హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

పాక్ సరిహద్దులో మోదీ దీపావళి వేడుక -రాజౌరీలో ఆర్మీ జవాన్లతో గడపనున్న ప్రధాని -ఆపై కేదార్‌నాథ్ ఆలయానికి..

పాక్ సరిహద్దులో మోదీ దీపావళి వేడుక -రాజౌరీలో ఆర్మీ జవాన్లతో గడపనున్న ప్రధాని -ఆపై కేదార్‌నాథ్ ఆలయానికి..

కేదార్ నాథ్ లో ప్రధాని మోదీ(పాత ఫొటో)

కేదార్ నాథ్ లో ప్రధాని మోదీ(పాత ఫొటో)

వరుస ఎన్ కౌంటర్లు, కాల్పులు, ఉగ్రదాడులతో భీతిల్లుతోన్న కాశ్మీరీ ప్రజల్లో భరోసా నింపేలా, సరిహద్దులో గస్తీ కాస్తోన్న ఆర్మీ సిబ్బందిలో స్ఫూర్తినింపేలా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళి సంబురాలు జరుపుకోనున్నారు. అటునుంచే కేదార్ నాథ్ ఆలయానికీ వెళ్లనున్నారు..

ఇంకా చదవండి ...

వరుస ఎన్ కౌంటర్లు, కాల్పులు, ఉగ్రదాడులతో భీతిల్లుతోన్న కాశ్మీరీ ప్రజల్లో భరోసా నింపేలా, సరిహద్దులో గస్తీ కాస్తోన్న ఆర్మీ సిబ్బందిలో స్ఫూర్తినింపేలా భారత ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూకాశ్మీర్ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ ఏడాది కూడా ఆయన దీపావళి సంబురాలను ఆర్మీ జవాన్ల మధ్య జరుపుకోనున్నారు. జమ్మూకాశ్మీర్ లో పాకిస్తాన్ సరిహద్దును ఆనుకుని ఉండే రాజౌరీ జిల్లాకు ఆయన వెళ్లనున్నారు. గురువారం నాడు రాజౌరీలోని ఎల్ఓసీ సరిహద్దు చెక్ పోస్టును ప్రధాని సందర్శిస్తారని, అక్కడే ఆర్మీ జవాన్లతో కలిసి దీపావళి వేడుక జరుపుకొంటారని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) ఒక ప్రకటన చేసింది.

మోదీ ప్రధాని అయినప్పటి(2014) నుంచీ ప్రతి ఏటా దీపావళిని దేశసరిహద్దుల్లో సైనికులతో కలిసే జరుపుకొంటున్నారు. గతేడాది రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో సైనికులతో కలిసి మోదీ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. సైనికుల మధ్యకు వచ్చినప్పుడే తనకు అసలైన దీపావళి జరుపుకున్నట్లు అనిపిస్తుందని, సైనికులు ఉత్సాహంగా ఉంటేనే దేశ ప్రజలు ఉత్సాహంగా ఉంటారంటూ గతేడాది మోదీ ఇచ్చిన సందేశం అందరినీ ఆకట్టుకుంది. ఈ ఏడాది దీపావళిని జమ్మూకాశ్మీర్ లోని రాజౌరీలో జరుపుకోనున్న మోదీ ఆ మరుసటిరోజే..

జమ్మూకాశ్మీర్ నుంచి ఉత్తరాఖండ్ వెళ్లనున్న ప్రధాని మోదీ.. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే చార్ ధామ్ యాత్రలో భాగమవుతారు. శుక్రవారం కేదార్ నాథ్ ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం, అక్క‌డ పున‌ర్నిర్మించిన శ్రీ ఆదిశంక‌రాచార్య స‌మాధిని, విగ్రమాన్ని ఆవిష్కరిస్తారు. జమ్మూకాశ్మీర్ చరిత్రలోనే సుదీర్ఘ ఎన్ కౌంటర్ పూంచ్, రాజౌరీ జిల్లాల్లో కొనసాగుతోన్న సమయంలోనే ప్రధాని అక్కడికి వస్తుండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

జమ్మూకాశ్మీర్ లోని రాజౌరీ, పూంఛ్ జిల్లాల అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు చాలా సంవత్సరాల తర్వాత సుదీర్ఘమైన సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గడిచిన నెలరోజులుగా పలు మార్లు ఎన్ కౌంటర్లు చోటుచేసుకున్నాయి. వేర్వేరు ఘటనల్లో ఆర్మీ జవాన్లు, అధికారులు కలిపి మొత్తం 12 మంది అమరులయ్యారు. మరోవైపు కాశ్మీర్ లోని మైదానా పట్టణాల్లోనూ ఉగ్రవాదులు యధేచ్ఛగా కాల్పులకు తెగబడుతుండటంతో కేంద్రం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇటీవలే కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాశ్మీర్ లో మూడు రోజులపాటు పర్యటించారు. ఇప్పుడు ప్రధాని మోదీ కూడా దీపావళిని కాశ్మీర్ లోనే జరుపుకొంటుండటం గమనార్హం.

Published by:Madhu Kota
First published:

Tags: Diwali 2021, Jammu kashmir, Kedarnath, Narendra modi, Pm modi

ఉత్తమ కథలు