కేంద్ర ఎన్నికల సంఘం చెప్పేదొకటి... వాస్తవంగా జరిగేది మరొకటి. ఎన్నికల ప్రచారానికి అభ్యర్థులు హద్దులేనంతగా ఖర్చు పెడుతున్నారు. 2014 కంటే ఈసారి ఖర్చు దాదాపు డబుల్ అవుతోందంటే నమ్మగలరా. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం 15 జెట్ విమానాలు, 25 హెలికాప్టర్లను ఉపయోగిస్తోంది. బీజేపీతో పోలిస్తే అధికారంలోలేని ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ స్థాయిలో ఖర్చు పెట్టకపోయినా... తను కూడా 4 జెట్ విమానాలు, 10 హెలికాప్టర్లను వాడుతోంది. మొత్తంగా బీజేపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ, సమాజ్‌వాదీ తదితర పార్టీలు... విమానాలు, హెలికాప్టర్ల సర్వీసుల కోసం లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. అభ్యర్థుల ప్రచార ఖర్చును అమాంతం పెంచేశాయి.
హెలికాప్టర్లకు గంటకు రూ.1,80,000 నుంచీ రూ.4,00,000 అద్దె చెల్లిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సెస్సానా సైటేషేన్ జెట్ 2, సెస్సానా సైటేషన్ ఎక్సెల్, ఫల్కన్ 4000 రకం విమానాల్ని అద్దెకు తీసుకున్నది. సెస్సానా సైటేషేన్ జెట్ 2 విమానానికి గంటకు రూ.1,80,0000 అద్దె చెల్లిస్తుంటే, ఎక్సెల్ విమానానికి గంటకు రూ.2,80,000 అద్దె చెల్లిస్తోంది. కాంగ్రెస్ బెల్ 407, యూరో కాప్టర్ డి3 రకం హెలికాప్టర్లను గంటకు రూ.1,00,000 నుంచీ రూ.1,30,000 అద్దె చెల్లిస్తోంది. కాంగ్రెస్ పెద్దలు కొన్ని సందర్భాల్లో రెండు ఇంజన్లుండే బెల్ 412, అగస్టా హెలికాప్టర్లను కూడా ఉపయోగస్తున్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విమానాలు, హెలికాప్టర్లను ఒక నెల, నెలా పదిహేను రోజుల కోసం, రోజుకు కనీసం 3 గంటలు సేవలు అందించేలా ప్రైవేట్ విమాన సంస్థలతో కాంట్రాక్టు కుదుర్చుకున్నాయి. కాంట్రాక్టు పద్ధతిలో విమానాలు, హెలికాప్టర్లను ఉపయోగించినా, ఉపయోగించకపోయినా కనీసం 3 గంటల అద్దె మాత్రం తప్పక చెల్లించాలి.
ఇలా ఈసారి ఎన్నికల ప్రచారానికి భారీ ఎత్తున డబ్బు ఖర్చవుతోంది. మరి ఈ లెక్కలన్నీ ఎన్నికల సంఘానికి సమర్పిస్తున్నాయా అంటే... డౌటే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.