అమెరికా పర్యటనకు వెళ్లిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరుస భేటీల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ప్రముఖ సెమీకండక్టర్, సాఫ్ట్వేర్ సంస్థ క్వాల్కామ్ సంస్థ సీఈవో క్రిస్టియానో అమాన్‌తో మోదీ సమావేశమయ్యారు. భారత్‌లో పెట్టుబడుల గురించి చర్చించారు. భారత్‌లో 5జీ, ప్రైమ్ మినిస్టర్ వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ (పీఎం-డబ్ల్యూఏఎన్‌ఐ) స్కీమ్, కొత్త డ్రోన్ పాలసీ, పబ్లిక్ వైఫై సహా మరికొన్ని అంశాల గురించి చర్చించారు. అలాగే ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్, మ్యానుఫాక్చరింగ్తో పాటు భారత్‌లో సెమీకండక్టర్ల సప్లై చైన్ అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్(పీఎల్ఐ) గురించి సమాలోచలు జరిపారు.
భారత డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్స్‌లో భారత్‌తో కలిసి పని చేసేందుకు క్వాల్కామ్ సీఈవో అమాన్ ఆసక్తి చూపారని, చర్చలు సఫలీకృతమయ్యాయని భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అలాగే భారత్‌లో స్థానిక ఆవిష్కరణల ఎకో సిస్టం గురించి మోదీ.. అమాన్ మధ్య చర్చలు సాగాయి.
Modi in US: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో మోదీ ఏం చర్చించారు?
ప్రధాని మోదీతో సమావేశం తర్వాత క్వాల్కామ్ సీఈవో అమాన్ మీడియాతో మాట్లాడారు. “సమావేశం అద్భుతంగా సాగింది. భారత్‌తో భాగస్వాములవడం మాకు గర్వంగా ఉంది. మేం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. 5జీ ఆధారిత టెక్నాలజీ గురించి చర్చించాం. అలాగే సెమీకండక్టర్ల విషయాన్ని చర్చించాం. మొబైల్ ఫోన్ ఆధారిత ఎకో సిస్టం గురించి సైతం ప్రస్తావన ఉంది. సమావేశం చాలా ఫలవంతంగా సాగింది” అని అమాన్ చెప్పారు.
భారత్ అతిపెద్ద మార్కెట్ అని, చాలా అవకాశాలు ఉన్నాయని క్రిస్టియానో అమాన్ చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అలాగే భారత్ అతి పెద్ద ఎగుమతుల మార్కెట్‌గా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. స్వదేశం కోసం మాత్రమే కాకండా ఇతర దేశాల కోసం కూడా ఉత్పత్తులు చేసేందుకు భారత్‌కు ఇది సరైన సమయమని అమాన్ అభిప్రాయపడ్డారని సమాచారం.
Delhi Court Firing: ఢిల్లీ కోర్టులో కాల్పుల కలకలం.. గ్యాంగ్‌స్టర్ సహా నలుగురు దుర్మరణం
సెమీకండక్టర్ల తయారీ రంగంలో భారత్‌తో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు అమాన్ చెప్పారు. భారత్‌లో ఉత్పత్తులు చేసేందుకు క్వాల్‌కామ్‌కు పూర్తి సహకారం అందిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అలాగే భారత భవిష్యత్ ప్రాజెక్టుల గురించి క్వాల్కామ్ సీఈవో వద్ద మోదీ ప్రధానంగా చర్చించారు. 5జీ కోసం భారత్ సిద్ధంగా ఉందని, నావిక్ ప్రోగ్రామ్‌లో పాల్గొనాలని క్వాల్‌కామ్‌కు సూచించారని సమాచారం.
భారతీయుల నైపుణ్యాలను క్వాల్కామ్ ఇప్పటికే గుర్తించిందని మోదీ చెప్పారు. ఇప్పుడు భారత నైపుణ్యాలను నమ్మి.. దేశంలో ఉత్పత్తి ప్రారంభించాలని సూచించారు. తాము ప్రవేశపెట్టిన కొత్త డ్రోన్ పాలసీని క్వాల్కామ్ వినియోగించుకోవాలని.. దేశంలోని విస్తృత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అమాన్‌తో భారత ప్రధాని చెప్పినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, Pm modi, PM Narendra Modi, Us news