ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతాపార్టీ స్పీడ్ పెంచింది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పలువురు ముఖ్యనేతలతో భేటీ అవుతున్నారు. ఇప్పటికే జనసేన పార్టీతో పొత్తుపెట్టుకొని బలమైన ప్రత్యామ్నాయంగా ఎదిగే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో సోము వీర్రాజు.. మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో భేటీ అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా, కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి స్వయంగా వెళ్లిన సోము వీర్రాజు బీజేపీలో చేరాలని, కాషాయతీర్థం పుచ్చుకుంటే సముచిత స్థానం కల్పిస్తామని ఆఫర్ చేసినట్లు తెలిసింది. బీజేపీ ఇచ్చిన ఆఫర్ విన్న ముద్రగడ.. ప్రస్తుతానికి ఏ నిర్ణయం చెప్పకపోయినా ఆలోచించుకొని చెప్తానని సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. ముద్రగడతో భేటీపై స్పందించిన సోము వీర్రాజు త్వరలోనే ఆయన సరైన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
ముద్రగడ పద్మనాభం – సోము వీర్రాజు భేటీలో తాజా రాజకీయ పరిస్థితులు, వైసీపీ పాలన, ప్రతిపక్ష టీడీపీ వైఖరి తదితర అంశాలు ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం సోము వీర్రాజు ట్విట్టర్ ద్వారా స్పందించారు. “రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అనేక దఫాలుగా మంత్రిగా బాధ్యతలు వహించిన ముద్రగడ గారి ఆవశ్యకత ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందన్న విశ్వాసంతో పెద్దలు శ్రీ ముద్రగడ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కుటుంబ రాజకీయాల నుండి విముక్తి కల్పిస్తూ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ , బలీయమైన శక్తిగా భాజపా - జనసేన కూటమి పాత్ర పోషించనున్న నేపధ్యంలో మా మధ్య జరిగిన స్నేహపూర్వక భేటి పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మా పట్ల మాజీ మంత్రి వర్యులు, కాపు ఉద్యమ నేత శ్రీ ముద్రగడ పద్మనాభం గారు చూపిన ఆదరాభిమానాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను”. అంటూ ట్వీట్ చేశారు.
మాజీ మంత్రి వర్యులు,కాపు ఉద్యమ నేత శ్రీ ముద్రగడ పద్మనాభం గారిని మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అనేక దఫాలుగా మంత్రిగా బాధ్యతలు వహించిన ముద్రగడ గారి ఆవశ్యకత ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మానాత్మక పాత్ర పోసిస్తుందన్న విశ్వాసంతో(1/3) pic.twitter.com/MHbTM841Kp
— Somu Veerraju (@somuveerraju) January 16, 2021
ముద్రగడ మనసు మార్చుకుంటారా..?
కొన్నేళ్ల క్రితమే క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్న ముద్రగడ పద్మనాభం.,2014 ఎన్నికల తర్వాత కాపు రిజర్వేషన్ ఉద్యమానికి నాయకత్వం వహించారు. తుని రైలు దగ్ధం ఘటం, కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితులు, పాదయాత్ర భగ్నం వంటి అంశాలు రాష్ట్ర వ్యాప్తంగా టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేశాయి. గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం, వైసీపీ హామీల్లో కాపు రిజర్వేషన్ అంశం లేకపోవడంతో ముద్రగడ సైలెంట్ అయ్యారు. ఈక్రమంలో ఆయన వైసీపీతో కుమ్మక్కయ్యారన్న విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం జరుగుతోందన్న మనస్తాపంతో కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇటీవల ముద్రగడ కొత్తపార్టీ పెట్టబోతున్నారంటూ కాకినాడలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టించాయి. ఐతే తనకు ఆఫ్లెక్సీలకు ఎలాంటి సంబంధం లేదన్న ముద్రగడ.. ఫ్లెక్సీలు ఏర్పాటుచేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఎలాంటి రాజకీయ పార్టీ పెట్టడం లేదని.., ప్రస్తుతానికి రాజకీయాల్లో చేరే ఉద్దేశం కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సోము వీర్రాజు.., ముద్రగడతో భేటీ కావడం చర్చనీయాంశమైంది.
బీజేపీ ప్లాన్ అదేనా..?
రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా నిలబడాలని బీజేపీ గట్టిగానే ప్రయత్నిస్తోంది. గతంలో ఓ వెలుగు వెలిగిన నేతలు, మాజీ మంత్రులకు గాలం వేస్తోంది. అలాగే టీడీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలే కాకుండా., అధికార వైసీపీలోని అసంతృప్త నేతలు కూడా తమవైపు లాగేసుకునేందుకు యత్నిస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు బీజేపీలో చేరబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ముద్రగడ పద్మనాభంతో సోము వీర్రాజు భేటీ కావడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో మెజారిటీ ఓటు బ్యాంకు కలిగిన కాపు సామాజిక వర్గానికి ముద్రగడ ప్రతినిథిగా ఉన్నారు. సోము వీర్రాజు కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన వారే. దీంతో కాపుల ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకునేందకు బీజేపీ పావులు కదుపుతున్నట్లు స్పష్టమవుతోంది. జనసేన పార్టీతో పొత్తు వెనుక వ్యూహం కూడా అదేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి బీజేపీ వ్యూహం ఫలిస్తుందో..? లేదో..? వేచి చూడాలి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap bjp, AP Politics, Mudragada Padmanabham, Somu veerraju, Tdp, Ysrcp