POLICE ARE SETTING UP A SERIES OF BASE CAMPS TO THWART THE MAOISTS AT MAHARASHTRA AND CHATISHGHAD BOARDERS KMM VB
Maoist-Police: పోలీసు బలగాల దూకుడు.. వాళ్లకు కలిసి వచ్చే అంశం అదే.. అందుకే ఇలా..
ప్రతీకాత్మక చిత్రం
Maoist-Police: వరుస ఎన్కౌంటర్లు.. పదుల సంఖ్యలో మృతులు.. మావోయిస్టుల పరంగా చూస్తే ఎన్నడూ లేనంత నష్టం. ఏదో తేడా జరుగుతోంది. ఎక్కడో తెలీని నష్టం చోటుచేసుకుంటోంది. ఎక్కడ ఎలాంటి లోపం ఉందో అర్థం కాని స్థితి. అంతా మామూలు గానే ఉన్నట్టు కనిపిస్తున్న మావోయిస్టు ఉద్యమంలో ఎక్కడో ఏదో తెలీని లోటు. అదే పోలీసు బలగాల పాలిట కలిసొచ్చే అంశంగా మారింది.
వరుస ఎన్కౌంటర్లు.. పదుల సంఖ్యలో మృతులు.. మావోయిస్టుల పరంగా చూస్తే ఎన్నడూ లేనంత నష్టం. ఏదో తేడా జరుగుతోంది. ఎక్కడో తెలీని నష్టం చోటుచేసుకుంటోంది. ఎక్కడ ఎలాంటి లోపం ఉందో అర్థం కాని స్థితి. అంతా మామూలు గానే ఉన్నట్టు కనిపిస్తున్న మావోయిస్టు ఉద్యమంలో ఎక్కడో ఏదో తెలీని లోటు. అదే పోలీసు బలగాల పాలిట కలిసొచ్చే అంశంగా మారింది. అదే వారికి పై చేయిని అందించింది. అందిస్తునే ఉంది. ఐదు రాష్ట్రాల పోలీసు బలగాల సంయుక్త ఆపరేషన్లు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయన్నది గత కొన్నేళ్లుగా చూస్తున్నదే. అదే క్రమంలో చత్తీస్ఘడ్- మహారాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 26 మంది మావోయిస్టులు మృతి చెందడం దారుణమైన ఎదురుదెబ్బగా పరిగణిస్తున్నారు. పైగా ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత మిలింద్‌ను కోల్పోవడం మరింత నష్టంగా పరిగణిస్తున్నారు.
బేస్క్యాంపులే కీలకం..
సీఆర్పీఎఫ్.. కోబ్రా.. గ్రేహౌండ్స్.. ఐటీబీపీ.. ఇంకా పారా మిలటరీ సహా రిజర్వు దళాలతో కూడిన అన్ని రాష్ట్రాల సంయుక్త బలగాల కూంబింగ్ టీంల కష్టం ఫలించినట్టే చెప్పుకోవచ్చు. గతంలో ఒక మావోయిస్టు దళం కదలికలను అంచనా వేయడం.. సమాచారం తెప్పించుకోవడం.. విశ్లేషించుకోవడం.. దళాలను అనుసరించి కూంబింగ్ చేయడం.. ఇవన్నీ సమన్వయం చేయాలంటే బలగాలు అందుబాటులో ఉండాలి. ఇదే పెద్ద లోటు.
దీన్ని అధిగమించడానికే ఓ వ్యూహం ప్రకారం పోలీసు ఉన్నతాధికారులు బేస్‌క్యాంపులను పెంచారు. గతంలో అక్కడక్కడా పది కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసిన బేస్ క్యాంపులను ఇప్పుడు మూడు కిలోమీటర్ల పరిధికి కుదించారు. ఇప్పుడు మహారాష్ట్ర, చత్తీస్ఘడ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న దండకారణ్యంలో అక్కడక్కడా కేవలం మూడు కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు చేసిన బేస్‌క్యాంపులు ఇప్పుడు పోలీసు బలగాలకు మరింత ఊపునిస్తున్నాయి. మహారాష్ట్ర- చత్తీస్ఘడ్- తెలంగాణ సరిహద్దుల్లో 45 బేస్‌క్యాంపులు.. కేవలం చత్తీస్ఘడ్- మహారాష్ట్ర సరిహద్దుల్లో 8 బేస్‌క్యాంపులు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
ఈ మూడు రాష్ట్రాల సరిహద్దుల్లోని ఏటపల్లి, కోర్చి, బామ్రాగఢ్, వడ్చా, ధనోరా, గడ్చిరోలి, వెంకటాపూర్, సిరోంచా, ఐరి, చమరోచి, ఆర్మోరిల్లో బేస్‌క్యాంపులు ఏర్పాటు చేశారు. వీటికి తోడు ఏపీలోని ఎటపాకలో ప్రధాన బేస్‌క్యాంపు, వీటికి అనుబంధంగా ఔట్‌పోస్టు బేస్క్యాంపులున్నాయి. ఇంకా ఏపీ- ఒడిషా మధ్య 6 ప్రధాన బేస్‌క్యాంపులు, ఎనిమిది ఔట్‌పోస్టులు ఏర్పాటు చేశారు.
ఇలా మహారాష్ట్రలోని గడ్చిరోలి నుంచి చత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్ వరకు ఇలాంటి ప్రధాన బేస్‌క్యాంపులు 18కి పైగా ఏర్పాటు చేశారు. దీంతో నిఘా వర్గాలకు రకరకాల మార్గాల్లో అందే సమాచారాన్ని ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో విశ్లేషించుకోవడం, చెక్ చేసుకోవడం, రియల్‌టైంలో స్పందించడం సాధ్యమవుతోంది. దీంతో దళాల కదలికలపై నిఘా వర్గాలు సమాచారం ఇవ్వడమే తరువాయి సరిపోయినంత బాలగాలతో కూంబింగ్‌కు వెళ్లడం ఆశించిన మేర ఫలితాలిస్తోందని చెబుతున్నారు. దీనికితోడు మావోయిస్టులకు ఆహారాం, మందులు, నగదు సరఫరా చేసే కొరియర్లను రకరకాల మార్గాల్లో అదుపు చేయడం వల్లే అగ్ర స్థాయి మావోలు సైతం పోలీసులు పన్నిన వలకు దొరుకుతున్నట్టు చెబుతున్నారు. మావోయిస్టు అగ్రనేత మిలింద్ విషయంలో ఈ అనుమానాలు రేకెత్తడం గమనార్హం.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.