ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలపై శాసన, న్యాయవ్యవస్థల మధ్య సమన్వయం అత్యంత కీలకమని, రెండు వ్యవస్థలూ పరస్పర సహకారంతో ముందుకు వెళితేనే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఉద్ఘాటించారు. కేంద్ర న్యాయ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలోని విగ్యాన్ భవన్ లో శనివారం నాడు సుప్రీంజడ్జిలు, హైకోర్టు సీజేలు, రాష్ట్రాల సీఎంలతో ఉమ్మడి సదస్సును మోదీ, రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని.. కోర్టుల్లో వాడుతోన్న భాషపై కీలక కామెంట్లు చేయగా, ప్రభుత్వాలే కోర్టు ధిక్కారాలకు పాల్పడుతోన్నవైనాన్ని సీజేఐ ఎత్తి చూపారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టుల సీజేలు, పలు రాష్ట్రాల సీఎంలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కోర్టు(న్యాయ) భాష సామాన్యులకు అర్థమయ్యేలా ఉండాలని ప్రధాని మోదీ అన్నారు. కోర్టుల్లో న్యాయ వ్యవహారాలన్నీ ఇంగ్లిష్‌లోనే జరుగుతున్నాయని, అలాకాకుండా స్థానిక భాషలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. స్థానిక భాషలతో సామాన్యులకు న్యాయవ్యవస్థలపై విశ్వాసం పెరుగుతుందనన్నారు.
దేశంలో ప్రధాన సమస్యల పరిష్కారంలో న్యాయవ్యవస్థ పాత్ర కీలకమైనదని, ఆ బలోపేతానికి కేంద్రం మరిన్న చర్యలు తీసుకుంటుందని ప్రధాని మోదీ తెలిపారు. సుప్రీంకోర్టుతోపాటు హైకోర్టు, జిల్లా కోర్టులు బలోపేతమవ్వాలని ప్రధాని సూచించారు. సీఎంలు, హైకోర్టు సీజేలు డిజిటల్ ఇండియా ప్రగతిలో కలిసిరావాలని కోరారు. దేశంలో అసంబద్ధంగా మారిన సుమారు 1800 చట్టాలను గుర్తించామని, వాటిలో 1450 చట్టాలను రద్దుచేశామన్నారు. కానీ రాష్ట్రాలు మాత్రం 75 చట్టాలను మాత్రమే రద్దు చేశాయని వెల్లడించారు.
కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నప్పుడు మనకున్న లక్ష్మణ రేఖను కూడా గుర్తుంచుకోవాలని సీజేఐ రమణ.. జడ్జీలు, సీఎంలను ఉద్దేశించి అన్నారు. ఏపీ సీఎం జగన్ కూడా పాల్గొన్న ఈ సమావేశంలో సీజేఐ మాట్లాడుతూ, కొన్ని ప్రభుత్వాలు కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడంతో ధిక్కరణ కేసులు పెరుగుతున్నాయని, ఇది ప్రజాస్వామ్యానికి అంత ఆరోగ్యకరం కాదన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకే అధిక ప్రాధాన్యం అని, వార్డు సభ్యుడి నుంచి లోక్‌సభ సభ్యుడి వరకు అందరిని గౌరవించాలని సీజేఐ రమణ అన్నారు. అయితే కోర్టుల ఆదేశాలను కొన్ని ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం సరికాదని సీజేఐ వ్యాఖ్యానించారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాల దుర్వినియోగంపైనా సీజేఐ ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు వీటిని 'పర్సనల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్'గా మార్చుతూ.. వ్యక్తిగత వివాదాల పరిష్కారానికి ఉపయోగించుకోవడం బాధాకరమన్నారు.
కేంద్ర న్యాయ శాఖ ఆధ్వర్యంలో ఆరేళ్ల తర్వాత హైకోర్టు సీజేలు, సీఎంల సంయుక్త సమావేశం ఇవాళే జరిగింది. ఈ సదస్సులో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీ సీఎం వైఎస్ జగన్ న్యాయ సదస్సులో పాల్గొనగా, తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం డుమ్మాకొట్టారు. తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయ శాఖ మంత్రి ఇంగ్రకరణ్ రెడ్డి హాజరయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Courts, Delhi, NV Ramana, Pm modi, Supreme Court, Ys jagan