హోమ్ /వార్తలు /national /

Dubbaka Election: దుబ్బాక పోరు.. అన్ని పార్టీల ప్రస్తుత పరిస్థితి ఇదే!

Dubbaka Election: దుబ్బాక పోరు.. అన్ని పార్టీల ప్రస్తుత పరిస్థితి ఇదే!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దుబ్బాక ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు ప్రారంభించాయి. టీఆర్ఎస్, బీజేపీతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థి కత్తి కార్తీక ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే విషయంలో ఇంకా క్లారిటీ రాకపోవడం ఆ పార్టీకి మైనస్ గా మారింది.

ఇంకా చదవండి ...

  తెలంగాణలో మరో ఎన్నికల పోరుకు తెరలేచింది. ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ ఎన్నికల నిర్వహణకు సీఈసీ మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 3న అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో దుబ్బాక వేదికగా తమ సత్తా చాటాలని ప్రధాన పార్టీలు రంగంలోకి దిగాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ ఎలాగైనా ఇక్కడ విజయం సాధించి రాష్ట్రంలో, ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో తమకు తిరుగులేదని మరో సారి చాటాలని భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఆ పార్టీ ట్రబుల్ షూటర్, అదే జిల్లాకు చెందిన మంత్రి హరీష్ రావు ప్రచారం ప్రారంభించారు. గత కొద్ది రోజులుగా సమావేశాలు, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, ఆయా పథకాల చెక్కుల పంపిణీ తదితర కార్యక్రామాలతో నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. ఈ సారి లక్ష మెజార్టీ తమ లక్ష్యమంటూ ప్రకటించి ప్రతిపక్షాలను ఆత్మరక్షణలోకి నెడుతున్నారు. దుబ్బాకలోనే మకాం వేసి తన వ్యూహాలకు పదును పెడుతున్నారు.

  టీఆర్ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి సతీమణి సుజాతకే టికెట్ ఇవ్వనున్నట్లు ప్రచారం సాగుతున్నా.. ఆ విషయంపై ఇంకా స్పష్టమైన ప్రకటన రాలేదు. మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి సైతం టీఆర్ఎస్ టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ తన తండ్రి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. రామలింగారెడ్డి సతీమణి సుజాతకు టికెట్ దక్కితే శ్రీనివాస్ రెడ్డి మద్దతు ప్రకటిస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

  ఇదిలా ఉంటే దుబ్బాక గడ్డపై కాషాయ జెండా ఎగరవేస్తామన్న ధీమాతో బీజేపీ ఎన్నికల ప్రచారం సాగుతోంది. ఆ పార్టీ నుంచి రఘునందర్ రావుకు టికెట్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఆయన ఊరూరా తిరుగుతూ ప్రచారం హోరెత్తిస్తున్నారు. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దుబ్బాక అభివృద్ధి విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. పక్కనే ఉన్న సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలతో పోల్చితే దుబ్బాక ప్రాంతంలో ఏమాత్రం అభివృద్ధి జరగడం లేదంటూ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే రఘునందర్ తరఫున మాజీ ఎంపీ వివేక్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రచారం నిర్వహించారు. రానున్న రోజుల్లో బీజేపీ అగ్రనేతలు దుబ్బాకలో ప్రచారం చేసే అవకాశం ఉంది.

  కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో ఇంకా తేలకపోవడం ఆ పార్టీకి మైనస్ గా మారింది. ఆ పార్టీ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి, కర్ణం శ్రీనివాస్, మరో ఇద్దరు సీనియర్ నాయకులు టికెట్ కోసం గాంధీభవన్ చుట్టూ తిరుగుతున్నా ఇంకా ఎవరికీ గ్రీన్ సిగ్నల్ రాలేదు. టీఆర్ఎస్ లో ఉన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డికి పార్టీలోకి ఆహ్వానించి టికెట్ ఇచ్చే ఆలోచనలో ఆ పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.  శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇస్తే నియోజకవర్గంలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మద్దతు ఇచ్చే అవకాశం లేదని సమాచారం. ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ ఫేం కత్తి కార్తీక ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆమె ప్రజలకు వివరిస్తున్నారు.

  దుబ్బాక నియోజకవర్గం 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఏర్పడింది. అనంతరం 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ముత్యంరెడ్డి గెలుపొందారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం జరిగిన 2014, 18 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి గెలుపొందారు. 2018లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి రామలింగారెడ్డి 62,500 వేల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి మద్దుల నాగేశ్వర్ రెడ్డిపై గెలుపొందారు. రామలింగారెడ్డికి మొత్తం 89,299 ఓట్లు రాగా, నాగేశ్వర్ రెడ్డికి 26, 799 ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు 22, 595 ఓట్లు వచ్చాయి.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Dubbaka By Elections 2020, Telangana, Trs

  ఉత్తమ కథలు