ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌తో పాటు 13 మంది భౌతికకాయాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులు అర్పించారు. అనంతరం చనిపోయిన వారి కుటుంబసభ్యులతో మాట్లాడారు. వారిని పరామర్శించారు. తమిళనాడులోని కున్నూరు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌తో పాటు 13 మంది భౌతికకాయాలను ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చారు. C-130J విమానంలో మృతదేహాలను ఢిల్లీ లోని పాలెం ఎయిర్‌పోర్టకు తరలించారు. జనరల్ రావత్, మధులికతో పాటు బ్రిగేడియర్ ఎల్‌ఎస్ లిడ్డర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, వింగ్ కమాండర్ పీఎస్ చౌహాన్, స్క్వాడ్రన్ లీడర్ కే సింగ్, నాయక్ గురుసేవక్‌సింగ్, నాయక్ జితేందర్ కుమార్, లాన్స్‌నాయక్ వివేక్, లాన్స్ నాయక్ బీ సాయితేజ, హవల్దార్ సత్పాల్, జేడబ్ల్యయో దాస్, ప్రదీప్ మృతదేహాలను ప్రత్యేక విమానంలో ఢిల్లీ తీసుకొచ్చారు. పలువురు ప్రముఖులు ఎయిర్‌పోర్ట్‌లో జనరల్ బిపిన్ రావత్‌తో పాటు అమర జవాన్ల భౌతిక కాయానికి నివాళి అర్పించారు. కొద్దిసేపటి క్రితం పాలెం ఎయిర్ బేస్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. రావత్ సహా 13 మంది మృతదేహాలకు నివాళులు అర్పించారు. అంతకుముందు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పార్థీవదేహాలకు నివాళులు అర్పించి.. వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. త్రివిధ దళాధిపతులు కూడా రావత్, ఇతర అధికారులకు నివాళులు అర్పించారు.
అంతకుముందు తమిళనాడులోని సుల్లూరు ఎయిర్‌బేస్ నుంచి ఈ విమానం ఢిల్లీకి బయలుదేరింది. ఎయిర్‌బేస్‌కు అంబులెన్స్‌లు వస్తున్న సమయంలో స్థానికులు అమర జవాన్లకు ఘననివాళి అర్పించారు. జనరల్ రావత్‌తో పాటు ఇతర జవాన్ల మృతదేహాలను తీసుకొస్తున్న అంబులెన్స్‌లపై పూలవర్షం కురిపించారు . బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై కేంద్రం ఇప్పటికే ఉన్నతస్థాయి దర్యాప్తకు ఆదేశించింది. ఎయిర్‌మార్షల్ మాన్వెందర్‌సింగ్ నేతృత్వం లోని త్రిసభ్య కమిటీ విచారణ జరిపి నివేదికను ఇస్తుందని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్‌కు తెలిపారు. ఇదిలా ఉంటే జనరల్ బిపిన్ రావత్ హఠాన్మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రముఖులతో పాటు సామాన్య పౌరులు కూడా ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. రేపు జనరల్ బిపిన్‌రావత్ , ఆయన భార్య మధులిక రావత్ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో జరగనున్నాయి.
Bipin Rawat: శుక్రవారం సాయంత్రం జరగనున్న సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ అంత్యక్రియలు
సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్, రక్షణ సిబ్బంది సహా మొత్తం 14 మందితో ప్రయాణిస్తున్న ఎంఐ17వీ5 హెలికాప్టర్ తమిళనాడులోని కూనురు ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘోర దుర్ఘటనలో రావత్ దంపతులతోపాటు మొత్తం 13 మంది మరణించారు. గ్రూప్ కెప్టెన్ వరుణ్ మాత్రం తీవ్రమైన కాలిన గాయాలతో సజీవంగా బయటపడ్డారు. ఆయన పరిస్థితి కూడా విషమంగానే ఉంది. నిన్న మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో ఊటీ సమీపంలోని కూనురు వద్ద ఈ ఘోరం జరిగింది. రావత్ జీవించే ఉన్నారని... ఆయనకు చికిత్స అందుతోందని మొదట్లో వార్తలు వచ్చాయి. కానీ జనరల్ రావత్ ఇక లేరని సాయంత్రం వైమానిక దళం అధికారికంగా ప్రకటించింది. దీంతో భారతదేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ రావత్ సాహసోపేత రక్షణ ప్రస్థానం అర్ధాంతరంగా ముగిసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Army Chief General Bipin Rawa, Bipin Rawat, Helicopter Crash