ప్రపంచంలోని అత్యంత శక్తిమంతుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన భారత ప్రధాని మోదీ (Indian PM Narendra Modi) ఈ రోజు తన 72వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఆయన 1950 సెప్టెంబరు 17న జన్మించారు. కృషి, క్రమశిక్షణ, పట్టుదలతో ఎంతటి విజయాన్ని అయినా సాధించవచ్చు అనడానికి మోదీ జీవితం చక్కటి ఉదాహరణ. అతి సామాన్య కుటుంబంలో జన్మించి.. పోరాటాల బాటలో.. దేశ ప్రధాని పీఠానికి చేరిన ఆయన ప్రయాణం అందరికీ ఆదర్శం.
మోదీ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) ప్రచారక్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. 2001 నుంచి 2014 మధ్య మూడు పర్యాయాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేశారు. దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల జాబితాలో గుజరాత్‌ను ముందు ఉంచడంలో విజయం సాధించారు. పోరాటాన్నే జీవితంగా ఎంచుకున్న మోదీకి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
* ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా.. ఆయన జీవితం గురించి అంతగా తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు ఇవే..
* ఫోర్బ్స్‌లో 15వ స్థానం: 2014లో ఫోర్బ్స్ మ్యాగజైన్ అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో ప్రధాని మోదీ 15వ స్థానంలో నిలిచారు.
* తొలి ప్రధాని: దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జన్మించిన వ్యక్తుల్లో ప్రధాని అయిన తొలి వ్యక్తి నరేంద్ర మోదీ.
* స్పష్టమైన మెజారిటీ: ఇందిరాగాంధీ తర్వాత వరుసగా రెండోసారి స్పష్టమైన మెజారిటీ సాధించిన తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీ.
* టీ స్టాల్‌లో తండ్రికి సాయం: గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో దామోదర్ దాస్ మోదీ, హీరాబెన్ దంపతులకు జన్మించిన నరేంద్ర మోదీ తన చిన్నతనంలో స్థానిక రైల్వే స్టేషన్‌లోని తన టీ స్టాల్‌లో తన తండ్రికి సాయం చేసేవారు.
* చిన్నతనంలోనే RSS వైపు: మోదీ 8 సంవత్సరాల వయస్సులోనే RSS గురించి తెలుసుకున్నారు. అప్పటి నుంచే RSS సమావేశాలకు హాజరు కావడం ప్రారంభించారు. ఆ సందర్భంలోనే ఆయన లక్ష్మణరావు ఇనామ్‌దార్‌ను కలిశారు. అతను తరువాత అతని గురువు అయ్యారు. సంస్థలో జూనియర్ క్యాడెట్‌గా మోదీ చేరారు.
* RSS ప్రచారక్: 1985లో BJP పార్టీలో చేరే ముందు మోదీ RSS ప్రచారక్‌గా ఎంపికయ్యారు.
* ఎమర్జెన్సీలో అజ్ఞాతంలోకి: మోదీ 1975లో ఎమర్జెన్సీ సమయంలో అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆ సమయంలో RSSపై నిషేధం విధించడంతో మోదీ మారు వేషంలో ప్రయాణించారు. ఈ సంఘటనల క్రమాన్ని వివరిస్తూ గుజరాతీలో మోదీ ఒక పుస్తకాన్ని రాశారు.
ఇది కూడా చదవండి : మోదీకి తెలంగాణ సీఎం బర్త్ డే విషెస్ .. దేశానికి మరింత సేవ చేయాలని కాంక్షించిన కేసీఆర్
* రథయాత్రలో కీలకం: 1990లో ఎల్‌కే అద్వానీ చేపట్టిన రామరథ యాత్రలో నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారు. ఈ యాత్రను విజయవంతం చేశారు.
* సీఎం అయ్యాక శాసనసభకు ఎన్నిక: 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. వివిధ కారణాలతో అప్పటి ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ స్థానాన్ని మోదీ భర్తీ చేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో మోదీ శాసనసభకు ఎన్నికయ్యారు.
* వివేకానందుడి మార్గం: ప్రధాని మోదీ స్వామి వివేకానంద బోధనలను అనుసరిస్తారు. ఆయన మార్గాన్ని పాటిస్తారు.
* గుజరాతీ ఆహారం ఇష్టం: ప్రధాని మోదీ శాఖాహారం, సాధారణ గుజరాతీ ఆహారాన్ని ఇష్టపడతారు. ఆయన నవరాత్రుల సమయంలో 9 రోజుల ఉపవాసాన్ని కూడా పాటిస్తారు. ఉపవాస సమయంలో ఆయన పండ్లు, పండ్ల రసాలు మాత్రమే తీసుకుంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gujarat, Narendra Modi Birthday, National News, PM Narendra Modi