వారసత్వంగా వస్తున్నాయని చెప్పి, నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను నడపలేమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నాలుగు వ్యూహాత్మక రంగాలు మినహా అన్ని ప్రభుత్వం సంస్థను ప్రైవేటీకరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న వేళ.. ప్రభుత్వ రంగ సంస్థల ప్రవేటీకరణపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. వారసత్వంగా వస్తున్నాయని చెప్పి, నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను నడపలేమని ఆయన స్పష్టం చేశారు. నాలుగు వ్యూహాత్మక రంగాలు మినహా అన్ని ప్రభుత్వం సంస్థను ప్రైవేటీకరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ అన్నారు. వ్యాపారం అనేది అసలు ప్రభుత్వ వ్యవహారమే కాదని తెగేసి చెప్పారు. నష్టాల్లో ఉన్న సంస్థలు ప్రజా ధనంతో నడుస్తున్నాయని.. అలాంటి వాటిని ప్రైవేటీకరించడమే ఉత్తమమన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ లెక్కల విశాఖ స్టీల్ ప్లాంట్ సహా అన్ని పీఎస్యూలపై ప్రధాని మోదీ తేల్చేసినట్లే అర్ధం చేసుకోవాలి.
బుధవారం డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెట్ అండ్ పబ్లిక్ అస్సెట్ మేనేజ్మెంట్ (DIPAM) ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ అంశంపై జరిగిన వెబినార్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రైవేటీకరణపై కీలక వ్యాఖ్యలు చేశారు.
''వారసత్వంగా వస్తున్నాయన్న పేరుతో ప్రభుత్వరంగ సంస్థలను నడపలేం. అలాంటి సంస్థల ఆర్థిక పరిపుష్టికి ఆర్థిక సాయం అందించడం వలన ప్రభుత్వంపై భారం పడుతోంది. అవన్నీ ప్రజాధనంతో నడుస్తున్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. నాలుగు వ్యూహాత్మక రంగాలు మినహా అన్ని ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. వ్యాపారం అనేది ప్రభుత్వ వ్యవహారమే కాదు. వ్యాపార రంగానికి ప్రభుత్వం తనవంతు తోడ్పాటునందిస్తుంది. ప్రభుత్వమే స్వయంగా వ్యాపారం చేయాల్సిన అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో లేదు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం. సంపద సృష్టి, ఆధునికీకరణ నినాదంతో మా ప్రభుత్వం ముందుకెళ్తోంది.'' అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
#WATCH | Govt is responsible to fully support the enterprises & businesses in the country but it is neither necessary nor possible for the govt to run enterprises itself. Government has no business to be in business: PM Narendra Modi pic.twitter.com/OW4C486Xrm
ప్రభుత్వరంగ సంస్థలను స్థాపించినప్పటి పరిస్థితులు వేరని.. నష్టాల్లో ఉన్న సంస్థలను ఇప్పుడు భారంగా మారాయని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 50-60 ఏళ్లనాటి విధానాల్లో సంస్కరణలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాధనాన్ని నష్టాల్లో ఉన్న సంస్థలకు ఖర్చు చేయకుండా.. సద్వినియోగం చేయడమే లక్ష్యంగా సంస్కరణలు తీసుకొస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం వైదొలిగే రంగాలను ప్రైవేటు రంగం భర్తీ చేస్తుందనని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు అవసరమైన బాటలను బడ్జెట్ వేసిందని ఆయన తెలిపారు.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)లో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా పెట్టబడులను ఉపసంహరించుకుంటామని కేంద్రం ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఎల్ఐసీతో పాటు రాబోయే రోజుల్లో ఎయిర్ ఇండియా, భారత్ పెట్రోలింయం కార్పొరేషన్ (BPCL), కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CONCOR), పవన్ హన్స్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SCI), రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ (వైజాగ్ స్టీల్ ప్లాంట్), నీలాచల్ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ (NINL) సంస్థలను ప్రైవేటీకరణ చేస్తామని బడ్జెట్ సందర్భంగా వెల్లడించింది.