ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలపై దాడుల విషయంలో భారతీయ జనతాపార్టీ ఉద్యమానికి సిద్ధమవుతోంది. రాష్ట్రంలో హిందూ ధర్మం ప్రమాదంలో ఉందంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోన్న బీజేపీ అదే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. అలాగే ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త రథయాత్రకు చేపట్టాలని నిర్ణయించింది. విశాఖపట్నంలో జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఆ పార్టీ కీలక తీర్మానాలు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, దేవాలయాలపై దాడులు, డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆరోపణలు, తిరుపతి ఉపఎన్నికలు, రాష్ట్రంలో పార్టీ బలోపేతంతో పాటు పలు కీలక అంశాలపై చర్చించిన బీజేపీ నేతలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా దేవాలయాల్లో చోటు చేసుకుంటన్న ఘటనలపై గట్టిగా పోరాడాలని డిసైడ్ అయింది.
డీజీపీకి డెడ్ లైన్
ఇటీవల రాష్ట్రంలోని హిందూ ఆలయాలపై దాడుల కేసుల్లో బీజేపీ కార్యకర్తల హస్తముందన్న డీజీపీ గౌతమ్ సవాంగ్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. గౌతమ్ సవాంగ్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని.. క్షమాణలు చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఈనెల 20లోపు డీజీపీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకుంటే పరువు నష్టం దావా వేస్తామని డెడ్ లైన్ విధించింది. ఆలయాలపై దాడుల గురించి స్పందించిన డీజీపీ... కాకినాడ పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి చేసిన వ్యాఖ్యలపై ఎందుకు స్పందించలేదని సోము వీర్రాజు ప్రశ్నించారు. డీజీపీ క్షమాపణ చెప్పకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
రథయాత్రకు సిద్ధం
ఇక రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఫిబ్రవరి 4నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రథతయాత్ర చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ యాత్రను జనసేన పార్టీతో కలిసి నిర్వహిస్తామని సోము వీర్రాజు ప్రకటించారు. తిరుమలలోని కపిల తీర్థం నుంచి విజయనగరం జిల్లా రామతీర్థం వరకు రథయాత్ర ఉంటుందన్నారు. రాష్ట్రంలో దాడులకు గురైన అన్ని ఆలయాలను కలుపుతూ యాత్ర నిర్వహిస్తామన్నారు. తమను రామతీర్థం వెళ్లనివ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందంటే హిందువులను అడ్డుకోవడమేనని సోము వీర్రాజు అన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా యాత్ర చేపట్టి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.
తిరుపతి ప్రచారానికి శ్రీకారం..?
త్వరలో తిరుపతి లోక్ సభ స్థానానికి ఉపఎన్నిక జరగనున్నందున ఈ రథయాత్ర ద్వారా ప్రచారాన్ని ప్రారంభించాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చేనెల 4న రథయాత్ర ప్రారంభానికి ముహుర్తంగా నిర్ణయించడం వెనుక ఇదే కారణముందంటున్నారు. హిందూ ధర్మపరిరక్షణ పేరుతో నిర్వహించే యాత్రను తిరుపతి నుంచి ప్రారంభించడం ద్వారా ఎన్నికల ప్రచారానికి ప్లస్ అవుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. యాత్రలో జనసేనను కూడా భాగస్వామ్యం చేయడం వెనుక ఎన్నికల వ్యూహం ఉన్నట్లు స్పష్టమవుతోంది. అలాగే జనసేన చేర్చుకోవడం వల్ల రథయాత్రకు మరింత స్పందన రావడంతో పాటు ప్రచారం కూడా వచ్చే అవకాశమున్నట్లు బీజేపీ భావనగా తెలుస్తోంది. యాత్ర ప్రారంభోత్సవం లేదా ముగింపు కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వస్తే ఉద్యమానికి బలం చేకూరుతుందని ఆశిస్తోంది. మరి బీజేపీ-జనసేన చేపడుతున్న రథయాత్ర సక్సెస్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap bjp, Ap cm ys jagan mohan reddy, AP DGP, AP Politics, Bjp-janasena, Gautam Sawang, Hindu Temples, Janasena, Pawan kalyan, Somu veerraju