ఆంధ్రప్రదేశ్ లోని హిందూ ఆలయాల్లో చోటు చేసుకుంటున్న ఘటనలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఈ విషయంలో హిందూ ధార్మిక సంఘాల కంటే రాజకీయ పార్టీలే ఎక్కువగా స్పందిస్తున్నాయి. ఆలయాలపై జరుగుతున్న దాడులు, విగ్రహాల ధ్వంసం విషయంలో తొలి నుంచి బీజేపీ నేతలు ఆందోళనలు మొదలు పెడుతున్నారు. ఘటన జరగ్గానే స్పందిస్తున్నదీ కమలనాథులే. తాజాగా రామతీర్థం విషయంలోనూ బీజేపీ నేతలే తొలుత స్పందించారు. ఘటన జరిగిన నాటి నుంచి అక్కడే ఆందోళనకు కూర్చున్నారు. కానీ కీలక సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగి.. ఉద్యమాన్ని టీడీపీ వైపు మళ్లించారు. ఈ విషయంలో చంద్రబాబు జోరుతో బీజేపీ వెనుకబడిందనే చెప్పాలి. స్పందన విషయంలో బీజేపీ ముందే ఉన్నా.. వైసీపీని ఢీ కొట్టే విషయంలో మాత్రం ఆ జోరు చూపించలేకపోయింది.
రామతీర్థం విషయంలో చంద్రబాబు రాకతో బీజేపీ సైడ్ అయిపోగా..టీడీపీ హైలెట్ అయిందన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈనెల గత నెల 28 అర్ధరాత్రి రామతీర్థం ఆలయంలో శ్రీరాముని విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. 29న ఉదయం దాడి జరిగిన విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే స్థానిక బీజేపీ నేతలు ఆలయాన్ని పరిశీలించి ఆందోళనకు దిగారు. శ్రీరాముడి విగ్రహ శిరస్సుభాగం కోనేట్లో లభించినప్పుడు కూడా కమలనాథులు అక్కడే ఉన్నారు. ఐతే చంద్రబాబు రామతీర్థం పర్యటన ఖరారైన వెంటనే బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తో సహా ముఖ్యనేతలు అక్కడికి వెళ్లారు. అదే సమయంలో విజయసాయి రెడ్డి రామతీర్థం రావడం, టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో అటెన్షన్ ఆరెండు పార్టీల వైపు మళ్లింది. విజయసాయి రెడ్డి, చంద్రబాబు కొండపైకి వెళ్లగా..బీజేపీ నేతలు మాత్రం వెళ్లలేకపోయారు. సాయంత్రానికి వివాదం కాస్తా వైసీపీ-టీడీపీగా మారిపోయింది.
గతంలో హైలెట్ అయిన బీజేపీ
నిజానికి అంతర్వేది రథం దగ్ధమైన సమయంలో అప్పటి ఆందోళనలను బీజేపీ లీడ్ చేసింది. విజయవాడ దుర్గగుడిలో సింహాల ప్రతిమల చోరీ అంశంలోనూ బీజేపీనే తొలుత స్పందించింది. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వానికంటే ముందే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇంద్రకీలాద్రిపై ప్రత్యక్షమయ్యారు. ఆ తర్వాత విజయవాడలో ఆలయాల కూల్చివేత అంశంలోనూ ధర్నాకు దిగారు. ఈ రెండు అంశాల్లో గట్టిగానే పోరాడిన బీజేపీ.,రామతీర్థం విషయంలో మాత్రం హైలట్ కాలేకపోయిందన్న వాదన వినిపిస్తోంది. వైసీపీ, టీడీపీ నేతల పర్యటనలు ముగిసిన తర్వాత తాము కూడా రామతీర్థం రథయాత్రకు పిలుపునిస్తున్నమట్లు బీజేపీ-జనసేన పార్టీలు ప్రకటించాయి. ఆలయాల విషయంలో మాట్లాడే అర్హత టీడీపీ-వైసీపీలకు లేదని సోము వీర్రాజు అన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడుతున్నది తామేనని ఆయన స్పష్టం చేశారు. ఐతే వేడి చల్లారిన తర్వాత ఆందోళనకు పిలుపున్నవడంతో పార్టీకి వచ్చే క్రెడిట్ లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap bjp, Chandrababu naidu, Hindu Temples, Somu veerraju, Tdp, Vijayasai reddy, Ysrcp