హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

పబ్లిసిటీ కోసం నా పేరు వాడుకుంటున్న క్రికెటర్, యాక్టర్: నితీష్ కుమార్

పబ్లిసిటీ కోసం నా పేరు వాడుకుంటున్న క్రికెటర్, యాక్టర్: నితీష్ కుమార్

నితీష్ కుమార్, బీహార్ సీఎం (ఫైల్ ఫోటో)

నితీష్ కుమార్, బీహార్ సీఎం (ఫైల్ ఫోటో)

ఆ క్రికెటర్, యాక్టర్ ఎవరో కాదు. ఒకరు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, మరొకరు చిరాగ్ పాశవాన్.

  బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ ఈనెల 3న జరగనుంది. ఈ సమయంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ సీఎన్ఎన్ న్యూస్‌18కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ క్రికెటర్, మరో యాక్టర్ పబ్లిసిటీ కోసం తన పేరు వాడుకుంటున్నారని విమర్శించారు. అయితే, ఆ క్రికెటర్, యాక్టర్ ఎవరో కాదు. ఒకరు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, మరొకరు చిరాగ్ పాశవాన్. ఎన్నికల ప్రచారంలో యువ నాయకులు సీనియర్ లీడర్ 5సార్లు ముఖ్యమంత్రి అయిన నితీష్ కుమార్ మీద మాటల దాడి చేయడం, సవాళ్లు విసురుతున్న అంశాలను న్యూస్ 18 ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు నితీష్ కుమార్ బదులిచ్చారు. ‘అదేం పెద్ద విషయం కాదు. ఒకరు క్రికెట్ ఫీల్డ్ నుంచి వచ్చారు. మరొకరు సినిమా నుంచి వచ్చారు. వాళ్లని పబ్లిసిటీ చేసుకోనివ్వండి. వారి సొంత పబ్లిసిటీ కోసం నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కానీ, నాకు మాత్రం బీహార్ నా కుటుంబం. నేను నా రాష్ట్రం అభివృద్ది కోసం పనిచేస్తా.’ అని నితీష్ కుమార్ అన్నారు.

  రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, ప్రస్తుత ఎన్నికల్లో ఆర్జేడీ - కాంగ్రెస్ కూటమి తరఫున సీఎం అభ్యర్థి అయిన తేజస్వి యాదవ్ క్రికెట్ క్రీడాకారుడు. 2008 ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టులో కూడా ఉన్నారు. అయితే, ఆ సీజన్ మొత్తం తేజస్వి బెంచ్‌కే పరిమితం అయ్యారు. ఆ తర్వాత 2013లో ఏకంగా క్రికెట్ కు గుడ్ బై కొట్టి ఫుల్ టైమ్ పొలిటికల్ గేమ్‌లోకి దిగారు.

  మరోవైపు లోక్‌ జన శక్తి పార్టీ అధినేత చిరాగ్ పాశవాన్ నటుడు. ఆయన ఇటీవల మరణించిన కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశవాన్ కుమారుడు. చిరాగ్ సినిమాల్లో నటించారు. 2011లో కంగనా రనౌత్‌తో కలసి నటించాడు. మిలే నా మిలే హమ్ అనే సినిమాలో కంగనాతో యాక్ట్ చేశారు. స్వయంగా రచయిత కూడా. ఆ తర్వాత కొన్నాళ్లకు రాజకీయాల్లోకి వచ్చారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు.

  ప్రస్తుతం తేజస్వి యాదవ్, చిరాగ్ పాశవాన్ ఇద్దరూ నితీష్ కుమార్‌కు వ్యతిరేకంగా, ఇద్దరూ తమ తమ పార్టీల తరఫున ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత నితీష్ కుమార్ బీజేపీకి టోకరా ఇచ్చి మళ్లీ ఆర్జేడీ - కాంగ్రెస్ కూటమితో కలసిపోతారని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేకు, మోదీకి వ్యతిరేకంగా నిలుస్తారని చిరాగ్ పాశవాన్ ఆరోపించారు. అంతే కాదు. ఎల్జేపీ అధికారంలోకి వస్తే తాను నితీష్ కుమార్‌ను జైలుకు కూడా పంపిస్తానని హెచ్చరించారు. ‘7 నిశ్చయ్’ పథకంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. బక్సర్‌లో జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో చిరాగ్ మాట్లాడుతూ ‘ఇది చిరాగ్ పాశవాన్ హామీ. నేను ఈ అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టా. ఒకవేళ ఎల్జేపీ అధికారంలోకి వస్తే ‘7 నిశ్చయ్’ పథకంలో అవినీతి మీద విచారణ జరిపిస్తా. అందులో సీఎం ఉన్నా, అధికారులు ఉన్నా జైల్లో పెట్టిస్తా.’ అని అన్నారు.

  ఇక నితీష్ కుమార్ అలసిపోయారని, ఆయన బీజేపీని నడపలేరని తేజస్వి యాదవ్ అన్నారు. 69 ఏళ్ల నితీష్ కుమార్ వయసు అయిపోతుందని, అందుకే కరోనా వైరస్ కానీ, ముజఫర్ పూర్‌లో ఏఈఎస్ సిండ్రోమ్ అంశంలో కానీ గట్టిగా ప్రయత్నాలు చేయలేకపోయారని 31 సంవత్సరాల తేజస్వి యాదవ్ అన్నారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Bihar Assembly Elections 2020, JDU, Nitish Kumar

  ఉత్తమ కథలు