దేశంలో చేపట్టిన లైట్ హౌస్ ప్రాజెక్టులపై (Lighthouse projects) ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పద్దతిలో సమీక్ష చేపట్టారు. దేశంలో వివిధ చోట్ల జరుగుతున్న ఈ ప్రాజెక్టుల పురోగతిని డ్రోన్స్ ద్వారా సమీక్షించారు. ఇక, ఈ ఏడాది జనవరి 1న ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆరు లైట్ హౌస్ ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ గృహ నిర్మాణ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడమే లైట్ హస్ ప్రాజెక్టుల ఉద్దేశం. 12 నెలల కాలంలో ఒక్కో సైటులో వెయ్యికి పైగా ఇళ్లను నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వివిధ సైట్లలో 6 లైట్ హౌస్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టారు. ఈ లైట్ హౌస్ ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో ఏ రకమైన సాంకేతికతను వినియోగిస్తున్నారో చూస్తే..
1. ఉత్తరప్రదేశ్ లక్నోలోని లైట్ హౌస్ ప్రాజెక్ట్‌లో కెనడా టెక్నాలజీ వాడుతున్నారు. ఇక్కడ ప్లాస్టర్, పెయింట్స్ ఏమి వినియోగించకుండా.. ముందుగా సిద్దం చేసిన గోడలను ఇళ్ల నిర్మాణానికి ఉపయోగిస్తున్నారు.
2. తమిళనాడు చైన్నైలోని లైట్ హౌస్ ప్రాజెక్టులో యూఎస్, ఫిన్లాండ్ సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఫ్రీకాస్ట్ కాంక్రీట్ సిస్టమ్ ద్వారా ఇళ్ల నిర్మాణాలను వేగంగా, తక్కువ ఖర్చుతో నిర్మిస్తున్నారు.
3. మధ్యపద్రేశ్ ఇండోర్‌లోని లైట్ హౌస్ ప్రాజెక్టులో.. ఇటుకలు, మోర్టార్ గోడలు ఉండవు. వాటికి బదులుగా ప్రీ ఫ్యాబ్రికేటేడ్ శాండ్‌విచ్ ప్యానల్ విధానంలో నిర్మాణాలు చేపడతారు.
4. గుజరాత్ రాజ్‌కోట్‌లోని లైట్ హౌస్ ప్రాజెక్టులో ఫ్రెంచ్ టెక్నాలజీ, మోనోలిథిక్ కాంక్రీట్ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ ఉపయోగించి నిర్మాణాలు చేపడుతున్నారు. విపత్తులు తట్టుకునే సామర్థ్యం ఉండేలా ఇళ్ల నిర్మాణం జరుగుతుంది.
5. జార్ఖండ్ రాంచీలోని లైట్ హౌస్ ప్రాజెక్టులో జర్మనీ 3డీ కన్‌స్ట్రక్షన్ సిస్టమ్‌ను వినియోగిస్తున్నారు. ఇక్కడ ప్రతి గదిని విడిగా తయారు చేస్తారు. తర్వాత వాటిని లెగో బ్లాక్స్ బొమ్మల మాదిరిగా ఒకచోట చేర్చుతారు.
6. త్రిపుర ఆగర్తలోని లైట్ హౌస్ ప్రాజెక్టులో న్యూజిలాండ్ సాంకేతికతను ఉపయోగించి స్టీల్ ఫ్రేమ్‌లతో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. పెద్ద భూకంపాలను తట్టుకునే విధంగా వీటి నిర్మాణం సాగుతుంది.
ఇక, ప్రతిచోట వేలాది ఇళ్లను చాలా వేగంగా నిర్మించనున్నారు. ఇవి ఇంక్యూబేషన్ సెంటర్లుగా పనిచేయనున్నాయి. ఈ నిర్మణాలు ఇండియన్ ప్లానర్స్‌కు, ఆర్కిటెక్ట్స్‌కు, ఇంజనీర్లను, విద్యార్థులు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవడానికి, ప్రయోగాలు చేయడానికి ఇంక్యుబేషన్ కేంద్రాలుగా ఉపయోగించబడతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pm modi, Review meeting