గురజాడ అప్పారావు గురించి తెలియని తెలుగు వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆయన రచనలు ఈనాటికి కూడా సాహితీ ప్రియుల చర్చల్లో ముఖ్యాంశాలుగా ఉంటుంటాయి. తాజాగా కొవిడ్ వ్యాక్సినేషన్ సందర్భంగా ప్రధాని మోదీ గురజాడ అప్పారావు రాసిన కవితలోని చరణాలను ప్రస్తావించడంతో దేశవ్యాప్తంగా కొత్త చర్చ జరుగుతోంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ తరం వారికి కూడా గురజాడ అప్పారావు గారి గురించి అందరికీ తెలుసు. అయితే ఇతర రాష్ట్రాల్లో గురజాడ గురించి తెలియని ఈ తరం వారు కూడా ఆయన గురించి తెలుసుకునేందుకు నెట్టింట జోరుగా వెతుకుతున్నారట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ జిల్లాలో ఎలమంచిలి తాలూకా రాయవరంలో 1862వ సంవత్సరంలో వెంకట రామదాసు, కౌసల్యమ్మ దంపతులకు గురజాడ అప్పారావు జన్మించారు. కొన్నాళ్లకు తండ్రి మరణించడంతో విజయనగరం వచ్చేశారు. మెట్రిక్యులేషన్ వరకు చదువుకున్నారు. విజయనగరం సంస్థాన పూసపాటి గజపతిరాజులతో అప్పారావుకు మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి.
మొదట్లో సారంగధర అనే ఆంగ్ల పద్యాన్ని గురజాడ రాశారు. అయితే ఆంగ్లంలో బదులుగా తెలుగులో రచనలు చేస్తే మంచిదని కొందరు ప్రోత్సహించడంతో ఆ దిశగా ప్రయత్నాలు చేశారు. 1890వ సంవత్సర కాలంలో గురజాడ అప్పారావు కన్యాశుల్కం నాటకాన్ని రాశారు. దాన్ని మహారాజా ఆనంద గజపతికి అంకితమిచ్చారు. తెలుగునాట కన్యాశుల్కం నాటకానికి ఉన్న ఆదరణ అంతా ఇంతాకాదు. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో నాటకాల్లో దీన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. పూర్ణమ్మ, కొండుభట్టీయం, నీలగిరి పాటలు, ముత్యాల సరాలు, కన్యక, సత్యవతీ శతకము, బిల్హణీయం, సుభద్ర, లంగరెత్తుము, దించులంగరు, లవణరాజు కల, కాసులు, మీ పేరేమిటి, దిద్దుబాటు, మతము విమతము, పుష్పాల వికలు.. వంటి ఎన్నో రచనలను గురజాడ చేశారు. ఆయన రాసిన దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా.. అనే పద్యాన్నే ప్రధాని మోదీ కరోనా వేక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం సందర్భంగా ప్రస్తావించారు. దానికి సంబంధించిన పూర్తి పద్యం ఇదే...
దేశమును ప్రేమించుమన్నా
మంచి యన్నది పెంచుమన్నా
వొట్టి మాటలు కట్టిపెట్టోయ్
గట్టి మేల్ తలపెట్టవోయ్
పాడి పంటలు పొంగిపొరలే
దారిలో నువు పాటు పడవోయ్
తిండి కలిగితే కండ కలదోయ్
కండ కలవాడేను మనిషోయ్
ఈసురోమని మనుషులుంటే
దేశమే గతి బాగుపడునోయ్
జల్దుకొని కళలెల్ల నేర్చుకు
దేశి సరకులు నింపవోయ్
అన్ని దేశాల్ క్రమ్మవలె నోయ్
దేశి సరుకుల నమ్మవలెనోయి;
డబ్బు తేలేనట్టి నరులకు
కీర్తి సంపద లబ్బవోయి
వెనక చూసిన కార్యమేమోయి
మంచి గతమున కొంచెమేనోయి
మందగించక ముందు అడుగేయి
వెనుకపడితే వెనకే నోయి
పూను స్పర్థను విద్యలందే
వైరములు వాణిజ్యమందే;
వ్యర్థ కలహం పెంచబోకోయ్
కత్తి వైరం కాల్చవోయ్
దేశాభిమానం నాకు కద్దని
వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్
పూని ఏదైనాను ఒక మేల్
కూర్చి జనులకు చూపవోయ్
ఓర్వలేమి పిశాచి దేశం
మూలుగులు పీల్చే సెనోయ్;
ఒరుల మేలుకు సంతసిస్తూ
ఐకమత్యం నేర్చవోయ్
పరుల కలిమికి పొర్లి యేడ్చే
పాపి కెక్కడ సుఖం కద్దోయ్;
ఒకరి మేల్ తన మేలనెంచే
నేర్పరికి మేల్ కొల్లలోయ్
సొంత లాభం కొంత మానుకు
పొరుగు వానికి తోడుపడవోయ్
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్
చెట్టపట్టాల్ పట్టుకొని
దేశస్థులంతా నడువవలెనోయ్
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నియు మెలగవలెనోయ్
మతం వేరైతేను యేమోయ్
మనసు లొకటై మనుషులుంటే;
జాతమన్నది లేచి పెరిగి
లోకమున రాణించునోయ్
దేశమనియెడి దొడ్డ వృక్షం
ప్రేమలను పూలెత్తవలెనోయ్;
నరుల చమటను తడిసి మూలం
ధనం పంటలు పండవలెనోయ్
ఆకులందున అణగిమణగీ
కవిత కోవిల పలకవలెనోయ్;
పలుకులను విని దేశమందభి
మానములు మొలకెత్తవలెనోయ్