హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ముఖేష్ అంబానీ కుటుంబానికి బెదిరింపు కేసులో ఒకరి అరెస్ట్

ముఖేష్ అంబానీ కుటుంబానికి బెదిరింపు కేసులో ఒకరి అరెస్ట్

కుటుంబసభ్యులతో ముఖేష్ అంబానీ (ఫైల్ ఫోటో)

కుటుంబసభ్యులతో ముఖేష్ అంబానీ (ఫైల్ ఫోటో)

దసరా రోజు ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రికి ఓ ఆగంతకుడు ఫోన్ చేసి ముఖేష్ అంబానీ కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడు. ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో పోలీసులు చెక్ చేశారు. బీహార్‌లోని దర్బంగా జిల్లా నుంచి వచ్చినట్టు గుర్తించారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Mumbai | Bihar

  రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబాన్ని చంపేస్తామంటూ బెదిరించిన కేసులో ఓ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి ఓ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్ 5వ తేదీ మధ్యాహ్నం 12.57 నిమిషాలకు ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ నంబర్‌కు గుర్తు తెలియని నంబర్ నుండి బెదిరింపు వచ్చింది. ముఖేష్ అంబానీ, నీతా అంబానీలను అంతం చేస్తామంటూ ఓ వ్యక్తి  ఫోన్ చేసి బెదిరించాడు. అలాగే, రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిని పేల్చివేస్తానని ఆగంతకుడు హెచ్చరించాడు. దీనిపై డాక్టర్ డిబి మార్గ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ కేసును ముంబై పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ ఫోన్‌‌కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో ప్రాధమికంగా గుర్తించారు. ఆ తర్వాత విచారణ జరపగా అది బీహార్ లోని దర్బంగ జిల్లా నుంచి వచ్చినట్టు తేల్చారు. అక్కడకు వెళ్లిన పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడు ఏ సెల్ ఫోన్ నుంచి ఫోన్ చేసి బెదిరించాడో, దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  దర్బంగా జిల్లాలోని మణిగచ్చి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బ్రహ్మపుర అనే గ్రామానికి చెందిన రాకేష్ కుమార్ అనే యువకుడు ఈ ఫోన్ చేసినట్టు గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి తమతోపాటు ముంబై తీసుకుని వెళ్లారు. ముఖేష్ అంబానీ కుటుంబాన్ని అంతమొదిస్తానంటూ బెదిరింపు కాల్ రావడంతో ముంబై పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు. ఈ కేసు విచారణకు మూడు టీమ్‌లు ఏర్పాటు చేశారు. ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో ట్రేస్ చేశారు. బీహార్ నుంచి వచ్చినట్టు తెలియడంతో అక్కడకు ఓ బృందం వెళ్లింది. అర్ధరాత్రి సమయంలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీసుల సహకారంతో నిందితుడిని అరెస్ట్ చేసినట్టు ముంబై పోలీసులు తెలిపారు.

  ముఖేష్ అంబానీ కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరించిన కేసులో నిందితుడు రాకేష్ కుమార్ మిశ్రా (File)

  అయితే, నిందితుడు రాకేష్ కుమార్ మిశ్రా మతిస్థిమితం లేదనే అంశంపై స్థానిక విలేకరులు బీహార్ పోలీసులను ప్రశ్నించారు. దీనికి సంబంధించి పూర్తి విచారణ జరుగుతోందని, నిపుణులు పరిశీలించిన తర్వాత తెలుస్తుందన్నారు. ఇప్పటి వరకు తాము ఎలాంటి నిర్ధారణ చేయలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాకేష్ కుమార్ మిశ్రా ముంబై పోలీసుల అదుపులో ఉన్నాడు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Mukesh Ambani, Nita Ambani, Reliance Industries

  ఉత్తమ కథలు