హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PM Modi: రైతులను రెచ్చగొడుతున్నారు.. విపక్షాలపై ప్రధాని మోదీ ఆగ్రహం

PM Modi: రైతులను రెచ్చగొడుతున్నారు.. విపక్షాలపై ప్రధాని మోదీ ఆగ్రహం

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

PM Modi on New Agri Laws: పశ్చిమ బెంగాల్, కేరళలో మండీలు, ఏపీఎంసీల వ్యవస్థను నాశనం చేసిన వారే.. ఇప్పుడు పంజాబ్ రైతుల విషయంలో మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. కేరళలో ఎందుకు ఆందోళనలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.

రాజకీయాల కోసమే రైతులను రెచ్చగొడుతున్నాయని విపక్షాలపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు చేశారు. పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేయకుండా అక్కడి రైతులకు నష్టం కలిగిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. బెంగాల్‌లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలు చేయని మమతా బెనర్జీపై ఒక్కమాట కూడా మాట్లాడని పార్టీలు.. రైతులకు మేలు చేసే కొత్త వ్యవసాయ చట్టాలపై మాత్రం రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు ప్రధాని మోదీ. పశ్చిమ బెంగాల్, కేరళలో మండీలు, ఏపీఎంసీల వ్యవస్థను నాశనం చేసిన వారే.. ఇప్పుడు పంజాబ్ రైతుల విషయంలో మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. కేరళలో ఎందుకు ఆందోళనలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.

''ఇవాళ రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.18వేల కోట్లు జమయ్యాయి. ఇందులో ఎక్కడా మధ్యవర్తులు లేరు. కమిషన్లు లేవు. కేరళ, పశ్చిమ బెంగాల్‌లో మండీలను నాశనం చేసిన వారే ఇప్పుడు మళ్లీ వాటి గురించి మాట్లాడుతున్నారు. కేరళలో ఎందుకు ఆందోళనలు చేయడం లేదు. మండీల కోసం అక్కడ ఎందుకు ఉద్యమం చేయడం లేదు. కానీ పంజాబ్‌లో మాత్రం రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు.'' అని నరేంద్ర మోదీ అన్నారు.


''కేంద్ర ప్రభుత్వ పథకాలను పశ్చిమ బెంగాల్‌లో అమలు చేయడం లేదు. రైతులకు మేలు చేసే పథకాలను అమలు చేయని ఒకే ఒక్క రాష్ట్రం పశ్చిమ బెంగాల్. మమతా బెనర్జీ సిద్ధాంతాలు రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాయి. రైతులకు వ్యతిరేకంగా ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు నన్ను ఎంతగానో బాధించాయి. దీనిపై విపక్షాలు ఎందుకు మౌనంగా ఉన్నాయి.'' అని నరేంద్ర మోదీ ప్రశ్నించారు.


'' కొత్త చట్టాలతో రైతుల ఆదాయం పెరుగుతుంది. తమ పంటకు ఎక్కడ మంచి ధర వస్తుందో రైతుకు తెలుస్తుంది. ఎక్కడైనా తమ పంటను అమ్ముకునే వీలుంటుంది. రైతులకు ప్రయోజనాలు కలుగుతుంటే మీకు వచ్చిన ఇబ్బందులేంటి? గత ప్రభుత్వాలు రైతులను గాలికొదిలేశాయి. హామీలను అమలు చేయకుండా మరిచిపోయారు. గత ప్రభుత్వాల వ్యవసాయ విధానాల వల్ల పేదలు మరింత నిరుపేదలయ్యారు.'' అని విపక్షాలపై విమర్శలు చేశారు ప్రధాని.



''దేశంలోని చాలా ప్రాంతాల్లో కాంట్రాక్ట్ ఫార్మింగ్ (ఒప్పంద వ్యవసాయం) చేస్తున్నారు. డైరీ సెక్టార్లో కూడా జరిగింది. పాడి పరిశ్రమలలో ఎక్కడైనా గుత్తాదిపత్యం మీకు కనిపించిందా? రైతుల పంట పొలాలు కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్తాయని అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇది నిజం కాదు. ఈ విధానంతో రైతులకే మేలు జరుగుతుంది. ఒకవేళ రైతులకు ఇంకా ఎలాంటి అనుమానాలున్నా వాటిపై మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.'' ప్రధాని మోదీ పేర్కొన్నారు.



కేంద్రాన్ని వ్యతిరేకిస్తున్న వారితోనూ చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని మోదీ అన్నారు. కేవలం ఆత్మనిర్భర్ రైతే.. ఆత్మనిర్భర్ భారత్‌కు పునాది వేయగలడని ఆయన తెలిపారు. కొత్త వ్యవసాయ చట్టాలతోనే ఇది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.

First published:

Tags: Agriculture, New Agriculture Acts, PM Kisan Scheme, PM Narendra Modi

ఉత్తమ కథలు