PM NARENDRA MODI INAGURATES INDIAN SPACE ASSOCIATION VIRTUALLY SAYS SPACE WILL UNITED WORLD AK GH
Indian Space Association: ఇండియన్ స్పేస్ అసోసియేషన్‌ను ప్రారంభించిన మోదీ.. అంతరిక్ష రంగం ప్రపంచాన్ని ఏకం చేస్తోందన్న ప్రధాని
ప్రధాని మోదీ (ఫైల్ ఫోటో)
ఇండియన్ స్పేస్ అసోసియేషన్‌ను సోమవారం వర్చువల్‌గా ప్రారంభించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతరిక్ష రంగం ప్రపంచాన్ని ఏకం చేస్తోందని చెప్పారు. ఈ రంగం భారత్‌ను కొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా నిలుపుతోందన్నారు.
అంతరిక్ష రంగంలో వాణిజ్యాన్ని ప్రోత్సహించడంలో భారత్ ముందు నుంచి ఆసక్తి చూపుతోంది. ఈ క్రమంలో భారత అంతరిక్ష సంఘాన్ని (Indian Space Association- ISpA) ఏర్పాటు చేశాయి ప్రముఖ సంస్థలు. ఈ ఇండియన్ స్పేస్ అసోసియేషన్‌ను సోమవారం వర్చువల్‌గా ప్రారంభించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతరిక్ష రంగం ప్రపంచాన్ని ఏకం చేస్తోందని చెప్పారు. ఈ రంగం భారత్‌ను కొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా నిలుపుతోందన్నారు. స్పేస్ ఆవిష్కరణలో ప్రైవేట్ రంగానికి స్వేచ్ఛ, ప్రభుత్వం మద్దతు, భవిష్యత్తు కోసం యువతను సిద్ధం చేయడం, అంతరిక్ష రంగాన్ని సామాన్యుడి అభివృద్ధికి ఒక సాధనంగా చూడటం.. వంటి నాలుగు మూల స్తంభాలపై అంతరిక్ష రంగంలో సంస్కరణలు ఆధారపడి ఉన్నాయని ప్రధాని వెల్లడించారు.
‘గతంలో అంతరిక్ష రంగం కేవలం ప్రభుత్వానికి మాత్రమే పరిమితమై ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితులు మారాయి. ఈ రంగంలో ఎన్నో ఆవిష్కరణలను ప్రవేశపెట్టాం. ఎక్స్‌పోనెన్షియల్ ఇన్నొవేషన్ కోసం ప్రభుత్వం, స్టార్టప్‌లు కలిసి పనిచేసేలా మార్గదర్శకాలు రూపొందించాం’ అని మోదీ వివరించారు.
అంతరిక్ష రంగంలో భారతదేశం ఎండ్-టు-ఎండ్ సామర్థ్యాన్ని సాధించిందని మోదీ చెప్పారు. లాంచ్ వెహికల్స్, ఉపగ్రహాలు, గ్రహాంతర అన్వేషణల్లో నైపుణ్యం సాధించిన అతికొద్ది దేశాలలో భారతదేశం ఒకటని తెలిపారు. స్పేస్ ఇండస్ట్రీలో భారత దేశ సమర్ధత, బ్రాండ్ విలువను బలోపేతం చేయాలని.. దీంతోపాటు ఎండ్-టు-ఎండ్ స్పేస్ సిస్టమ్ సప్లై చైన్‌లో భారత్ భాగం కావాలని ప్రధాని పేర్కొన్నారు. స్పేస్ సెక్టార్లో ఒక భాగస్వామిగా ఉండే ప్రభుత్వం.. పరిశ్రమ, యువ ఆవిష్కర్తలు, స్టార్టప్‌లకు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందన్నారు.
‘అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో భారత్ ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. రక్షణ రంగం నుంచి అంతరిక్ష రంగం వరకు.. ప్రైవేట్ రంగానికి ప్రభుత్వం లాంచ్ ప్యాడ్‌గా సేవలందిస్తోంది. ఇస్రో ఫెసిలిటీలను ఇతర సంస్థలకు అందుబాటులో ఉంచుతున్నాం. ఈ రంగంలో అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రైవేట్ కంపెనీలకు బదిలీ చేసి, స్పేస్ ఆస్తులకు ప్రభుత్వం అగ్రిగేటర్‌గా వ్యవహరిస్తుంది’ అని మోదీ వివరించారు. పారదర్శక పాలన, జియో ట్యాగింగ్ ఉపయోగించి ఉపగ్రహ పర్యవేక్షణ, మత్స్యకారులకు సహాయం చేయడం, విపత్తు నిర్వహణకు ప్రణాళికలు రూపొందించడం.. వంటి ఎన్నో అంశాల్లో అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం సహాయపడుతుందని ప్రధాని చెప్పారు.
ISPA అనేది అంతరిక్ష, శాటిలైట్ కంపెనీల ప్రధాన పరిశ్రమ సంఘం. భారతీయ అంతరిక్ష పరిశ్రమను ఒకే గొడుకు కిందకు తీసుకువచ్చేందుకు ఈ సంఘాన్ని స్థాపించారు. ప్రభుత్వం, ప్రభుత్వ ఏజెన్సీలతో సహా భారతీయ అంతరిక్ష డొమైన్లోని అన్ని ప్రధాన వాటాదారులతో కలిపి పనిచేయాలని ఈ సంస్థ యోచిస్తోంది.
లార్సన్ & టూబ్రో, నెల్కో (టాటా గ్రూప్), వన్‌వెబ్, భారతీ ఎయిర్టెల్, మ్యాప్ మై ఇండియా, వాల్చంద్నగర్ ఇండస్ట్రీస్, అనంత్ టెక్నాలజీ లిమిటెడ్ వంటి సంస్థలు ISPAని స్థాపించాయి. గోద్రెజ్, హ్యూస్ ఇండియా, అజిస్టా- BST ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్, BEL, సెంటమ్ ఎలక్ట్రానిక్స్, మాక్సర్ ఇండియా సంస్థలు సైతం ఇందులో సభ్యులుగా ఉన్నాయి. ఈ కొత్త సంస్థకు రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ భట్ డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.