భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రతా వైఫల్యానికి సంబంధించి సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 5న పంజాబ్ లో చోటుచేసుకున్న ఘటనపై విచారణ జరిపేందుకు ప్రత్యేక కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలోని ఆ కమిటీలో నలుగురు సభ్యులు ఉంటారని, ఈ కమిటీ తక్షణమే దర్యాప్తు చేపడుతుందని, కాబట్టి కేంద్ర సంస్థలు, పంజాబ్ ప్రభుత్వంలోని పలు విభాగాలు కొనసాగిస్తోన్న దర్యాప్తులను వెంటనే నిలిపేయాల్సిందిగా సుప్రీంకోర్టు సోమవారం నాడు ఉత్తర్వులిచ్చింది. విచారణ సందర్బంగా పంజాబ్, కేంద్ర ప్రభుత్వాల తరఫు న్యాయవాదుల మధ్య వాడీ వేడి వాదనలు జరిగాయి..
పంజాబ్ ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని మోదీ ఈనెల 5న అక్కడ పర్యటించగా, రైతుల నిరసనల కారణంగా ఫిరోజ్పూర్ సమీపంలోని ఓ ఫ్లైఓవర్ పై ప్రధాని కాన్వాయ్ సుమారు 20 నిమిషాల పాటు నిలిచిపోయింది. ఆ తర్వాత కూడా ప్రధాని వెనుదిరగాల్సి రావడం, ఆ చోటు పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉండటంతో భద్రతా వైఫల్యం అంశం వివాదాస్పదమైంది. ఆ ఘటనపై కాంగ్రెస్ పాలిత పంజాబ్ సర్కారు, బీజేపీ పాలిత కేంద్ర సర్కారు మధ్య మాటల దాడి కొనసాగుతుండగా, సెక్యూరిటీ బ్రీచ్ కేసులో కేంద్రం తీరును తప్పుపడుతూ, సమగ్ర విచారణకు ఆదేశించాల్సిందిగా పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిని సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం విచారిస్తున్నది. సోమవారం నాటి విచారణలో కొత్త కమిటీ కోర్టు నియమించింది.
ప్రధాని భద్రతా వైఫల్యం ఘటనపై విచారణ కోసం సుప్రీంకోర్టు మాజీ జడ్జి నేతృత్వంలో ఏర్పాటయ్యే కమిటీలో.. చండీగఢ్ డీజీపీ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఇన్స్పెక్టర్ జనరల్(ఐజీ), పంజాబ్, హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, పంజాబ్ అదనపు డీజీపీ సభ్యులుగా ఉంటారని సీజేఐ బెంచ్ ఉత్తర్వుల్లో పేర్కొంది. సుప్రీం కోర్టే కమిటీని నియమించినందున కేంద్రం, పంజాబ్ ప్రభుత్వాలు ప్రస్తుతం కొనసాగిస్తోన్న విచారణ కమిటీలన్నీ నిలిపివేయాలని ధర్మాసనం పేర్కొంది.
మోదీ భద్రతా వైఫల్యం విషయంలో కేంద్రం.. పంజాబ్ సర్కారుపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని పంజాబ్ అడ్వొకేట్ జనరల్ డిఎస్ పట్వాలియా కోర్టుకు తెలిపారు. సెక్యూరిటీ బ్రీచ్ వ్యవహారంలో ఏడుగురు పంజాబ్ అధికారులపై క్రమశిక్షణా ఉల్లంఘన చర్యలకు కేంద్రం నోటీసులు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. నిజంగా పంజాబ్ అధికారులు తప్పు చేసి ఉంటే వాళ్లకు ఉరి శిక్షలైనా వేయండి, కానీ ప్రధాని భద్రతా వైఫల్యం విషయంలో మాత్రం సమగ్రంగా విచారణ జరిపించండని పంజాబ్ ఏజీ పట్వాలియా వ్యాఖ్యానించారు.
పంజాబ్ అడ్వొకేట్ జనరల్ వాదనతో విభేదిస్తూ కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ (ఎస్జీ) తుషార్ మెహతా కోర్టుకు కీలకమైన విషయాలు చెప్పారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) చట్టంలోని నబంధనలు, ప్రధాని భద్రతకు సంబంధించిన బ్లూ బుక్ లోని అంశాలను బట్ట చూస్తే పంజాబ్ ప్రభుత్వానికి ముమ్మాటికీ ఉల్లంఘనే అని, పంజాబ్ ప్రభుత్వం కావాలనే కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని, సదరు అధికారులు కోర్టు విచారణకు రాకపోవడం కూడా తప్పేనని ఎస్జీ మెహతా అన్నారు. ఆ సమయంలో..
కేంద్రం తరఫున ఎస్జీ తుషార్ మెహతా వాదిస్తుండగా, జడ్జిలు అడ్డు తగిలారు. ఈ కేసులో దోషులెవరో తేలకముందే ఫలానా అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్రం నోటీసులు పంపడమేంటని, మీకు మీరే దోషుల్ని తేల్చేస్తే అప్పుడు కోర్టుకు పనేమి ఉంటుందని జడ్జిలు వ్యాఖ్యానించారు. నిజ నిర్ధారణ తర్వాతే ఎవరినైనా దోషిగా పేర్కొనవచ్చని, అయితే ఆ విచారణ ఎవరు చేసారన్నదీ ఇక్కడ ప్రధానాశమేనని, కాబట్టి విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలోని నలుగురు సభ్యుల కమిటీ దర్యాప్తునకు ఆదేశించామని సీజేఐ బెంచ్ పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pm modi, Punjab, Security, Supreme Court