హోమ్ /వార్తలు /national /

Vizag Steel Plant:ఉద్రిక్తంగా విశాఖ ఉక్కు ఉద్యమం : 5 గంటల నిర్బంధం తరువాత డైరెక్టర్, ఈడీకి విముక్తి

Vizag Steel Plant:ఉద్రిక్తంగా విశాఖ ఉక్కు ఉద్యమం : 5 గంటల నిర్బంధం తరువాత డైరెక్టర్, ఈడీకి విముక్తి

ఉప్పెనలా విశాఖ ఉక్కు ఉద్యమం

ఉప్పెనలా విశాఖ ఉక్కు ఉద్యమం

విశాఖ ఉక్కు ఉద్యమం ఉద్రిక్తంగా మారుతోంది. ఆరు గంటల పాటు అధికారులను కార్మిక సంఘాలు నిర్బంధించాయి. ఉన్నతాధికారులు స్పష్టమైన హామీ ఇచ్చిన తరువాతే వారిని విడిచిపెట్టారు. సోమవారం అర్థరాత్రి మొదలైన ఆందోళనలు.. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

కార్మిక సంఘాల ఆందోళనలతో స్టీల్ ప్లాంట్ అట్టుడుకుతోంది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు కార్మికులు, నిర్వాసితులు చేపట్టిన ఆందోళన లు నెక్స్ట్ లెవెల్ కు వెళ్లాయి. ఇన్నాళ్లూ శాంతియుతంగా.. ఎవరి  విధులకు ఆటంకం కలిగించకుండా సాగిన ఆందోళనలు.. ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. విశాఖ ఉక్కు కర్మాగారంతోపాటు దాని అనుబంధ సంస్థల్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌లకు ఉన్న వాటాలను 100 శాతం విక్రయించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో స్పష్టం చేయడంతో.. కార్మికులు మండిపడుతున్నారు. ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదని తేలిపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కసారిగా నిరసనలు భగ్గుమన్నాయి.

సోమవారం అర్థరాత్రి నంచి ఆందోళనలు మిన్నంటాయి. విరామం లేని పోరాటం చేస్తున్నారు కార్మికులు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు కార్మికులు, నిర్వాసితులు చేపట్టిన ఆందోళన రాత్రి నుంచి కొనసాగుతోంది. కేంద్రం ప్రకటనతో సాగర తీరం అట్టుడికిపోతోంది. ఎటు చూసినా ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కారు. రాత్రి నుంచి స్టీల్‌ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. ధర్నాలు, రాస్తారోకోలతో రహదారులను దిగ్బంధించారు. కూర్మన్నపాలెం స్టీల్‌ ప్లాంట్‌ ఆర్చ్‌ దగ్గర ఆందోళనలకు దిగారు. పోలీసులు చర్చలు జరిపినా..వెనక్కి తగ్గడం లేదు ఉద్యమకారులు. ఉక్కు పిడికిలి బిగించి నినాదాలు చేస్తున్నారు.

తీవ్ర ఆగ్రహంతో ఉన్న కార్మిక సంఘాలు కేంద్ర, రాష్ట్ర్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న సమయంలో.. అక్కడికి అధికారులు చేరుకున్నారు. దీంతో వారి వాహనాలను నిరసనకారులు చుట్టుముట్టి.. నిర్బంధించారు. ఈ విషయంపై కార్మిక సంఘ నేతలు తమ మద్దతుదారులను పంపించి నిరసనకారులకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో గుర్తింపు పొందిన కార్మిక సంఘాల ప్రధాన నేతలు రంగంలోకి దిగి ఆందోళన చేస్తున్నవారితో స్వయంగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రధానికి ముఖ్యమంత్రి రాసిన లేఖ, గత మూడు వారాలకుపైగా తాము చేస్తున్న ఉద్యమ కార్యాచరణ వివరాలను నిరసనకారులకు వివరించారు. అయినా కార్మికులు వారిని విడిచిపెట్టేందుకు ఒప్పుకోలేదు.

వారిని బయటకు తీసుకు వెళ్లేందుకు సిఐఎస్ఎఫ్ విఫలయత్నం చేసింది. అయినా కుదరలేదు. రక్షణ కోసం ఏర్పాటు చేసిన తాళ్లను కార్మికులు తొలగించారు, అలానే సిఐఎస్ఎఫ్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. ఇక స్టీల్ ప్లాంట్ ఫైనాన్స్ డైరక్టర్ వేణుగోపాల్ ను ఆరు గంటలుగా దిగ్భందించడంతో చివరి ప్రయత్నంగా పోలీసు భద్రత మధ్య అంబులెన్స్ లో తరలించేందుకు ప్రయత్నం చేశారు. అంబులెన్స్ పై పిడిగుద్దులు కురిపించారు కార్మికులు.

దాదాపు ఆరు గంటలపాటు వేణుగోపాల్‌ను నిరసనకారులు నిర్బంధించారు. కార్మిక సంఘాలతో ఉన్నతాధికారులు అంతా వచ్చి మాట్లాడారు. కచ్చితంగా ప్రైవేటీకరణ ఆపేందుకు ప్రయత్నం చేస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు కాస్త మెట్టు దిగారు. ఆరు గంటల నిర్బంధం తరువాత విశాఖ ఉక్కు ఫైనాన్స్ డైరెక్టర్, ఈడీకి విముక్తి కలిగింది. నిరసనకారులతో కార్మిక సంఘాల చర్చలు ఫలవంతం అయ్యాయి. ఈ నేపథ్యంలో భారీ సీఐఎస్ఎఫ్ భద్రత మధ్య ఉక్కు ఉన్నతాధికారులను తరలించారు.

మరోవైపు భవిష్యత్ కార్యాచరణపై ఫోకస్ చేసిన కార్మిక సంఘాలు ఉద్యామన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించాయి. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని.. అప్పుడే అన్ని రాజకీయపార్టీలు కలిసి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతాయని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి.

First published:

Tags: Andhra Pradesh, AP News, Visakha, Visakhapatnam, Vizag, Vizag Steel Plant