హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PM Narendra Modi: తల్లి మరణించినా.. కర్తవ్య నిర్వహణలో ప్రధాని మోదీ.. బెంగాల్‌లో వందేభారత్ రైలు ప్రారంభం

PM Narendra Modi: తల్లి మరణించినా.. కర్తవ్య నిర్వహణలో ప్రధాని మోదీ.. బెంగాల్‌లో వందేభారత్ రైలు ప్రారంభం

హౌరాలో వందేభారత్ రైలును వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

హౌరాలో వందేభారత్ రైలును వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Narendra Modi: తాను పశ్చిమ బెంగాల్‌కు వచ్చిన రైల్వే అభివృద్ధి పనులను ప్రారంభించాల్సిన ఉన్నా.. వ్యక్తిగత కారణాలతో హాజరుకాలేకపోయానని ప్రధాని మోదీ తెలిపారు. బెంగాల్ ప్రజలను తనను క్షమించాలని అన్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఓవైపు తల్లి మరణించిన బాధ ఉన్నా.. కర్తవ్య నిర్వహణను మాత్రం ప్రధాని మోదీ (PM Narendra Modi) మరవలేదు.  దు:ఖాన్ని ఆపుకుంటూ.. బాధను గుండెల్లో దాచుకొని.. దేశ ప్రధానిగా ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. గాంధీనగర్‌లో తన తల్లి హీరాబెన్ మోదీ అంత్యక్రియలు ముగిసిన వెంటనే.. షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు.  శ్మశాన వాటిక నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లిన ప్రధాని మోదీ.. అక్కడి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో పలు రైల్వే అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు.

కోల్‌కతా మెట్రోకి సంబంధించి కొత్తగా నిర్మించిన జోకా-తరత్లా పర్పుల్ లైన్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ప్రారంభించారు.

ఆ తర్వాత పశ్చిమ బెంగాల్‌కు తొలి వందేభారత్ రైలును అందించారు. హౌరా నుంచి న్యూజల్పాయ్‌గురి మార్గంలో వందే భారత్ రైలును పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. న్యూజల్పాయ్‌గురి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు కూాడా వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు మోదీ.

ఈ సందర్భంగా  నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ''నేను ఇవాళ పశ్చిమ బెంగాల్‌కు రావాల్సి ఉంది. కానీ వ్యక్తిగత కారణాల వల్ల నేను అక్కడికి రాలేకపోయాను. బెంగాల్ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నా. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా దేశంలో 475 వందే భారత్ రైళ్లను ప్రారంభించాలని సంకల్పించాం. ఇవాళ హౌరా-జల్పాయ్‌గురి మార్గంలో ఒక వందే భారత్ రైలు ప్రారంభమైంది.

బెంగాల్‌లోని ప్రతి ఇంచులోనూ స్వాతంత్య్ర ఉద్యమ చరిత్ర ఇమిడి ఉంది. వందేమాతరం ఆలపించిన భూమిలో ఇవాళ వందే భారత్ రైలు ప్రారంభమైంది. మన దేశ చరిత్రలో డిసెంబర్ 30 తేదీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. 1943 డిసెంబర్ 30న నేతాజీ సుభాష్ అండమాన్‌లో భారత స్వాతంత్య్రాన్ని ఆకాంక్షిస్తూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఆ సంఘటన జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2018లో నేను అండమాన్‌కి వెళ్లాను. ఒక ద్వీపానికి నేతాజీ పేరు కూడా పెట్టాను. భారతీయ రైల్వేల ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెడుతోంది. ఇప్పుడు భారతదేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్, తేజస్ ఎక్స్‌ప్రెస్, హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ వంటి ఆధునిక రైళ్లు నిర్మితమవుతున్నాయి. రాబోయే 8 సంవత్సరాలలో రైల్వేల ఆధునీకరణలో కొత్త ప్రయాణాన్ని చేస్తాం. '' అని అన్నారు.

హౌరాలో జరిగిన వందే భారత్ రైలు ప్రారంభోత్స కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాల్గొన్నారు. ప్రధాని తల్లి మృతి పట్ల మమతా బెనర్జీ సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని త్వరగా ముగించి విశ్రాంతి తీసుకోవాలని ప్రధాని మోదీని కోరారు. ''తల్లికి ప్రత్యామ్నాయం లేదు. ఆమె మీ అమ్మే కాదు.. మా అమ్మ కూడా..! నేను కూడా మా అమ్మని చాలా మిస్ అయ్యాను. మీరు ప్రోగ్రామ్‌లో వర్చువల్‌గా చేరడం మాకు చాలా గౌరవం. కార్యక్రమం తర్వాత  విశ్రాంతి తీసుకోండి.'' అని మమతా బెనర్జీ అన్నారు. అనంతరం ప్రధాని మోదీ.. మమతా బెనర్జీకి నమస్కరించి.. వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఆ సమయంలో హౌరా స్టేషన్‌లో ఉన్న ప్రజలు మోదీ-మోదీ అంటూ నినాదాలు చేశారు.

First published:

Tags: Heeraben Modi Passes Away, PM Narendra Modi, West Bengal

ఉత్తమ కథలు