విభజన వాదంతో దేశాన్ని విడగొడుతోన్న బీజేపీని బంగాళాఖాతంలో కలుపుదామని, భావ సారూప్యం గల పార్టీలన్నీ ఏకమై మోదీ సర్కారును గద్దెదించుదామంటూ తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు భారీ స్పందన వచ్చినట్లయింది. హైదరాబాద్ వేదికగా కేసీఆర్.. బీజేపీ, మోదీ సర్కారులపై రణన్నినాదమిచ్చిన కొద్ది గంటలకే కోల్ కతా వేదికగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆ పిలుపును అందుకున్నారన్నట్లుగా బీజేపీని ప్రధాన శత్రువుగా వార్ డిక్లెర్ చేశారు. మోదీ సర్కారను గద్దెదించే దిశగా ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని దీదీ పిలుపునిచ్చారు. వివరాలివి..
కోల్ కతా వేదికగా బుధవారం జరిగిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సంస్థాగత ఎన్నికల్లో ఆ పార్టీ ఛైర్పర్సన్గా మమతా బెనర్జీ తిరిగి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కీలక సందేశమిచ్చిన దీదీ.. పార్టీ శ్రేణులకు రోడ్ మ్యాప్ నిర్ధారించడంతోపాటు దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీలకూ పిలుపునిచ్చారు. మన ప్రధాన శతృవు బీజేపీనే అనే స్పృహతోనే టీఎంసీ శ్రేణులు పోరాడాలన్న మమత.. 2024 ఎన్నికల్లో మోదీ సర్కారును గద్దెదించే దిశగా దేశంలోని బీజేపీయేతర, ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని కోరారు.
గట్టిగా పట్టు పడితే బీజేపీని ఓడించడం పెద్ద పనికాదని కేసీఆర్ వ్యాఖ్యానించిన తరహాలోనే, టీఎంసీ శ్రేణులు గట్టిగా శ్రమిస్తే బీజేపీని కూలదోయడం పెద్ద విషయం కాదన్నారు మమతా బెనర్జీ. బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని, కానీ ఎవరైనా మరోలా ఆలోచించి అహకారాన్ని ప్రదర్శిస్తే టీఎంసీ తనదైన దారిలో పోతుందని, మొత్తంగా బీజేపీని మట్టికరిపించితీరుతామని ఆమె అన్నారు. కాగా, దీదీ తన ప్రసంగంలో కాంగ్రెస్ పై విమర్శలు చేయడం గమనార్హం. ఛండీగఢ్, మేఘాలయ లాంటి చోట్ల కాంగ్రెస్ పార్టీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోన్నందుకు బాధపడుతున్నానని మమత అన్నారు.
Mystery: అనంతపురం అమ్మాయిలు.. కడపలో ఘోరం.. వాళ్లు ప్రాణస్నేహితులని పేరెంట్స్కు తెలీదు!
34ఏళ్లు పాలించిన సీఎంనే తరిమికొట్టిన చరిత్ర టీఎంసీదని, అలాంటిది 2024లో బీజేపీని అధికారంలోకి రానీయకుండా చేయగల సత్తా టీఎంసీకి ఉందన్నారు. ఎలాగైతే యూపీ నుంచి కాంగ్రెస్, గుజరాత్ నుంచి బీజేపీ జాతీయ పార్టీలుగా ఎదిగివచ్చాయో, అలాగే బెంగాల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ కూడా జాతీయ పార్టీగా ఆవిర్భవించిందని మమత గుర్తుచేశారు.
కేసీఆర్ ప్రతిపాదిత బీజేపీయేతర, కాంగ్రెసేతర ఫెడరల్ ఫ్రంట్ కోణంలోనే మమతా బెనర్జీ కూడా వ్యాఖ్యలు చేయడం మరోసారి చర్చనీయాంశమైంది. గతంలో ఇదే అంశంపై కేసీఆర్ కోల్ కతా వెళ్లిమరీ మమతను కలవడం తెలిసిందే. ఇద్దరు ముఖ్యమంత్రుల తాజా పిలుపులు, త్వరలో మహారాష్ట్ర సీఎంతో కేసీఆర్ భేటీ, తమిళనాడు సీఎం స్టాలిన్ తో గులాబీ బాస్ అవగాహన తదితర పరిణామాలు దేశ రాజకీయాలను ఎలాంటి మలుపు తిప్పుతాయో వేచిచూడాలిమరి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, CM KCR, Mamata Banerjee, TMC, Trs