దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసిన బీహార్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఎన్డీయే కూటమి తిరిగి అధికారం చేజిక్కించుకుంది. అయితే అంతకుముందు పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసినా.. ఫలితాలు మాత్రం అందుకు విరుద్ధంగా వచ్చాయి. ఒకట్రెండు మినహా.. సర్వేలన్నీ బీహార్ లో ఎన్డీయే పుట్టి మునగడం ఖాయమని.. ఈసారి నితీశ్ ఇంటికేనని తేల్చాయి. బీహార్ లో యువజనం అంతా ఈ దఫా ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ కు జై కొట్టాడని స్పష్టం చేశాయి. కానీ ఫలితాలు మాత్రం ఎవరి ఊహలకు అందని విధంగా వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ దాదాపు అన్నీ తప్పుగా అంచనా వేశాయి. కానీ ఈ ఒక్క సంస్థ మాత్రం తాను చెప్పినట్టే.. బీహార్లో ఎన్నికల ఫలితం వచ్చింది. ఇంతకీ ఏంటా సంస్థ..?
మూడో దశ పోలింగ్ ముగిసిన వెంటనే పలు సంస్థలు బీహార్ లో ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేశాయి. అందులో టైమ్స్ నౌ సీ ఓటర్ సర్వే, రిపబ్లిక్-జన్ కి బాత్, ఏబీపీ-సీ ఓటర్ సర్వే, టీవీ 9 నెట్వర్క్, టుడేస్ చాణక్య.. తదితర సంస్థల అంచనాలన్నీ తప్పాయి. కానీ ఒక్క సంస్థ వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ అక్షరాలా నిజమయ్యాయి. ఆ సంస్థే పొలిటికల్ మార్కర్.
బీహార్ మూడో దశ ముగియగానే ఈ సంస్థ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తూ.. ఈ సారి ఎన్నికల్లో ఎన్డీయేకు 123 నుంచి 135 సీట్లు వస్తాయని చెప్పింది. మహా కూటమికి 104 నుంచి 115 స్థానాలు వస్తాయని.. ఇతరులు పది స్థానాల దాకా గెలుచుకుంటారని వెల్లడించింది. పార్టీల పరంగా కూడా ఆ సంస్థ చెప్పినట్టుగానే ఫలితాలు వచ్చాయి. ఎన్డీయే లో బీజేపీకి 78 నుంచి 88 సీట్లు వస్తాయని.. జేడీ(యూ)కు 40-45 వరకు వస్తాయని అంచనా వేసింది.
అది చెప్పినట్టుగానే... బీహార్ లో ఎన్డీయే కూటమికి 126 సీట్లు.. మహాకూటమికి 110, ఇతరులకు 7 సీట్లు వచ్చాయి. ఇందుకు సంబంధించి ట్విట్టర్ లో పలువురు నెటిజన్లు పొలిటికల్ మార్కర్ వెల్లడించిన సర్వే వివరాలను పోస్టు చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు.
Published by:Srinivas Munigala
First published:November 11, 2020, 12:49 IST