New Parliament Building: కొత్త పార్లమెంట్‌కు నేడు ప్రధాని మోదీ భూమి పూజ.. ఇవీ విశేషాలు..

కొత్త పార్లమెంట్ భవనం డిజైన్

New Parliament Building: ఢిల్లీలోని సంసద్‌ మార్గ్‌లో నూతన పార్లమెంట్‌ భవన నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

 • Share this:
  కొత్త పార్లమెంట్ భవనానికి నేడు పునాదిరాయి పడనుంది. ఢిల్లీలో సరికొత్త పార్లమెంట్ భవనం నిర్మించాలని నిర్ణయించిన కేంద్రం.. నేడు అందుకు సంబంధించి భూమి పూజ చేయనుంది. ఢిల్లీలోని సంసద్‌ మార్గ్‌లో నూతన పార్లమెంట్‌ భవన నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నూతనంగా నిర్మించనున్న ఈ పార్లమెంట్ భవవం అత్యాధునికంగా ఉండటంతో పాటు భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా కనిపించేలా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. నేడు శంకుస్థాపన చేయనున్న ఈ కొత్త భవనం నిర్మాణాన్ని దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగనున్న 2022 ఆగస్టు 15 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది.

  మొత్తం నాలుగు అంతస్తుల్లో కొత్త పార్లమెంట్‌ భవనం నిర్మాణం కానుంది. ఇందుకోసం రూ.971 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. మొత్తం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించాలని ప్రతిపాదించారు.త్రిభుజకారంలో ఉండే ఈ భవనాన్ని, పర్యావరణ హిత విధానాలను పెద్దపీట వేస్తూ, భూకంపాలను కూడా తట్టుకునేలా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంట్‌ భవనంలో ఉన్న లోక్‌సభ, రాజ్యసభల కంటే ఇందులోని సభలు చాలా పెద్దవిగా డిజైన్ చేశారు. ఈ భవనంలో 888 మంది లోక్‌సభ సభ్యులు, 384 మంది రాజ్యసభ సభ్యులకు సరిపడా చోటు ఉండేలా నిర్మాణం చేయనున్నారు.

  భవిష్యత్తులో సభ్యుల సంఖ్య పెరిగినా.. ఇబ్బంది రాకుండా ఉండేలా ఈ నిర్మాణం ఉండనుంది. దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా అంతర్గత అలంకరణ ఉంటుంది. విశాలమైన సెంట్రల్‌ కాన్‌స్టిట్యూషన్‌ గ్యాలరీని సామాన్య ప్రజలు సైతం సందర్శించవచ్చు. మధ్యాహ్నం మొదలుకానున్న ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ వెంకటేశ్‌ జోషీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణసింగ్‌ తదితరులు పాల్గొంటారు. మొత్తం 200 మంది అతిథులు హాజరవుతారని అధికారులు వెల్లడించారు.
  Published by:Kishore Akkaladevi
  First published: