ఉక్రెయిన్ ను పూర్తిగా ఆక్రమించుకోడానికి రష్యా తలపెట్టిన యుద్ధంలో ఇప్పటికే వేల మరణాలు చోటుచేసుకోవడం, భారీగా ఆస్తి నష్టం జరిగిన నేపథ్యంలో ఉక్రెయిన్ లో పరిస్థితిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. రెండు దేశాలూ సంయమనం పాటించి, చర్చలకు ఉపక్రమించాలని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో శనివారం ఫోన్ లో మాట్లాడిన మోదీ ఈ మేరకు కీలక సందేశమిచ్చారు. అదే సమయంలో ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయుల తరలిపుపైనా ఆయన సమాలోచనలు జరిపారు.
ఉక్రెయిన్ ఆక్రమణే లక్ష్యంగా యుద్దానికి దిగిన రష్యా.. ఇప్పటికే పలు నగరాలను కైవసం చేసుకుంది. ప్రస్తుతం రష్యా బలగాలు రాజధాని కీవ్ కు చేరువవుతున్నాయి. రష్యాను నిలువరించేందుకు ఉక్రెయిన్ సైన్యం, పౌరులు సిద్ధంగా ఉన్నారన్న వార్తల నేపథ్యంలో కీవ్ నగరంలో రక్తపాతం చోటుచేసుకోవచ్చనే అంచనాలున్నాయి. ఇలాంటి కీలక దశలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇవాళ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ కాల్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడానని, రష్యా దాడులు, దానిని తిప్పికొట్టేందుకు ఉక్రెయిన్ చేస్తున్న ప్రయత్నాలను ఆయనకు వివరించానని తెలిపారు. లక్ష మందికి పైగా దురాక్రమణదారులు తమ మాతృభూమిపై దండెత్తిన విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకువచ్చి, ఐక్యరాజ్యసమితి భద్రత మండలిలో రాజకీయ మద్దతు ఇవ్వమని కోరామని ఆ ట్వీట్లో జెలెన్స్కీ తెలిపారు. రష్యా దాడులు ఆపేలా కలిసికట్టుగా చర్యలు తీసుకోవాలని కోరినట్టు చెప్పారు. కాగా, ఉక్రెయిన్ అధ్యక్షుడితో మోదీ ఏం మాట్లాడారనేదానిపై ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) కొద్ది సేపటి కిందట కీలక ప్రకటన చేసింది.
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా చోటుచేసుకుంటోన్న ప్రాణ, ఆస్తినష్టంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారని, తక్షణం దాడులు ఆపి, చర్చలు ప్రారంభించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడికి సూచించారని పీఎంవో తెలిపింది. ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి ప్రయత్నాల్లో ఎలాంటి సాయం అందించడానికైనా భారత్ సిద్ధంగా ఉన్నట్టు మోదీ తెలియజేశారు.
అదే సమయంలో, ఉక్రెయిన్‌లోని భారతీయులపై, అక్కడ చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థుల భద్రతపై కూడా ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశ పౌరులను సురక్షితంగా ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి పంపేందుకు ఉక్రెయిన్ అధికారులను వేగవంతమైన చర్యలు తీసుకోవాలని జెలెన్స్కీని మోదీ కోరారు. కాగా, భారత ప్రధాని శుక్రవారం నాడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తోనూ ఫోన్లో మాట్లాడటం, ఉక్రెయిన్‌పై దాడులను తక్షణం నిలిపివేయాలని కోరడం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pm modi, Russia-Ukraine War, Ukraine