Gujarat Elections: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికల తొలి దశ పోలింగ్ గురువారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మొత్తం 56.75 శాతం ఓటింగ్ నమోదైంది. ఎన్నికల రెండో విడత పోలింగ్ ఈ నెల 5న జరుగనుంది. దీంతో ప్రధాన పార్టీల నేతలు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ (Yogi Adithyanath) గురువారం ఆరావళి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) నాయకత్వం ప్రపంచ స్థాయిలో భారతదేశ ఖ్యాతిని పెంచుతోందని యోగి అన్నారు. ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.
* అల్లర్లు లేని రాష్ట్రంగా గుజరాత్
గుజరాత్‌లోని ఆరావళి జిల్లాలో జరిగిన బహిరంగ ర్యాలీలో యోగి మాట్లాడుతూ.. గుజరాత్లో మొదడి విడతగా 89 స్థానాలకు ఓటింగ్ జరుగుతున్న సమయంలోనే.. G20 దేశాలకు నేతృత్వం వహించే బాధ్యతలు మోదీ అందుకున్నారని చెప్పారు.ఈ ఆరావళి పర్వతాలు మొఘల్ ఆక్రమణదారులను ఎదిరించి నిలిచాయని, ఆరావళి శత్రువు ముందు తలవంచడం నేర్చుకోలేదని అన్నారు. గుజరాత్లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావడంతో 2002 తర్వాత అల్లర్లు లేని రాష్ట్రంగా మారిందని యోగి ఆధిత్యనాథ్ చెప్పారు. దాదాపు 20 ఏళ్లుగా గుజరాత్లో అల్లర్లు, కర్ఫ్యూలు లేవని, నేడు మోదీ నాయకత్వంలో భారతదేశం ఉగ్రవాదం, వేర్పాటువాదం నుంచి విముక్తి పొందిందని అన్నారు.
* ఆప్, కాంగ్రెస్‌కు ఓటేసి ప్రయోజనం ఏంటి?
ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ గుజరాత్‌కు, అయోధ్యలోని రామాలయానికి ఉన్న ప్రత్యేక సంబంధాన్ని ప్రస్తావించారు. రథయాత్రకు గుజరాత్ నుంచి వేలా మంది 'కరసేవకులు' తరలివచ్చారని చెప్పారు. ప్రత్యర్థి పార్టీలైన ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌లపై యోగి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ భద్రతకు భరోసానిచ్చే పార్టీకే ఓటు వేయాలని, ప్రపంచ స్థాయిలో భారతదేశ ప్రజాదరణను పెంచాలని ప్రజలను కోరారు. ఆప్, కాంగ్రెస్ ప్రజల విశ్వాసాలను గౌరవించవని చెప్పారు. దేశ భద్రతను పెంచలేరని, ప్రపంచ స్థాయిలో దేశ ఖ్యాతికి ఏ మాత్రం ఉపయోగపడరని ఎద్దేవా చేశారు. అలాంటప్పుడు వారిని ఎన్నుకోవాల్సిన అవసరం ఏంటని? ప్రశ్నించారు.
PM Modi : దేశంలో ఇప్పటివరకు ఏ నాయకుడు నిర్వహించని మెగా రోడ్ షో చేసిన మోదీ
* 140 స్థానాలు దక్కించుకునే లక్ష్యంతో బీజేపీ
గుజరాత్ రాష్ట్రం బీజేపీకి కంచుకోటగా మారింది. అక్కడ వరుసగా ఏడోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. 2001 నుంచి 2014 వరకు సీఎంగా ఉన్న మోదీ.. గుజరాత్లో ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డ్ సొంతం చేసుకున్నారు. 2017 గుజరాత్ ఎన్నికలలో, భారతీయ జనతా పార్టీ మొత్తం 182 సీట్లలో 99 సీట్లను సొంతం చేసుకుంది. గత 27 సంవత్సరాలుగా అక్కడ భాజపా పాలనలో ఉంది. ఈసారి ప్రధాని మోదీ, అమిత్ షా, సీఆర్ పాటిల్ నేతృత్వంలోని బీజేపీ 140 స్థానాలను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో పని చేస్తోంది.
* ప్రముఖులు పోటీ చేస్తున్న స్థానాలు
ఈ ఎన్నికల్లో ప్రముఖులైన.. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి భూపేంద్ర పటేల్, ఘట్లోడియా స్థానం నుంచి పోటీ చేశారు. ఖంభాలియా నుంచి ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదన్ గాధ్వి, విరామ్‌గామ్ నుంచి మాజీ కాంగ్రెస్ నాయకుడు, బీజేపీ అభ్యర్థి హార్దిక్ పటేల్, గాంధీనగర్ సౌత్ నుంచి బీజేపీ కీలక నేత అల్పేష్ ఠాకోర్ పోటీ చేశారు. ఆప్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్, ఇటాలియా కతర్గాం నియోజకవర్గం బరిలో ఉన్నారు. గుజరాత్ హోంమంత్రి హర్ష సంఘవి, మజురా నుంచి పోటీలో ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gujarat Assembly Elections 2022, Narendra modi, Yogi adityanath