PM NARENDRA MODI TOPS LIST OF MOST POPULAR WORLD LEADERS IN MORNING CONSULT SURVEY SK
Narendra Modi: నరేంద్ర మోదీయే ప్రపంచ నెంబర్ వన్.. ఇంకెవరైనా ఆయన తర్వాతే..
ప్రధాని మోదీ (ఫైల్ ఫొటో)
Narendra Modi: మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన గత సర్వేల్లోనూ నరేంద్ర మోదీయే నెంబర్‌వన్ స్థానంలోనే ఉన్నారు. 2020 మే నెలలో వెల్లడించిన సర్వేలో మోదీకి 84 శాతం ప్రజామోదం లభించింది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) మరోసారి ప్రపంచ నెంబర్ వన్ లీడర్‌గా నిలిచారు. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా ఘనత సాధించారు. అత్యంత ప్రజామోదం ఉన్న దేశాధినేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ అగ్ర స్థానంలో ఉన్నట్లు అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ వెల్లడించింది. అమెరికా మాత్రమే కాదు ఎంతో అభివృద్ధి చెందిన దేశాల అధినేతలు కూడా మోదీ తర్వాతి స్థానాల్లోనే నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మార్నింగ్ కన్సల్ట్ (Morning Consult) అనే సంస్థ సర్వే నిర్వహించింది. ఎవరికి ఎక్కువ పాపులారిటీ ఉందో ప్రజలను అడిగి తెలుసుకుంది. ఇందులో భాగంగా మన దేశంలోనూ సర్వే చేయగా.. నరేంద్ర మోదీకి సానుకూలంగా 71 శాతం మంది, వ్యతిరేకంగా 21 శాతం మంది స్పందించారు.
మొత్తం 13 దేశాల అధినేతలపై మార్నింగ్ కన్సల్ట్ సంస్థ ప్రజల అభిప్రాయాలను సేకరించింది. జనాల్లో ఆ నాయకులకు ఉన్న పాపులారిటీ తెలుసుకునే ప్రయత్నం చేసింది. అప్రూవల్ రేటింగ్స్‌ను ట్రాక్ చేసి.. ఎవరికి అత్యధిక ప్రజాదరణ ఉందో వెల్లడించింది. భారత్‌తో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇటలీ, జపాన్, మెక్సికో, దక్షిణ కొరియా, స్పెయిన్, బ్రిటన్ దేశాధినేతల అప్రూవల్ రేటింగ్స్‌ను తెలుసుకుంది మార్నింగ్ కన్సల్ట్. ఈ సర్వేలో నరేంద్ర మోదీ 71 శాతం రేటింగ్‌తో మొదటి స్థానంలో నిలిచారు. మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రేడర్ 66 శాతంతో రెండో స్థానంలో ఉన్నారు. ఇటలీ ప్రధాని మారియో డ్రాగి 60శాతం ప్రజామోదంతో మూడో స్థానంలో నిలిచారు. ఇక అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఈ 13 దేశాల జాబితాలో బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ చిట్టచివరి స్థానంలో ఉన్నారు. పార్టీగేట్ కుంభకోణంలో చిక్కుకున్న బోరిస్ పట్ల బ్రిటన్‌లో ప్రజా వ్యతిరేకత పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఆయనకు వ్యతిరేకంగా ఎక్కువ మంది స్పందించారు. ఆయన అప్రూవల్ రేటింగ్ మైనస్ 43 వద్ద ఉందంటే.. ఆయనపై ప్రజలు ఏ స్థాయిలో అసంతృప్తితో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. బోరిస్‌ను ఏకంగా 69 శాతం మంది డిజప్రూవ్ చేశారు.
ప్రతి దేశంలో 18 ఏళ్లు పైబడిన వయోజనులు నుంచి అభిప్రాయాలు సేకరించి ఈ రేటింగ్స్‌ను విడుదల చేసింది మార్నింగ్ కన్సల్ట్. ఈ ఏడాది జనవరి 13-16 మధ్య.. మొత్తం ఏడు రోజుల పాటు సర్వే చేశారు. అమెరికాలో సగటున రోజుకు 45 వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించగా.. మిగతా దేశాల్లో మాత్రం సగటున మూడు వేల నుంచి ఐదు వేల మందిని సర్వే చేసింది.
మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన గత సర్వేల్లోనూ నరేంద్ర మోదీయే నెంబర్‌వన్ స్థానంలో ఉన్నారు. 2020 మే నెలలో వెల్లడించిన సర్వేలో మోదీకి 84 శాతం ప్రజామోదం లభించింది. 2021 మేలో నిర్వహించిన సర్వేలో మాత్రం ఆయన రేటింగ్ కాస్త తగ్గింది. 63 శాతం మంది ఆయన పట్ల సానుకూలత వ్యక్తం చేశారు. ఇక ఈ ఏడాది ఆరంభంలో చేసిన సర్వేలో ప్రధాని మోదీకి 71 శాతం ప్రజామోదం లభించింది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.