హోమ్ /వార్తలు /national /

Vizag Steel Plant: విశాఖ ఉక్కుపై ఏడాది క్రితమే చెప్పిన నటుడు శివాజీ.. వీడియో వైరల్

Vizag Steel Plant: విశాఖ ఉక్కుపై ఏడాది క్రితమే చెప్పిన నటుడు శివాజీ.. వీడియో వైరల్

నటుడు శివాజీ (File)

నటుడు శివాజీ (File)

‘కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎప్పుడొచ్చారో గుర్తు చేసుకోండి. ఇక్కడ భూములు 2వేల ఎకరాలు ఇస్తే.. ఈ పోస్కో కంపెనీ వస్తుందని ఒప్పందం కోసం వచ్చారు. దీని వెనుక ఓ వైసీపీ నేత లాబీయింగ్ చేస్తున్నారు’ అని శివాజీ అన్నారు.

ఇంకా చదవండి ...

  ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను వంద శాతం ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ పేరుతో పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం ప్రైవేటీకరించేందుకు ముందుకు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ ప్రతిపక్షాలు, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక యూనియన్లు, ప్రజలు పోరాటానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను చంపేస్తున్నారంటూ ఏడాది క్రితమే నటుడు శివాజీ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగు న్యూస్ అనే యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ 2020 జనవరి 30న ఆ సంస్థ పోస్ట్ చేసింది. ఆ వీడియోలో నటుడు శివాజీ కొన్ని సంచలన విషయాలను బయటపెట్టారు.

  ‘దక్షిణ కొరియాకు చెందిన పోస్కో అనే ఓ ఉక్కు కంపెనీని తీసుకురావడం కోసం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని చంపేస్తున్నారు. ఇది నిజం. ఇవాళ విశాఖ ఉక్కు అనేది 40వేల మంది ఉద్యోగులు. లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. అలాంటి సంస్థ మూతపడబోతోంది. మీకు ఎవరికైనా ఆ విషయం తెలుసా?. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం రైతులు 60వేల ఎకరాల భూములిచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీమాంధ్ర, తెలంగాణకు చెందిన నేతలు పోరాటాలు, కొందరి ప్రాణత్యాగంతో పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు సంస్థ త్వరలో కనుమరుగు కాబోతోంది. కాదని కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పమనండి. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎప్పుడొచ్చారో గుర్తు చేసుకోండి. ఆరోజు మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చానన్నారు. కానీ, అది మర్యాదపూర్వకంగా కాదు. ఇక్కడ భూములు 2వేల ఎకరాలు ఇస్తే.. ఈ పోస్కో కంపెనీ వస్తుందని ఒప్పందం కోసం వచ్చారు. 2011, 2012 వరకు రూ.1000 కోట్ల లాభాల్లో ఉంది.’ అని అన్నారు.

  అప్పట్లో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం భూములిచ్చిన రైతులకు 150 గజాలో, 200 గజాలో ఇచ్చారని శివాజీ చెప్పారు. ‘ఈ రోజు విశాఖ ఉక్కు చనిపోతోంది. ఎంతమంది రైతులు వారికి అండగా ఉంటారో చూస్తా. నిలబడండి. నిలబడితేనే ఈ కంపెనీ నిలబడుతుంది. పోస్కో అనే కంపెనీ వద్దని ఒడిశాలో తంతే ఇక్కడకు వచ్చింది. ఈ విశాఖపట్నానికి ఎవరు మధ్యవర్తిత్వం నిర్వహిస్తున్నారో తెలుసుకోండి. ఆ వ్యక్తి పేరు నేను చెప్పను. ఆయన తెలుగు వ్యక్తి. ఢిల్లీలో పదవి ఉన్న వ్యక్తి. విశాఖ మీద అపరిమితమైన ప్రేమ ఉన్న వైసీపీ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ మూతపడకుండా కాపాడమనండి. వారు దాని కోసం కాదు. పోస్కో కోసం అడుతున్నారు. ఆల్రెడీ ఉక్కు కంపెనీ ఉంటే మళ్లీ ఇంకో ఉక్కు కంపెనీ ఎందుకు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు లేవు. గనులు కేటాయిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ నెంబర్ వన్ అవుతుంది.’ అని శివాజీ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. అమరావతిలో 30వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు ఇప్పుడు అన్యాయం జరుగుతోందని, రేపు విశాఖలో 60వేల ఎకరాలు ఇచ్చిన వారికి అన్యాయం జరుగుతోందని శివాజీ అన్నారు.

  ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ మీద కూడా విమర్శలు గుప్పించారు. బీజేపీతో సయోధ్య ఉన్న జనసేనాని కూడా విశాఖ స్టీల్ ప్లాంట్‌ మూతపడకుండా ఆపగలరా అని ప్రశ్నించారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Shivaji, Visakhapatnam, Vizag Steel Plant, Ysrcp

  ఉత్తమ కథలు