హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

బీజేపీ ఆఫీసు సమీపంలో 54 బాంబులు స్వాధీనం.. ఎవరు పెట్టారు? ఎందుకోసం..?

బీజేపీ ఆఫీసు సమీపంలో 54 బాంబులు స్వాధీనం.. ఎవరు పెట్టారు? ఎందుకోసం..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మొత్తం 4 సంచుల్లో 54 బాంబులు లభ్యమయ్యాయి. సకాలంలో వాటిని స్వాధీనం చేసుకోవడంతో ముప్పు తప్పిందని పోలీసులు తెలిపారు. ఒకవేళ అవి పేలి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేదని అన్నారు.

  పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ, టీఎంసీ మధ్య పచ్చగట్టి వేస్తే భగ్గుమంటోంది. ఎన్నికలకు ముందే కాదు.. ఆ తర్వాత కూడా ఇరువర్గాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే శనివారం కోల్‌కతాలో తీవ్రకలకలం రేగింది. ఖిద్దర్‌పోర్‌లోని బీజేపీ ఆఫీసు సమీపంలో భారీగా నాటు బాంబులు దొరికాయి. పెద్ద పెద్ద సంచుల్లో బాంబులు నింపి ఉన్నాయి. పళ్లను ప్యాక్ చేసే బాక్సుల్లో బాంబులను పెట్టి.. వాటిని సంచుల్లో నింపి పడేశారు. బీజేపీ కార్యాలయానికి కేవలం 20 మీ. దూరంలో బాంబుల సంచులు లభ్యమయ్యాయి. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేయగా.. ఈ బాంబులు దొరికాయి.

  కోల్‌కతా యాంటీ రౌడీ సెక్షన్, బాంబు స్క్వాడ్ సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి బాంబులను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 4 సంచుల్లో 54 బాంబులు లభ్యమయ్యాయి. సకాలంలో వాటిని స్వాధీనం చేసుకోవడంతో ముప్పు తప్పిందని పోలీసులు తెలిపారు. ఒకవేళ అవి పేలి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేదని అన్నారు. ఈ బాంబులు ఇక్కడికి ఎలా వచ్చాయి? ఎవరు పెట్టారు? ఎందుకోసం పెట్టారన్న వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ ఆఫీసు చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బాంబులను వదిలివెళ్లిన వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.

  మరోవైపు బీజేపీ నేత సువేందు అధికారితో పాటు ఆయన సోదరుడిపై దొంగతనం కేసు పెట్టడం బెంగాల్ రాజకీయాల్లో దుమారం రేపుతోంది.

  ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా కాంతి మున్సిపాలిటీ కార్యాలయంలో సహాయ సామగ్రి (రిలీఫ్ మెటీరియల్) బలవంతంగా ఎత్తుకెళ్లారనే ఆరోపణలపై సువేందు అధికారి, ఆయన సోదరుడు సౌమేందు అధికారిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాంతి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బోర్డు సభ్యుడు రత్నదీప్ మన్నా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మే 29వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు కొంత మంది వ్యక్తులు మున్సిపాలిటీ గోదాము తాళాలు తెరిచి, సామగ్రిని చోరీ చేసినట్టు వెల్లడించారు.

  బీజేపీ ఆఫీసు సమీపంలో బాంబులు దొరకడం, సువేందుపై దొంగతనం కేసు పెట్టడంపై బీజేపీ నేత కైలాష్ విజయవార్గీ స్పందించారు. బెంగాల్‌లో ప్రతిపక్ష పార్టీ లేకుండా చేసేందుకు మమతా బెనర్జీ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంపై ఆమెకు నమ్మకం లేదని మండిపడ్డారు.


  కాగా, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు జరిగిన విషయం తెలిసిందే. బీజేపీ, టీఎంసీ వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఎన్నికల తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనల్లో 16 మంది మరణించారు. దీనిపై కేంద్రహోంశాఖ ఆరాతీసింది. ప్రత్యేక బృందాలను బెంగాల్‌కు పంపించి పరిస్థితిని సమీక్షించింది. అంతలోనే కోల్‌కతాలో నాటు బాంబులు లభ్యమవడం తీవ్ర కలకం రేపుతోంది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Crude bombs, Kolkata, West Bengal

  ఉత్తమ కథలు