మంత్రి వెల్లడించారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Mekapati Goutham Reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు