హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PM Modi మరో కీలక ప్రకటన! -ఇక నేరుగా ఇళ్ల వద్దకే -నేడు సీఎంలతో కాన్ఫరెన్స్

PM Modi మరో కీలక ప్రకటన! -ఇక నేరుగా ఇళ్ల వద్దకే -నేడు సీఎంలతో కాన్ఫరెన్స్

ప్రధాని మోదీ

ప్రధాని మోదీ

దేశానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ మరో కీలక ప్రకటన చేయనున్నారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బుధవారం భేటీ కానున్న ఆయన.. కొన్ని జిల్లాల కలెక్టర్లతో నేరుగా మాట్లాడతారు. దేశ చరిత్రలో మైలురాయి లాంటి ఆ నిర్ణయాన్ని సమావేశంలోనే ప్రకటించనున్నారు..

ఇంకా చదవండి ...

కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా భారత ప్రభుత్వం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇవాళ భేటీ కానున్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ సమావేశంలోనే ‘హర్ ఘర్ దస్తక్’ కార్యక్రం ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించనున్నారు. నిజానికి దేశంలో గడిచిన కొద్ది రోజులుగా కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నప్పటికీ, దీపావళి పండుగ తర్వాత మూడో వేవ్ తలెత్తొచ్చన్న భయాల నడుమ వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కేంద్రం భావిస్తున్నది. ఇప్పటికే వ్యాక్సిన్ డోసుల పంపిణీలో 100 కోట్ల మార్కును దాటేయగా, ప్రధాని మోదీ నేడు చేయబోయే ప్రకటన మరో మైలురాయిగా నిలవనుంది..

ఢిల్లీకి చేరుకున్న ప్రధాని..

ఐదు రోజుల విదేశీ పర్యటన ముగించుకుని భారత ప్రధాని మోదీ బుధవారం ఉదయమే ఢిల్లీకి చేరుకున్నారు. ఎయిర్ ఫోర్స్ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఇటలీ, యూకే, స్కాట్లాండ్ పర్యటనల్లో భాగంగా మోదీ.. జీ20 సదస్సు, కాప్ 26 ప్రపంచ వాతావరణ సదస్సులో పాల్గొన్నారు. రోమ్ పర్యటనలో భాగంగా వాటికన్ సిటీని సందర్శించిన మోదీ.. పోప్ ఫ్రాన్సిస్ తోనూ భేటీ కావడం తెలిసిందే. ఢిల్లీలో అడుగుమోపిన వెంటనే మోదీ వ్యాక్సినేషన్ ప్రక్రియపై కీలక సమావేశాలకు ఉపక్రమించారు..

హర్ ఘర్ దస్తక్ అంటే..

కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించిన లెక్కల ప్రకారం దేశంలో మొత్తం కరోనా కేసులు 3.43కోట్లకు, మరణాలు 4.59లక్షలకు పెరిగాయి. నిన్న ఒక్కరోజే 41.16లక్షల మందికి టీకాలు వేశారు. దీంతో ఇప్పటిదాకా పంపిణీ అయిన డోసుల సంఖ్య 107కోట్లకు చేరింది. ఓ వైపు ప్రభుత్వం టీకాలను విరివిగా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నా క్షేత్రస్థాయిలో ఆశించిన పని జరగని ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ ‘హర్ ఘర్ దస్తక్’ పేరుతో ఇంటింటికీ కొవిడ్ వ్యాక్సిన్ల పంపిణీ చేపట్టనుంది. నిజానికి జాతీయ ఆయుర్వేద దినోత్సవం(ధన్వంతరి దివస్)అయిన నవంబర్ 2నే ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని లాంఛ్ చేయాల్సి ఉన్నా, ఆయన విదేశీ పర్యటనలో ఉండటంతలో ఇవాళ్టికి వాయిదా పడింది..

సీఎంలతో కాన్ఫెరెన్స్ లో..

వ్యాక్సినేషన్ ప్రక్రియలో మందకోడిగా సాగుతోన్న 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నాడు భేటీ కానున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, జార్ఖండ్, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్ తదితర 11 రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వర్చువల్ గా జరపబోయే సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా పాలుపంచుకుంటారు. ఆయా రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ మరీ నిదానంగా సాగుతోన్న 40 జిల్లాల కలెక్టర్లతో ప్రధాని మోదీ నేరుగా మాట్లాడతారు. వారికి కీలక సూచనలు చేస్తూనే, ఇదే సమావేశంలో ఇంటింటికీ టీకాల కార్యక్రమాన్ని ప్రధాని లాంచ్ చేస్తారు.

వ్యాక్సిన్లపై విముఖతా..

ముఖ్యమంత్రులతో భేటీలో ప్రధాని మోదీ ప్రధానంగా వ్యాక్సినేషన్ ప్రక్రియలో లోపాలపై దృష్టిసారిస్తారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు వ్యాక్సినేషన్ పట్ల విముఖత చూపిస్తుండటం, మొదటి డోసు తీసుకున్నవారిలో ఏకంగా 11 కోట్ల మంది రెండో డోసు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. అతి పెద్ద రాష్ట్రంలో యూపీలోనే ఆ సంఖ్య 1.6కోట్లుగా ఉండటం గమనార్హం. రెండో డోసు తీసుకోడానికి గడువు ముగిసినా చాలా మంది వ్యాక్సిన్ కేంద్రాలకు రాకపోతుండటం, మొదటి డోసు కూడా తీసుకోనివాళ్ల సంఖ్యా భారీగా ఉన్న నేపథ్యంలో ఇంటింటికీ వ్యాక్సిన్ల పంపిణీ గొప్ప ఫలితాన్నిస్తుందని కేంద్రం భావిస్తున్నది.

First published:

Tags: Coronavirus, Covid vaccine, Covid-19, National News, Pm modi

ఉత్తమ కథలు