PM MODI SAYS QUAD SUMMIT OPPORTUNITY TO EXCHANGE VIEWS ON DEVELOPMENTS IN INDO PACIFIC GLOBAL ISSUES PVN
Quad Summit : క్వాడ్ సదస్సు కోసం జపాన్ బయలుదేరేముందు మోదీ కీలక వ్యాఖ్యలు
ప్రధాని మోదీ(ఫైల్ ఫొటో)
PM Modi Japan Visit : జపాన్ రాజధాని టోక్యో వేదికగా ఈనెల 24న జరగనున్న క్వాడ్ దేశాధినేతల సమావేశంలో పాల్గొనేందుకు రేపు(మే-23)భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi)జపాన్ వెళ్లనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మోడీ జపాన్, ఆస్ట్రేలియా ప్రధానులు ఫుమియో కిషిద, స్కాట్ మారిసన్‌లతో సమావేశం కానున్నారు.
PM Modi On Quad summit : భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ భాగస్వామ్యంతో ఏర్పాటైన క్వాడ్ కూటమి మే 24న జపాన్ లో సమావేశం కానుంది. హిందూ-పసిఫిక్ సముద్ర తీర దేశాల్లో స్వేచ్ఛాయుత భాగస్వామ్యాలే లక్ష్యంగా చతుర్భుజ భద్రతా కూటమి(Quad)క్వాడ్ ఏర్పాటైంది. జపాన్ రాజధాని టోక్యో వేదికగా ఈనెల 24న జరగనున్న క్వాడ్ దేశాధినేతల సమావేశంలో పాల్గొనేందుకు రేపు(మే-23)భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi)జపాన్ వెళ్లనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మోడీ జపాన్, ఆస్ట్రేలియా ప్రధానులు ఫుమియో కిషిద, స్కాట్ మారిసన్‌లతో సమావేశం కానున్నారు. జపాన్ ప్రధాని కిషిద ఆహ్వానం మేరకు మోడీ టోక్యో వెళ్తున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. సమకాలీన అంతర్జాతీయ సమస్యలు, ఇండో-పసిఫిక్(Indo-Pacific)ప్రాంత పరిణామాలు, క్వాడ్ దేశాల ఉమ్మడి అంశాలపై అగ్రనేతలు పరస్పరం తమ అభిప్రాయాలు పంచుకునేందుకు. భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకునేందుకు ఈ సదస్సు అవకాశం కల్పించనుందని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.
జపాన్(Japan)పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో మోదీ భేటీ అవుతారు. ఈ పర్యటనలో భాగంగా జపాన్‌లో మోదీ 40 గంటలు గడుపుతారు. ఈ 40 గంటల్లో ఆయన మొత్తం 23 సమావేశాల్లో పాల్గొంటారు. 30 మంది జపాన్ సీఈవోలు, దౌత్యవేత్తలు, జపాన్‌లో భారతీయులతోనూ ఆయన సమావేశమవుతారు. జపాన్ పర్యటనకు బయలుదేరే ముందు క్వాడ్ సదస్సు, జపాన్- భారత్ సంబంధాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ గ్రూప్ మొదలుపెట్టిన పలు పనుల పురోగతిని సమీక్షించటం, ఇండో- ఫసిఫిక్ ప్రాంత అభివృద్ధి, అంతర్జాతీయ అంశాలపై ఆలోచనలు పంచుకునేందుకు ఈ సమావేశం గొప్ప అవకాశంగా పేర్కొన్నారు.
మోదీ మాట్లాడుతూ..."ఈ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొననున్నాను. బహుముఖ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ప్రాంతీయ అభివృద్ధి, అంతర్జాతీయ సవాళ్లపై చర్చించనున్నాం. జపాన్ ప్రధాని ఆహ్వానం మేరకు టోక్యో వెళ్తున్నాను. టోక్యో పర్యటన సందర్భంగా.. భారత్- జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్చలు చేపడతాం. ఆ తర్వాత జపాన్‌లో జరగనున్న క్వాడ్ దేశాధినేతల సమావేశంలో పాల్గొంటాను. ఈ గ్రూప్ మొదలుపెట్టిన పనుల పురోగతిని సమీక్షించేందుకు నాలుగు దేశాల నేతలకు ఈ సదస్సు గొప్ప అవకాశం. ఇండో-ఫసిపిక్ ప్రాంత అభివృద్ధి, అంతర్జాతీయ అంశాలపై మా ఆలోచనలను పంచుకోనున్నాం. తొలిసారి క్వాడ్ సదస్సుకు ఆస్ట్రేలియా నూతన ప్రధాని ఆంటోని అల్బనీస్ హాజరవుతారు. ఆయనతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొని ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, పరస్పర ప్రయోజనాల కోసం అంతర్జాతీయ అంశాలపైనా చర్చించనున్నాను"అని మోదీ తెలిపారు. గత మార్చిలో జరిగిన సదస్సులో జపాన్ ప్రధానితో జరిగిన ఒప్పందాలను ఈ సందర్భంగా మోదీ గుర్తు చేసుకున్నారు. భారత్ లో 5 ట్రిలియన్ జపాన్ యెన్ ల పెట్టుబడులకు ఒప్పందం కుదిరినట్లు చెప్పారు. సుమారు 40వేల మంది ప్రవాస భారతీయులు జపాన్‌లో ఉన్నారని, వారే ఇరు దేశాల మధ్య సత్సంబంధాలకు వారిధి అని అన్నారు.
ఇక,ఎప్పటిలాగే ఈసారి కూడా క్వాడ్‌దేశాలు చైనాపై దృష్టి సారించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇండో- పసిఫిక్ సముద్రంలో.. చైనా చేస్తున్న అక్రమ చేపల వేటను సమీక్షించాలని క్వాడ్ యోచిస్తున్నట్లు సమాచారం. ఇండో-పసిఫిక్ సముద్రంలో జరిగే అక్రమ చేపల వేటల్లో 95 శాతం చైనా దేశస్థులవేనని అంచనా. ఈ నేపథ్యంలో అక్కడ ఉపగ్రహ ఆధారిత పర్యవేక్షణను ఏర్పాటు చేయాలని క్వాడ్కూటమి భావిస్తోంది.
కాగా,ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల నేపాల్ లో పర్యటించారు. భారత్- నేపాల్ స్నేహబంధం బలంగా మారడం మొత్తం మానవాళికే ప్రయోజనకరంగా ఉంటుందని మోదీ అన్నారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో ఇరుదేశాల బంధం చాలా కీలకమని మోదీ అన్నారు. అంతకుముందు మే నెల మొదటి వారంలో ప్రధాని మోదీ మూడు రోజులపాటు యూరప్‌లో పర్యటించారు. జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్‌లో ప్రధాని మోదీ 3 రోజుల టూర్లో భాగంగా పలు కీలక భేటీల్లో పాల్గొన్నారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.